Home కామారెడ్డి హరితంపై మంత్రి ఆరా!

హరితంపై మంత్రి ఆరా!

బాన్సువాడలో మొక్కలకు కంచె, మొరం పనులు
ధప్తర్లలో మొక్కలను పరిశీలించండి
నిర్లక్షం వహించే వారిని ఉపేక్షించేది లేదు

 నాటిన మొక్క రక్షణ అందరిదీ బాధ్యతని సూచన
జిల్లాలో హరితంపై కలెక్టర్ దృష్టి ‘మన తెలంగాణ’ ఎపెక్ట్

Harithaharamబాన్సువాడ డివిజన్ : జిల్లాను హరితవనంగా మార్చాలన్న సంకల్పాన్ని సాధించుకునేందుకు ఇటు రాష్ట్ర మంత్రి పోచారం…అటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. అందుకోసం ఆ విషయంలో నిర్లక్షం వహించే అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడొద్దన్న ఆలోచనకు వచ్చారు. నాటిన ప్రతి మొక్క మొలకెత్తే విధంగా చూడాలని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం మన తెలంగాణ జిల్లా ఎడిషన్‌లో వచ్చిన హరితంలో అలక్షమా…? అనే వార్తకు స్పందించిన పోచారం జిల్లాలో హరితహారం విషయంలో ఆరా తీశారు. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయాలని తుది నివేదికలు తయారు చేయాలని ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో నాటిన మొక్కల లెక్కలను తేల్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడ విత్తిన మొక్కలు వాడి పోయాయన్న విషయంపై పరిశీలను జరుపాలని డివిజన్, మండల స్థాయి అధికారులను మంత్రి ఆదేశించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సైతం అదే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి దృష్టిలో కామారెడ్డి జిల్లాలో హరితం బేష్ అనిపించుకున్న బావనను అదే విధంగా పదిలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జిల్లాను హరితంగా మార్చాలన్న లక్షంతో చర్యలు తీసుకుంటున్నారు. అన్ని మండలాలలో పర్యటించిన కలెక్టర్ ప్రతిచోట ముందుగా హరితం కింద నాటిన మొక్కలను పరిశీలిస్తూవచ్చారు. ఎక్కడైనా నిర్లక్షం జరిగినట్లు కనిపిస్తే అక్కడక్కడ క్షేత్ర స్థాయి పరిపాలకులను చురకలు వేశారు. ఇదిలా ఉంటే జిల్లా ఎస్పీ సైతం ప్రతి ఠాణాను సందర్శించడం అక్కడ మొక్కలు నాటడం వాటి పరిరక్షణకు ఆదేశాలు జారీ చేయడంతో ఠాణాలలో హరితానికి అవకాశం ఏర్పడింది. పోలీసులు మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో నాటిన ప్రతి మొక్క మొలకెత్తి జీవం పోసుకుంటుంది. కాని ఆయా శాఖల ఆవరణలో నాటిన మొక్కలలో నలుభై శాతం కూడా మొలకెత్తే అవకాశాలు కనిపించకుండా ఉన్నాయి. ఈ విషయాలపై మంత్రి అధికారులపై కస్సుబుస్సు మంటున్నారు. పచ్చదనం ప్రగతిలో బాగంగా అందరూ బాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. అధికారులే కాకుండా పార్టీ క్యాడర్ కూడా హరితంలో అడుగుముందుకు వేయాలని సూచిస్తున్నారు.

2017లో హరితహారం ప్రణాళిక ఇలా..
ప్రస్తుత 2017 వ సంవత్సరంలో హరితహారాన్ని ముందుకు తీసుకుపోయేందుకు గాను మంత్రి పోచారంతో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రణాళికను రూపొందించుకున్నారు. అట్టి ప్రణాళికాబద్దంగా జిల్లాలో హరితం పనులను కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 22 మండలాలలో హరితహారం పనులను చేపట్టేందుకు గాను కార్యచరణ ప్రణాళికలు సిద్దం చేశారు. అందులో బాగంగా జిల్లాలొ 130 నర్సరీలు ఏర్పాటు కాగా అందులో నుండి 149 లక్షల విత్తనాలతో పాటు 135 లక్షల మొక్కలను నాటేందుకు గాను ఈ ఏడు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అలాగే పాత మొక్కల పరిరక్షణకు కూడా చర్యలు తీసుకోనున్నారు.

బాన్సువాడలో హరితం పనులు ముమ్మరం
బాన్సువాడ పట్టణంలోని ప్రదాన రహదారి మధ్య డివైడర్లలో నాటిన మొక్కలను పరిరక్షించే చర్యలను మంత్రి పోచారం హుటాహుటిన చేపట్టారు. విత్తన మొక్కలు బలంగా ఏపుగా పెరిగేలా నాణ్యత గల మొరం మట్టిని పోయించేందుకు ఏర్పాట్లు చేశారు. స్థానిక గ్రామ పంచాయితీ సిబ్బందితో అట్టి కంచె, మొరం పనులను తక్షణమే జరిగేలా చర్యలు తీసుకున్నారు. అదే విదంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఏరియాసుపత్రిలో పండ్ల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.