Home తాజా వార్తలు రామప్ప ఆలయ అభివృద్ధికి చర్యలు : ఎర్రబెల్లి

రామప్ప ఆలయ అభివృద్ధికి చర్యలు : ఎర్రబెల్లి

Minister Errabelli Comments On Ramappa Templeవరంగల్‌ : యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప ఆలయ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రపంచ పటంలో కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప ఆలయానికి  చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.  రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందడానికి ప్రభుత్వానికి సహాయ, సహకారాలు అందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పాపారావు, ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ మూర్తిలను మంగళవారం రాంపూర్‌లో మంత్రి  శాలువ కప్పి సన్మానించారు.  ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు.  రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి 11 ఏళ్లుగా   పాపారావు, పాండురంగారావులు ఎనలేని కృషి  చేశారని మంత్రి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2016లో నామినేషన్ ప్రచారాన్ని ప్రారంభించిందని, సిఎం కెసిఆర్ , ప్రధాని నరేంద్ర మోడీతో వ్యక్తిగతంగా మాట్లాడి కాకతీయ కట్టడాల ప్రాధాన్యతను వివరిస్తూ అధికారికంగా లేఖ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2019లో యునెస్కోకు నామినేషన్ సమర్పించినట్లు ఎర్రబెల్లి వెల్లడించారు. యునెస్కో అడిగిన వెంటనే ఆలయ ప్రత్యేకత ను వివరిస్తూ ప్రొఫెసర్ పాండురంగారావు, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ మూర్తి, చింతామణి గోపాల్ వంటి నిపుణలు తయారు చేసిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం యునెస్కో పంపించిందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేసి, తెలంగాణను ఆధ్యాత్మిక తెలంగాణగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.