Tuesday, April 23, 2024

అకాల వర్ష బాధిత రైతులకు అండగా ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణా/జనగామ: ఉరుములు, మెరుపులు, వడగండ్లు, గాలి వానతో రైతంగాన్ని అతలాకుతలం చేసిన అకాల వర్షాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే స్పందించారు. శనివారం సాయంత్రమే సంబంధిత జిల్లాల కలెక్టర్లను, అధికారులను ఫోన్‌లో మాట్లాడి అప్రమత్తం చేసిన మంత్రి ఆదివారం మరోసారి కురిసిన వానలకు నష్ట పోయిన పంటలను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. జరిగిన పంట నష్టాల అంచనాలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి జనగామకు సమీపంలో ఉన్న పెద్ద పహాడ్‌లో అధికారులతో కలిసి పంట నష్టాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితమే ప్రకృతి భీభత్సానికి రైతాంగం బలైంది. స్వయంగా సిఎం కెసిఆర్ ఆయా చోట్ల పర్యటించి రైతుల పంట నష్టాలను పరిశీలించారు. రైతులకు భరోసా కల్పించారు. గతంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు.

ఈ నష్టాలను రైతులు మరిచిపోకముందే మరోసారి వడగండ్లు, అకాల వర్షాలు కురవడం దురదృష్టం. ప్రకృతి ప్రకోపిస్తే తట్టుకోవడం తప్ప చేసేది లేదు. ఇప్పటికే రాష్ట్రంలో అందరికంటే ముందుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు జనగామ జిల్లాలలోనే ప్రారంభించుకున్నాం. దీంతో కొంత మేరకు నష్టాలు తగ్గాయి. ఇంకా పంట చేతికొచ్చే సమయానికి కురిసిన వర్షాలకు రైతులు విలవిలలాడుతున్నారు. వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది. సిఎం కెసిఆర్ మనసున్న మారాజు. రైతు పక్షపాతి తప్పకుండా ఆదుకుంటారు. ఈ విషయాన్ని కూడా సిఎం దృష్టికి తీసుకెళ్ళి రైతులకు తగిన పరిహారం అందేలా చూస్తామని వివరించారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి స్వయంగా పంటలను పరిశీలించి నష్టాన్ని అంచానా వేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే బచ్చన్నపేట్ మండలంలో వరి 15,400 ఎకరాలు, మామిడి 901 ఎకరాలు, జనగామలో వరి 4670, మామిడి 320 ఎకరాలు, రఘునాధ్‌పల్లి మండలంలో వరి 250 ఎకరాలు, మామిడి 11 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని అధికారులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లితో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా వ్యవసాయ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News