Home తాజా వార్తలు లాభాపేక్షతో కాకుండా సామాజిక సేవా దృక్పథంతో సేవలందించాలి

లాభాపేక్షతో కాకుండా సామాజిక సేవా దృక్పథంతో సేవలందించాలి

Minister Etela

 

షాద్‌నగర్: ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు నిరుపేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని లాభాపేక్షతో కాకుండా సామాజిక సేవాదృక్పథంతో సేవలందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ‘జనని చిన్న పిల్లల’ ఆస్పత్రిని మంత్రి ఆదివారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వివిధ రంగాలతోపాటు వైద్యరంగం కూడా విస్తరించిందని, అయితే ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహకులు ధనార్జనేధ్యేయంగా కాకుండా మానవతాదృక్పథంతో సేవ చేయాలనే సంకల్పబలంతో పని చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి గుర్తింపు పొందాలన్నారు. డబ్బు ఎంతమేర ఆర్జించినా ఆశ తీరదని, కానీ మంచి పేరు సంపాధిస్తే అదే పదిలక్షలన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు.

కొంతమంది వైద్యుల కారణంగా వైద్య రంగం కొన్ని విమర్శలను ఎదుర్కొంటుందని, వాటన్నింటిని తిప్పికొట్టాలంటే ప్రైవేటు రంగంలో సైతం నిరుపేదలకు తక్కువ ధరకు మెరుగైన సేవలందించాలన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి స్థాయిని పెంచాలని, ఆ దిశగా కృషి చేస్తే నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేసినవారవుతారన్నారు. పారిశ్రామిక ప్రాంతంతోపాటు హైదరాబాద్‌కు సమీపంలో ఉందని, అన్ని హంగులతో కూడిన సౌకర్యాలు కల్పిస్తే హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వైద్య సేవలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఆ దిశగా తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

మంత్రికి వినతుల వెల్లువ..
షాద్‌నగర్ పట్టణంలోని కొత్తపేట రోడ్డులోగల ఈపిహెచ్‌సిని పునరుద్ధరించాలని కోరుతూ స్థానికులు, అక్కడ పని చేసిన ఉద్యోగులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. అందులో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించి కొందరిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నారని, మిగతావారికి బస్తీ దవాఖానాల్లో అవకాశం కల్పించాలని కోరారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని చించోడ్ పిహెచ్‌సి స్థాయిని పెంచాలని జెడ్పీటిసి వెంకట్‌రాంరెడ్డి మంత్రికి వినతిపత్రం అందజేశారు. చించోడ్‌లో ఆరు మంచాలు మాత్రమే ఉన్నాయని, పరిసర గ్రామాల నుంచి వచ్చే ప్రజల తాకిడి ఎక్కువగా ఉందని, దీంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

బూర్గుల ప్రాథమిక వైద్య కేంద్రంలో 24గంటల సేవలు అందించేలా చూడాలని కోరారు. మధురాపూర్‌లో శాశ్విత భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ ఎమ్మెల్యే బీష్వ కిష్టయ్య, జెడ్పీటిసి వెంకట్‌రాంరెడ్డి, ఎంపిపి ఖాజాఇద్రీస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీర్లపల్లి శంకర్, బీజేపీ నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, చెంది మహేందర్‌రెడ్డి, డాక్టర్లు దిలీప్‌చంద్ర, విజయరాథోడ్, చందునాయక్, నాయకులు అందె బాబయ్య, కృష్ణవేణి, నారాయణరెడ్డి, సూర్యప్రకాష్, తాండ్ర వెంకట్‌రెడ్డి, ఎమ్మె సత్యనారాయణ, నటరాజ్, మంగులాల్‌నాయక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Minister Etela inaugurated Janani Children’s Hospital