Friday, April 26, 2024

ప్రైవేట్‌లో ప్రభుత్వ వైద్యం

- Advertisement -
- Advertisement -

 ప్రతి ఆసుపత్రిలో కరోనా రోగులకు 50శాతం పడకలు ఇచ్చేందుకు యాజమాన్యాలు ఓకే
 ప్రత్యేక యాప్ ద్వారా పేషెంట్లను పంపనున్న ఆరోగ్యశాఖ

 వైద్యశాఖ నిబంధనల ప్రకారమే చికిత్స, లేకపోతే కఠిన చర్యలు
 ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యాలకు మంత్రి ఈటల కృతజ్ఞతలు

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ హస్పిటల్స్‌లో ఇక నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో కోవిడ్ చికిత్స అందనుంది. ప్రతి ఆసుపత్రిలో 50 శాతం బెడ్లతో కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. ప్రత్యేక యాప్ ద్వారా పాజిటివ్ పేషెంట్లను ప్రైవేట్‌కు పంపించేందుకు ఆరోగ్య శాఖ అన్ని రకాల ఏర్పాట్లను చేస్తుంది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ 50 శాతం బెడ్లలో వైద్యశాఖ నిబంధనల ప్రకారమే చికిత్సను అందించాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మరోసారి హెచ్చరించారు. పూర్తి స్థాయి విధివిధానాలను శుక్రవారం హెల్త్ డైరెక్టర్‌తో సమీక్షించి పాటించాలని ప్రైవేట్ యాజమాన్యాలకు మంత్రి సూచించారు.

దీనిలో భాగంగా గురువారం సచివాలయంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికైనా 50 శాతం బెడ్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కరోనా చికిత్స అందించడం కోసం ప్రభుత్వం మొదటి నుంచి తమతో కలసి రావాలని ప్రైవేట్ హాస్పిటల్స్‌కు విజ్ఞప్తి చేసిందన్నారు. కానీ ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రాలేదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కాకుండా అధిక ఫీజులు తీసుకున్నందుకు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేఖిత వచ్చిందన్నారు. ఈక్రమంలో సిఎం ఆదేశాల మేరకు జి.ఓను ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రైవేట్ దోపిడిపై లిఖిత పూర్వకంగా వెయ్యికి పైగా ఫిర్యాదులు అందడం విస్మయానికి గురిచేసిందన్నారు. ఇప్పటికే వీటిలో కొన్నిటికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, మరిన్ని హాస్పిటల్స్‌కు హెచ్చరికలు జారీ చేశామన్నారు. అంతేగాక రెండు ఆసుపత్రులకు అనుమతులు కూడా రద్దు చేశామని తెలిపారు. కరోనా వైద్యం అందించేందుకు సుమారు 100కు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ముందుకు రాగా, 50 హస్పిటల్స్‌పై ఫిర్యాదులు రావడం దారుణమని మంత్రి మండిపడ్డారు. సంక్షోభ సమయంలో కూడా వ్యాపారం చేయవద్దని పలుమార్లు హెచ్చరించినా మాట వినకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈకార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డిఎంఇ డా రమేష్‌రెడ్డి, డిహెచ్ డా శ్రీనివాసరావు, నిపుణుల కమిటీ సభ్యులు డా కరుణాకర్‌రెడ్డి, డా గంగాధర్‌లు పాల్గొన్నారు.

Minister Etela meeting with Private Hospitals Owners

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News