Friday, March 29, 2024

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే గాంధీకి పంపించాలి: ఈటల

- Advertisement -
- Advertisement -

Minister Etela Video Conference

ప్రతి ఆసుపత్రిలో జ్వర, ఇతర సమస్యల ఓపీలు వేర్వేరుగా ఉండాలి
వైరస్ తీవ్రత తక్కువ ఉన్న వారిని జిల్లా ఆసుపత్రుల్లోనే ఐసొలేట్ చేయాలి
కరోనాతో పాటు సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలి
జిల్లా వైద్యాధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించిన మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ సోకి క్రిటికల్ కండిషన్‌లో ఉన్న రోగులను మాత్రమే గాంధీ ఆసుపత్రికి పంపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా వైద్యాధికారులకు సూచించారు. లక్షణాలు లేకుండా, తక్కువ లక్షణాలు ఉన్న వారిని జిల్లా కేంద్రాల్లోనే ఐసొలేట్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులకు తెలిపారు. వైద్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, ప్రజలకు అవగాహన కల్పించి వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత వైద్యాశాఖపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, సీజనల్ వ్యాధుల తీవ్రతను తగ్గించేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలపై ఆయన సచివాలయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఆన్‌లైన్ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యాధికారులు, హాస్పిటల్స్ సూపరింటెండెంట్‌లు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, పిహెచ్‌సి మెడికల్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో వైద్యాధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందు వరుసలో ఉన్న వైద్యులకు సైతం పాజిటివ్ తేలడం బాధకరంగా ఉందన్నారు. కానీ వృత్తిధర్మం, సమాజహితం కోసం వైద్యులు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే జిల్లా ఆసుపత్రులు, పిహెచ్‌సిలలో జ్వర, ఇతర సమస్యల ఓపిలకు వేర్వేరు కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించాలని అన్నారు. అనుమానితులు ఉంటే వారిని హోం క్వారంటైన్ చేసి వారిని 14 రోజుల పాటు పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. అదే విధంగా పాజిటివ్ తేలిన వారిలో తీవ్రత తక్కువ ఉంటే జిల్లా కేంద్రాల్లోనే ఐసొలేట్ చేసి చికిత్సను అందించాలని మంత్రి అధికారులకు సూచించారు.

దీంతో పాటు ప్రస్తుతం సీజనల్ వ్యాధులు సైతం ప్రబలే అవకాశం ఉన్నందున జ్వర బాధితులపై మాత్రం ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని మంత్రి అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశలు, ఎన్‌ఎమ్‌లకు అవగాహన కల్పిస్తూ రోగాల బారిన పడే వారిని గుర్తించాలని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే దీర్ఘకాలిక రోగుల కోసం ప్రత్యేక వాహనాల ద్వారా వైద్యం అందించే ప్రక్రియ కొనసాగుతుందని, ఈ క్రమంలో వారిలోనూ కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయాలని మంత్రి జిల్లా వైద్యాధికారులకు చెప్పారు. ఒక వేళ పాజిటివ్ తేలితే వెంటనే గాంధీకి పంపించాలని మంత్రి అన్నారు. ప్రతి వ్యక్తిని కాపాడవలసిన బాధ్యత వైద్యులపై ఉందని, ఈ మేరకు అందరం సమిష్ఠిగా కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ కమిషనర్ డా యోగితారాణా, డిహెచ్ డా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Minister Etela Video Conference with Health Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News