Saturday, April 20, 2024

ఇన్వెస్ట్ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Begins 'Invest Telangana' Website

 

పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్
ఔత్సాహికులకు అందుబాటులో సంపూర్ణ సమాచారం
త్వరలో అంతర్జాతీయ భాషల్లోనూ అందుబటులోకి
మంత్రులు కెటిఆర్ , జగదీశ్‌రెడ్డి సమక్షంలో వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్శించడంపై తెలంగాణ ప్రభుత్వం గురి పెట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిల సమక్షంలో ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ వెబ్‌సెట్‌ను లాంచ్ చేశారు. గురువారం నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి హరీష్ రావు ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కాగా ఈ వెబ్‌సైట్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, ఇన్వెస్ట్ తెలంగాణ విభాగం కలిసి సంయుక్తంగా రూపొందించింది.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం అవసరమైన సమాచారం అంతా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఈ సందర్భంగా  మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అనే విషయానికి సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరచడం వల్ల పెట్టుబడిదారులు చాలా సులువుగా సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం లభించినట్లు అయిందన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. దీని కోసం అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

పాలనలో పలు సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీని కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా అగ్రస్థానంలో నిలుస్తూ వస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో ప్రమోషన్ విభాగానికి అత్యంత కీలకమైన ప్రాధాన్యత ఉందన్న మంత్రి కెటిఆర్… ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్‌సెట్ పెట్టుబడిదారులకు అవసరమైన సంపూర్ణ సమాచారాన్ని అందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో స్నేహపూర్వక పోటీని కొనసాగిస్తూనే తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.

ఇప్పటికే వెబ్‌సైట్‌లో పలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన లైవ్ లింక్‌లను ఉంచడం జరిగిందన్నారు. తద్వారా ఆయా సేవలను పెట్టుబడిదారులు నేరుగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఈ వెబ్‌సైట్ నుమరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ వెబ్‌సైట్‌ను అంతర్జాతీయ భాషల్లోనూ తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఈ వెబ్‌సైట్‌పైన ఎవరైనా సూచనలు, సలహాలతో పాటు మరింత సమాచారం లేదా ఫీడ్‌బ్యాక్‌ను అందించాలనుకుంటే invest. telangana@telangana.gov.in కు పంపాలని మంత్రి కెటిఆర్ సూచించారు. https://invest.telangana. gov.in/ లింక్ ద్వారా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు అని ఆయన పేర్కొన్నారు.

Minister Harish Rao Begins ‘Invest Telangana’ Website

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News