Saturday, April 20, 2024

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Minister harish rao Inauguration of Hospital at jagtial

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
సాధారణ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందజేత
దేశంలోనే అత్యధికంగా ఆశా కార్యకర్తలకు రూ.9750/- వేతనం
6 నెలలో జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు 50%కు తగ్గించాలి
ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు
టి డయాగ్నొస్టిక్ కేంద్రాలపై ప్రజలలో అవగాహన కల్పించాలి

జగిత్యాల: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లాలోని జనరల్ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ స్థానిక శాసన సభ్యులతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించారు. జిల్లాలోని కొండగట్టు దేవాలయాన్ని, నూకపల్లి లోని సరస్వతి దేవాలయం ను సతీ సమేతంగా సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆంజనేయ స్వామి దర్శించుకున్ని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జగిత్యాల జిల్లాలోని 260 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి,100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి, అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ…. కరోనా సమయంలో అత్యున్నత సేవలు అందించిన ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలో నిర్వహించిన ఇంటింటా జ్వరసర్వే మంచి ఫలితాలు అందించిందని, నీతి ఆయోగ్ సైతం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశంసించిందని మంత్రి తెలిపారు. ఆశా కార్యకర్తలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలకు విధులు నిర్వహించారని, వేతనాలు పెంచమని కోరితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేదని మంత్రి గుర్తుచేశారు.

ఆశా కార్యకర్తలకు ప్రధానమంత్రి గుజరాత్ రాష్ట్రంలో రూ.4000/, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలో రూ.3000/- వేతనాలు మాత్రమే అందిస్తున్నారని ,తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆశా కార్యకర్తల వేతనాన్ని రూ.1500/- నుంచి రూ.9750/- కు పెంచారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు వైద్య సిబ్బందికి మంచి వేతనాలు అందించి, వారి నుంచి మంచి ఫలితాలు తీసుకోవాలనేది సీఎం ఆశయమని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో 30% ప్రసవాలు జరిగాయని, ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వంలో తీసుకున్న చర్యల వల్ల ప్రసవాల సంఖ్య 56% కు చేరిందన్నారు. జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం 44% ప్రసవాలు జరుగుతున్నాయని, రూ.18 కోట్ల వ్యయంతో 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మించామని, 6 మాసాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని మంత్రి కోరారు.

నూతన మత శిశు ఆరోగ్య కేంద్రంలో 12 లేబర్ రూమ్ ఏర్పాటు చేశామని, పిల్లల కేర్ సెంటర్, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని మంత్రి తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచే బాధ్యతను ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తీసుకోవాలని, గర్భిణీలకు అమ్మ ఒడి 102 వాహనంలో ఎ.ఎన్.సి చెకప్ పగడ్బందీగా చేపట్టాలని మంత్రి సూచించారు. జగిత్యాల జిల్లాలో 80% మేర సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, వీటి వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యం పాడవుతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సిజేరియన్ ఆపరేషన్లు శాతాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని, సీజెరియన్ ఆపరేషన్ వల్ల కేవలం 36% పిల్లలకు మాత్రమే ముర్రె పాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. పుట్టిన పిల్లలకు ముర్రె పాలు అందించడం వల్ల వారి ఎదుగుదల, రోగనిరోధకశక్తి పెరుగుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో కొంతమంది మూఢనమ్మకాలతో ముహూర్తాలు చేసుకునే సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారని, దీన్ని నివారించడానికి కలెక్టర్ జిల్లాలోనే పూజరులతో సైతం సమావేశం నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. వైద్యశాఖ లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి 6 నెలలో సీజెరియన్ ఆపరేషన్ 50% కు తగ్గించాలని, సాధారణ ప్రసవాలు నిర్వహించే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి పిలుపునిచ్చారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సమయంలో సైతం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో, సాధారణ ప్రసవాలు చేసుకోవాలని అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 సంవత్సరాల కాలంలో కేవలం 3 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారని, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 33 వైద్య కళాశాలలో ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేయించడం లో ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని మంత్రి ప్రశంసించారు. జగిత్యాల జిల్లాలో 650 పడకల ఆసుపత్రి తో పాటు నూతన వైద్య కళాశాలను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 700 ఉన్న మెడికల్ సీట్ల సంఖ్యను , తెలంగాణ రాష్ట్రంలో 2540 పెంచామని, వచ్చే సంవత్సరం ఈ సంఖ్య 5400 పెరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో, డబల్ ఇంజన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చివరి స్థానంలో ఉందని కేంద్ర సంస్థలు నివేదిక అందించాయని మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ కేంద్రాలు 3 మాత్రమే ఉన్నాయని వాటిని మనం 102 కేంద్రాలకు పెంచుకున్నామని , ధర్మపురి లో మరో డయాలసిస్ కేంద్రం మంజూరు చేశామని, త్వరలో కోరుట్ల చొప్పదండి నియోజకవర్గాల్లో సైతం మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 200 ఐసియు బెడ్ లు ఉంటే , ప్రస్తుతం వాటి సంఖ్య 6000 కు పెంచామని, గతంలో 6 మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండేవని, నూతన రాష్ట్రంలో లో 403 కోట్లు ఖర్చు చేసి అదనంగా 22 మాతా శిశు ఆరోగ్య కేంద్రాల్లో నిర్మించామని మంత్రి తెలిపారు.జిల్లాలో ఎన్.సి.డి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి మందులను అందజేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, వైద్యులు జనరిక్ మెడిసిన్ వినియోగించాలని, బయటుక మందుల చీటీ రాస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 56 రకాల పరీక్షలు పేదలకు ఉచితంగా చేయడానికి టి డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తే పేషెంట్, వైద్యుల ఫోన్ లకు పరీక్ష రిజల్ట్ మెసేజ్ వెళ్తుందని మంత్రి తెలిపారు. టీ డయాగ్నస్టిక్ కేంద్రాల వినియోగంపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సూచించిన విధంగా 7 రోజుల్లో జగిత్యాల లో ప్రత్యేక క్యాంప్ నిర్వహించి,అవసరమైన వారికి Knee రిప్లేస్మెంట్ ఆపరేషన్ నిర్వహిస్తామని, జగిత్యాల ఎమ్మెల్యే కోరిన విధంగా సిటీ స్కాన్ మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ధర్మపురి ఆస్పత్రిలో ఐసియు బెడ్ లను, కోరుట్లలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశామని మంత్రి తెలిపారు. తల్లి బిడ్డ మరణాల తగ్గుదల శాతంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, తమిళనాడు రాష్ట్రానికి సైతం అధిగమించామని మంత్రి తెలిపారు.గతంలో జగిత్యాల ప్రాంతానికి చెందిన నాయకులు మంత్రిగా పని చేసినప్పటికీ మెడికల్ కళాశాల మంజూరు చేయించ లేదని, ప్రస్తుత వాస్తవాలను గమనించి , రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను తెలుసుకోని మాట్లాడాలని ఆయన కోరారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ విద్యా వైద్య రంగాల పై ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. జగిత్యాల జిల్లాలో నూతన వైద్య కళాశాల ను మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. Knee రిప్లేస్మెంట్ ఆపరేషన్లు జగిత్యాల జిల్లాలో సైతం నిర్వహించాలని, ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News