Friday, March 29, 2024

మరి రెండు లిఫ్ట్‌లు

- Advertisement -
- Advertisement -
Minister Harish Rao review with Irrigation officials

సంగారెడ్డి, ఆంథోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సాగునీటి కోసం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు
అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

హైదరాబాద్: సాగునీటి పారుదల రంగంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు సిద్దం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం అరణ్యభవన్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంగారెడ్డి ,ఆందోళ్ ,నారాయణఖేడ్ , జహీరాబాద్ నియోజకవర్గాలకు సాగునీరందేలా కొత్త లిఫ్ట్ స్కీమ్‌లను వీలైనంత వేగంగా రూపొందించాలన్నారు. కొమరవెళ్లి మల్లన్న సాగర్ నుండి కాలువల ద్వారా సింగూరు ప్రాజెక్టుకు వచ్చే నీటిని జహీరాబాద్ , నారాయణఖేడ్ ,ఆందోళ్ నియోజకవర్గాలకు అందచేసేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ నియోజకవర్గాల పరిధిలో సుమారు 2.5లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.

ఈ నాలుగు నియోజకవర్గాలకు తప్పనిసరిగా సాగునీరిందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించినట్టు సమావేశంలో వెల్లడించారు. సిఎం సూచనల మేరకు పకడ్బందిగా ప్రణాళికలు రూపొందించి ఎక్కువ ఆయకట్టుకు సాగునీరందించే ప్రయత్నం చేయాలన్నారు.త్వరలోనే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారుతోపాటు , జిల్లా కలెక్టర్ , ఆర్డీవోలతో సమావేశం నిర్వహిస్తామని ,ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారన్నారు. సమావేశంలో నియోజకవర్గాల వారీగా సాగినీటి పారుదలకు ఉన్న అవకాశాలను సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు.సంగమేశ్వర ,బసవేశ్వర ఎత్తిపోతల పధకాల ద్వారా వీలైనంత అధికంగా నీటిని ఉపయోగించుకునేలా ప్రణాళికలు ఉండాలన్నారు.

సంగారెడ్డి జిల్లా సర్కిల్ పరిధిలోని కాళేశ్వరం ఎత్తిపోతల పధకానికి చెందిన 17,18,19ప్యాకేజిల పనులు వాటి తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. చాలాచోట్ల పనికిరాని యంత్రాలు స్క్రాప్‌గా పడి ఉన్నాయని ,వాటిని ఎప్పకప్పుడు టెండర్లు పిలిచి డిస్పోజ్ చేయాలని సూచించారు. సాగునీటి పారుదల శాఖ ఆధినంలో ఉన్న భూములకు రక్షణ ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి సిఈ వి.అజయ్ కుమార్ , ఎస్‌ఇ మురళీధర్,మెదక్ ఎస్‌ఇ ఏసయ్య, ఇఇ కనగేశ్ , బీమ్‌నాయక్ ,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News