Home తాజా వార్తలు అసలైన అర్హులకే ఇళ్లు : హరీశ్ రావు

అసలైన అర్హులకే ఇళ్లు : హరీశ్ రావు

Ramzan Dress Distributed by Harish Rao

సిద్ధిపేట: సిఎం కెసిఆర్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్న ఘనత తమ సర్కార్ దేనని ఆయన పేర్కొన్నారు. సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాకలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తికావచ్చాయని ఆయన తెలిపారు. ఇళ్లపైన సమీక్షించిన తరువాత హరీశ్ రావు మాట్లాడారు. నిజమైన పేదలకు అత్యంత పారదర్శకంగా ఇళ్ల కేటాయిస్తామని చెప్పారు. రాజకీయ ప్రమేయం లేకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో అబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. సిద్ధిపేటలో 1960, గజ్వేల్‌లో 1300, దుబ్బాకలో 1000, హుస్నాబాద్‌లో 400 ఇళ్లను నిర్మిస్తున్నమని చెప్పారు. ఇళ్ల దరఖాస్తుల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు. దరఖాస్తు ఫారం ప్రభుత్వమే ముద్రించి ఇస్తుందని సూచించారు.

దరఖాస్తుదారు నుంచి పూర్తి వివరాలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల రోజువారీ అవసరాలకు తగిన విధంగా దుకాణాలు, మార్కెట్లతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎవరూ  లంచం ఇవ్వొద్దని, లంచం అశించిన అధికారులపై కఠిన చర్చలు తప్పవన్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. అధికారులు పక్షపాతంగా వ్యవహరించి తప్పులు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకున్న వారిని  వెంటనే అరెస్టు చేస్తామని, అంతేకాకుండా డబ్బులు ఇచ్చిన వారిని అనర్హులుగా పరిగణిస్తామన్నారు. ఇళ్ల ఎంపిక ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండదని హామీ ఇచ్చారు. జులై 9 నుంచి 12 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని చెప్పారు. ఈ జులై 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తుల పరిశీలించి, ఆగస్టు 2వ వారంలో లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని తెలియజేశారు. ఆగస్టు చివరలో లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ, వికలాంగులకు వారి కోటాకు అనుగుణంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతయన్నారు.