Home సూర్యాపేట అభివృద్ధి పథంలో తెలంగాణ

అభివృద్ధి పథంలో తెలంగాణ

Jagadish-Reddy
కెసిఆర్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

* సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
* జిల్లాలో లక్షా18 వేల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటలు విద్యుత్తు
* పూర్తి కావచ్చిన మిషన్ భగీరథ పనులు
* 51 గ్రామాలలో ఆరు వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం
* అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు మోక్షం
* రెండేళ్లలో 35 వేల మంది యాదవులకు గొర్రెల పంపిణీ
* ప్రభుత్వ ఆసుపత్రులకు పెరిగిన ఆదరణ

సూర్యాపేట ప్రతినిధి: కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో తొలిసారిగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో మువ్వెన్నెల పతాకాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతం త్య్ర సంగ్రామంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములై అసువులు బాసిన అమరవీరులకు, తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి ప్రదాతలు దివంగత ఆచార్య జయశంకర్, నీటి పారుదల రంగ నిపుణులు ఆర్.విద్యాసాగర్‌రావులకు ఆయన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలన్న కోణంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన కార్యక్రమాల వల్ల తెలంగాణ రాష్ట్రం 18శాతం ఆదాయంతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. గత నెల 18 నుండి జిల్లాలోని లక్షా18వేల మంది రైతులకు 24 గంట లు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఒక్క సూర్యాపేట జిల్లాలోని వ్యవసాయ రంగానికి 27 వేల కొత్త విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి రోజు వారి 5.4 మిలియన్ యూనిట్లను అందజేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, గృహ అవసరాలకు సరిపోను విద్యుత్తును అందజేయగలుగుతున్నామని తెలిపారు. అందుకోసం జిల్లాలో 773 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. అందులో 661 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగతా పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. చివ్వెం ల మండలం వట్టి ఖమ్మం పహాడ్ వద్ద వంద కోట్ల రూపాయలతో చేపట్టిన 400/220 132 కెవి సబ్ స్టేషన్, 65 కోట్ల రూపాయలతో ముత్యాలనగర్ వద్ద చేపట్టిన 220/132/33 కెవి సబ్‌స్టేషన్లతో పాటు, 600 కిలోమీటర్ల అధిక సామర్థం కలిగిన విద్యుత్తు లైన్లు వేయించామని వివరించారు. అలాగే జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో 27 కోట్ల రూపాయలతో గ్రామీణ విద్యుదీకరణ పనులు, సమగ్ర విద్యుత్తు అభివృద్ధి పథకం పనులు చేపట్టామని తెలిపారు. మరో రెండు కోట్ల రూపాయలతో శివారు గ్రామాలలో విద్యుదీకరణ పనులు పూర్తి చేశామని వెల్లడించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆధునికమైన వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేశామని చెప్పారు.

కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకానికి ప్రజల్లో చక్కటి స్పందన కనిపిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులు జిల్లాలో 65శాతం పూర్తయ్యాయని తెలిపారు. జిల్లాలో 1548 కిలోమీటర్ల నిర్మాణ పనులకుగానూ ఇప్పటి వరకు 1020 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. పాలేరు రిజర్వాయర్ నుండి సూర్యాపేట, తుంగతుర్తి, మోతె సెగ్మెంట్లలో నీరందించేందుకు చేపట్టిన పనులు 80శాతానికి పైబడి పూర్తయ్యాయని ప్రజల హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. జిల్లా కేంద్రంలో పది కోట్ల 57 లక్షల రూపాయలతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. సద్దుల చెరువు ఆధునీకరణ కోసం మరో 16 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో అమృత్ పథకంలో భాగంగా 30 కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరాను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 10 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ సముదాయ నిర్మాణం వేగంగా జరుగుతుందని వెల్లడించారు.

10 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం, హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండు కోట్ల రూపాయలతో ఎనిమిది పార్కులు అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. 2018 అక్టోబర్ రెండు నాటికి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా సూర్యాపేటను మార్చడానికి ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 1200 కోట్ల రూపాయలతో రోడ్లు అభివృద్ధి పర్చనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 274 గొర్రెల పెంపకందారుల సంఘాలలో సభ్యులుగా ఉన్న 35 వేల మంది యాదవ్‌లకు రెండేళ్లలో గొర్రెల యూనిట్లు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే 1300ల యూనిట్లు పంపిణీ చేశామని చెప్పారు. జనహిత పైలట్ ప్రాజెక్టుకు ప్రజల నుండి మంచి స్పందన కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో భాగంగా పట్టణంలోని 13 పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలను అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. గుడుంబా విక్రయిస్తూ జీవించిన వ్యక్తులకు పునరావాస పథకం కింద సూర్యాపేట, చివ్వెంల మండలానికి చెందిన 11 కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున యూనిట్లను పంపిణీ చేశారు.

హరితహారంలో చురుకుగా పాల్గొన్న నడిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హరితమిత్ర అవార్డు కింద రెండు లక్షల రూపాయలు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. రామాపురం గ్రామంలోని 11 మందికి 12 ఎకరాల 57 కుంటల భూమిని పంపిణీ చేశారు. భానుపురి జిల్లా మహిళా సమాఖ్యలోని 707 సంఘాలకు 28 కోట్ల 26 లక్షల 25 వేల రూపాయల చెక్కులను మంత్రి జగదీశ్‌రెడి అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు షీల్డ్‌లు బహుకరించారు. ప్రదర్శనలో పాల్గొన్న ప్రభుత్వ శాఖల శకటాలలో హార్టికల్చర్ శాఖ ప్రథమ బహుమతి, ఆర్‌డబ్లూఎస్ ద్వితీయ, డిఆర్‌డిఓ తృతీయ బహుమతులను గెలుపొందారు. అనంతరం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ సురేంద్రమోహన్, ఎస్పీ పరిమళ హణ నూతన్ కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, జాయింట్ కలెక్టర్ డి.సంజీవరెడ్డి, ట్రైనీ కలెక్టర్ ఉదయ్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, డిఆర్‌ఓ పి.యాదిరెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.