Home జగిత్యాల టిఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధికి పెద్దపీట : మంత్రి కొప్పుల

టిఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధికి పెద్దపీట : మంత్రి కొప్పుల

Koppula Eshwarకోరుట్ల (జగిత్యాల) : టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని రాష్ట్ర షెడ్యూలు కులాల అభివృద్ధి, గిరిజన, బిసి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో 103కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పట్టణ సుందరీకరణ పనులను సోమవారం మధ్యాహ్నం ఆయన భూమిపూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. సెగ్మెంట్ లోని కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో సుమారు 2వందల కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వచ్చిన ఆయనకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగార్‌రావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. మొదట పట్టణంలోని కల్లూర్ రోడ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల పార్టీ శ్రేణులతో, విలేకరులతో సమావేశం నిర్వహించారు. అనంతరం క్యాంపు ఆఫీస్ నుంచి కొత్త బస్టాండ్ వరకు పాదయాత్రగా వచ్చి ఇన్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన పట్టణ సుందరీకరణ పనుల శంకుస్థాపన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నంది చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. సమైక్యాంధ్రలో మున్సిపాలిటీల పరిధిలో జరిగిన అభివృద్ధి శూన్యమని, కేవలం ఆయా పట్టణాల పరిధిలో ప్రజల నుంచి వసూలైన పన్నులతో చేసిన పనులే తప్ప, గత ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన అనంతరం ఏర్పడిన టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు వన్నె తచ్చేవిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో నగరాల సుందరీకరణకు విరివిగా నిధులు కేటాయించారన్నారు. అలాగే దేవాలయాల అభివృద్ధికి కూడా ప్రణాళికాయుతంగా కృషి చేస్తూ వేములవాడ అభివృద్ధికి రూ. 4వందల కోట్లు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు రూ. 50కోట్ల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని వివరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తూ దేశ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా కోటి ఎకరాల వ్యవసాయ భూములకు నీరందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి ప్రారంభించుకోవడం జరిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

2వందల కోట్లతో ‘కోరుట్ల’ సుందరీకరణః ఎమ్మెల్యే సాగర్‌రావు
సుమారు 2వందల కోట్ల రూపాయల నిధులతో కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల సుందరీకరణకు సోమవారం అంకురార్పణ జరిగిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో రోడ్లు, మురికి కాలువలు, గార్డెనింగ్ అభివృద్ధి కోసం రూ. 50కోట్లు, మిషన్ భగీరథ పైప్‌లైన్‌ల ఏర్పాటు కోసం రూ. 53కోట్ల 64లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. అలాగే మెట్‌పల్లి పట్టణంలో రోడ్లు, మురికి కాలువలు, గార్డెనింగ్ కోసం రూ. 50కోట్లు, మిషన్ భగీరథ పైప్‌లైన్‌ల ఏర్పాటు కోసం రూ. 43కోట్ల నిధులు మంజూరైనట్లు వివరించారు. నిధులు మంజూరైనప్పటికీ సుమారు 8నెలలపాటూ కొనసాగిన ఎలక్షన్ కోడ్ మూలంగా ఆగిపోయిన పనులను సోమవారం ప్రారంభించుకున్నామని, త్వరలోనే పనులు పూర్తి చేసి కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల పరిధిలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్లు గడ్డమీది పవన్, మర్రి ఉమారాణి, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్, జిల్లా రైతు సమన్వయ సంఘ చైర్మన్ చీటి వెంకట్రావు, ఎంపిపి తోట నారాయణ, మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ బి.ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఆడెపు కమలామధు, యాటం కరుణాకర్, బట్టు సునీల్, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, ఎంబేరి నాగభూషణం, గండ్ర శిల్ప, రెంజర్ల కళ్యాణి, అన్వర్, కోఆప్షన్ సభ్యులు ఫయీం, నాయకులు పుప్పాల ప్రభాకర్, పోగుల లక్ష్మీరాజం, జక్కుల జగద్వీర్, గుడ్ల మనోహర్, గుండోజి శ్రీనివాస్, గెల్ల గంగాధర్, జాల వినోద్, క్యాతం సృజన్, సనావొద్దీన్, చింతామణి ప్రభు తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రి పర్యటన సందర్భంగా మెట్‌పల్లి డిఎస్పీ నల్ల మల్లారెడ్డి, సిఐ కల్వకుంట్ల సతీష్‌చందర్‌రావుల నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Minister Koppula Eshwar Comments On Development