Home తాజా వార్తలు టిఆర్ఎస్ విచ్ఛిన్నానికి ఈటల కుట్ర : మంత్రి కొప్పుల

టిఆర్ఎస్ విచ్ఛిన్నానికి ఈటల కుట్ర : మంత్రి కొప్పుల

Minister Koppula Eshwar Comments On Etela Rajenderహైద‌రాబాద్ : అధికార టిఆర్ఎస్ ను విచ్ఛిన్నం చేసేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుట్ర పన్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ప్రభుత్వం, సిఎం కెసిఆర్ పై ఈటల చేస్తున్న తప్పుడు ఆరోపణలను తెలంగాణ ప్రజానీకం నమ్మదని ఆయన స్పష్టం చేశారు. టిఆర్ఎస్ అధినాయకత్వం ఈటలను ఎంతో గౌరవించిందని, అయితే పార్టీలో తనకు గౌరవం లేదని ఈటల చెప్పడం సరికాదని ఈశ్వర్ పేర్కొన్నారు. 2003లో ఈటల టిఆర్ఎస్ లో చేరారని, అప్పటి నుంచి ఆయన్ను పార్టీ అక్కున చేర్చుకొని సముచిత గౌరవం ఇచ్చిందని, ఈ విషయాన్ని మర్చి ఈటల కెసిఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనే ఈటలకు కెసిఆర్ మంత్రి పదవి ఇచ్చారని ఆయన తెలిపారు. ఇంతకాలం ప్రభుత్వంలో ఉన్న ఈటల కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విమర్శలు చేయడం, ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేయరాదన్న విషయం ఈటలకు తెలియదా అని ఈశ్వర్ ప్రశ్నించారు. 66 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేసినట్టు ఈటల స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. వ్యాపార విస్తరణ కోసం అసైన్డు భూములను కొనుగోలు చేసినట్టు ఈటల చెప్పడం నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు. ఈటలకు వ్యాపారమే ముఖ్యమని, ప్రజల సంక్షేమం పట్టలేదని ఆయన ధ్వజమెత్తారు. ఎకరం కోటిన్నర పలికే భూమిని కేవలం రూ.6లక్షలకు  ఎందుకు కొనుగోలు చేశారని ఈటలను ఈశ్వర్ నిలదీశారు. దేవ‌ర‌యాంజ‌ల్‌లో దేవాల‌య భూముల‌ను సైతం ఈటల కొనుగోలు చేశారని, దేవాల‌య భూముల‌ని తెలిసి కూడా ఎందుకు కొనుగోలు చేశారని ఈశ్వర్ ఈటలను నిలదీశారు. ఈటల తన అక్రమాలను కప్పిపుచ్చుకుని, ప్రజల్లో సానుభూతి పొందేందుకు సిఎం కెసిఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఈటల మాటలను తెలంగాణ సమాజం హర్షించదని ఈశ్వర్ తేల్చిచెప్పారు.