Home తాజా వార్తలు పేదల చిరునవ్వే ధ్యేయం

పేదల చిరునవ్వే ధ్యేయం

 Minister KRT in the Shadnagar public meeting

వారి కోసం ఎన్ని వేల కోట్ల ఖర్చుకైనా సిఎం సిద్ధం

షాద్‌నగర్ బహిరంగ సభలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ రంగారెడ్డి/ షాద్‌నగర్ : పేద ప్రజల ముఖంలో చిరునవ్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని, వారి ఆనందం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పర్యటనలో భాగంగా పట్టణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాప న చేశారు. ముందుగా కొత్తూరు మండలంలో ని ముఖ్యకూడలిలో పాత జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భాగంగా కొత్తూరు నుండి సోలీపూర్ వరకు రూ.65.57 కోట్లతో నాలుగు లైన్ల బిటి రోడ్డు నిర్మాణానికి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం షాద్‌నగర్ పట్టణానికి చేరుకుని ఎంపిడిఒ కార్యాలయం లో రూ. 6 కోట్లతో ఆడిటోరియం నిర్మాణానికి, పట్టణంలో రూ.5 కోట్ల నిధులతో మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా గుండ్లకుంట శివారులో గల సర్వే నంబరు 7లో 5 ఎకరాల 32 గుం టల విస్తీర్ణంలో 1700 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. అంతకుముందు పట్టణ ముఖ్య కూడలిలో వున్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అక్కడి నుండి నాయకులు, కార్యకర్తలు చేపట్టిన భారీ ర్యాలీతో మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే లక్షంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. షాద్‌నగర్ పట్టణానికి ఎంతో ప్రత్యేక వుందని, 1952 నుండి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి తొలి సిఎం షాద్‌నగర్ ముద్దుబిడ్డ బూర్గుల రామకృష్ణారావు అని ఆయన అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో బూర్గుల రామకృష్ణారావుకు ఇష్టం లేకున్నా తెలుగు భాష ఒక్కటే అని ఆంధ్రను తెలంగాణలో కలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌గా అవరించిన తరువాత అత్యంత దారుణంగా దగా పడ్డ, మోసపోయిన ప్రాంతం ఏదైనా వుందంటే కేవలం పాలమూరు జిల్లానే అనే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిజాం నవాబు పాలనలో హైదరాబాద్ సంస్థానం వున్నప్పుడు ఓ ప్రణాళిక రూపొందించడం జరిగిందని, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ద్వారా పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా, కొంత నల్గొండ జిల్లాలు దాదాపు 175 టిఎంసిల నీళ్లతో 17.50లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే విధంగా నిజాం కాలంలో ప్రణాళిక రూపొందించడం జరిగిందని ఆయన అన్నారు.

ఇదిలా వుండగా బూర్గుల రామకృష్ణారావు పాలమూరు జిల్లా అభివృద్ది కోసం అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు సర్వే చేయించి, నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభమయ్యే సమయంలో తెలంగాణలో ఆంధ్రను కలపడంతో పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు జిల్లాలో వలసలు వుండేవి కాదని, గోదావరి జిల్లాతో పోటీగా పాలమూరు పచ్చదనంగా మారేదని ఆయన తెలిపారు. అప్పట్లో పాలమూరు ముద్దు బిడ్డ కెసిఆర్‌కు పాలమూరు ప్రజలు అండగా నిలబడి ఎంపిగా గెలిపించారని, దీని ద్వారా పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడాడని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో ప్రజలందరితోపాటు కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను తెగించి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బంగారు తెలంగాణ సాధనే లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేశారని ఆయన వివరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ విద్యుత్ సమస్యతో చీకటిలో కూరుకుపోతుందని చెప్పాడని కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే శాశ్వతంగా విద్యుత్ సమస్యలను పరిష్కరించి, రైతులకు, ఇళ్లతో పాటు పరిశ్రమలకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అంధించి తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఆయన వివరించారు.

ప్రక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రంలో కూడా టిఆర్‌ఎస్ పార్టీ స్థాపించాలని, వారు కూడా కెసిఆర్ అభివృద్ది పాలనను కోరుకుంటున్నారని ఆయన ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా 29లక్షల మందికి కేవలం రూ.200ల పించన్ అంధించిందని, మొత్తం రూ.8 వందల కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆసరగా వుండి 43లక్షల మందికి వేయ్యి నుండి 15వందల వరకు పించన్‌లు ఇచ్చి, నాలుగు సంవత్సరాల పాలనలో పేదలకు 5వేల 6వందల కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవాడికి ఇచ్చే రేషన్ బియ్యం మీద కూడా మనిషికి 4 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని, కుటుంబానికి మొత్తం 20 కిలోల వరకు బియ్యం ఇచ్చేలా నిబంధనలు పెట్టిందని, ఇప్పటి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదవారి ఇచ్చే బియ్యంలో నిబంధనలు వద్దని ఒక్కొక్కరికి 6 కిలోలు బియ్యాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు కార్పోరేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అంధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, దీంతో పాటు నాణ్యమైన భోజనాన్ని అంధించేలా కెసిఆర్ కుటుంబంలో ఏవైతే సన్నబియ్యం తింటున్నారో… ప్రతి విద్యార్థి కూడా అదే సన్న బియ్యాన్ని తినేలా సిఎం కెసిఆర్ కృషి చేశారని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వందల గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను అంధిస్తుందని, భవిష్యత్తులో మండలానికి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన అంధించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కెసిఆర్ ఇప్పటికే ప్రకటించినట్లు ఆయన వివరించారు.

నిరుపేద కుటుంబంలో ఆడపిల్ల పుడితే వారి కుటుంబానికి బరోసాగా కుల, మతాలకు అతీతంగా 18 సంవత్సరాలు నిండిన వారికి ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ ద్వారా 1లక్ష 116 రూపాయలు అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. గర్బినీ స్త్రీలకు ప్రసూతికి ముందు తరువాత వారికి 6 నెలలకు నెలకు 12వేల రూపాయలు అందించడం జరుగుతుందని, కెసిఆర్ కిట్టు అంధిచిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కుల వృత్తులకు ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకునేందుకు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు తండాను గ్రామపంచాయతిలుగా గుర్తించిన పాపాన పోలేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేశారని, షాద్‌నగర్ నియోజకవర్గంలో 62 నూతన గ్రామపంచాయతీలు ఏర్పడితే అందులో 40 గిరిజన తండాలు ఉన్నాయని ఆయన వివరించారు. షాద్‌నగర్‌కు రెవెన్యూ డివిజన్‌తో పాటు రెండు మండలాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందిస్తామని, ఒక వేల ఇంటింటికి తాగునీరు అంధించకుంటే ఓట్లు అడగనని చెప్పిన కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం నీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొందుర్గు మండలంలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును నిర్మించేందుకు మన ముఖ్యమంత్రి ప్రతిపాధనలు చేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కేసుల వేయడంతో ప్రాజెక్టు పనులకు ఆటంకం కలుగుతుందని, కాంగ్రెస్ నాయకులు కేసులు వాపస్ తీసుకుంటే ప్రాజెక్టులు ఎప్పుడో మొదలైయ్యేవన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడడం కోసం చనిపోయిన వారి పేరు మీద కూడా దొంగ సంతకాలు పెట్టి మరీ కేసులు వేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రాజెక్టులు పూర్తి చేసి చూపిస్తామని ఆయన తేల్చి చెప్పారు.