Friday, April 26, 2024

బిజెపి చేతిలో చెయ్యి

- Advertisement -
- Advertisement -
Minister KTR Comments on BJP And Congress
హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి
దీనిని కాదు అనే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉందా?
పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిరూపించుకోవాలి కదా!
మరి ఆయన హుజూరాబాద్‌కు ఎందుకు వెళ్లడం లేదు?
కాంగ్రెస్, టిడిపిలు ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌లో గెలుపు టిఆర్‌ఎస్‌దే : తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కెటిఆర్ పంచ్‌లు

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపితో కాంగ్రెస్ పార్టీకి వందకు వంద శాతం కుమ్మక్కు అయిదని టిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు,స రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బిజెపికి లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్ధిని ఎన్నికల బరిలో నిలిపిందన్నారు. పైగా నాన్‌లోకల్ అభ్యర్ధిని ఎన్నికల బరిలోకి దింపిందన్నారు. తాను చేసిన ఈ ఆరోపణను కాదనే దమ్ము పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఉందా? అని నిలదీశారు. కనీసం కాంగ్రెస్ అభ్యర్ధికి డిపాజిట్ వస్తుందని చెప్పే దమ్ము కూడా రేవంత్‌కు లేదన్నారు. ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాక తనను తాను నిరూపించుకోవాలి కదా.. మరి ఎందుకు హుజూరాబాద్‌కు వెళ్లడం లేదని కెటిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపిలు కలిసి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా…హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేది టిఆర్‌ఎస్సే అని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. కారు స్పీడుకు ప్రతిపక్షాలు చెల్లాచెదురుకావడం తథ్యమన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మంత్రి కెటిఆర్ చిట్‌చాట్ చేశారు.

ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన స్పందించారు. అలాగే తనదైన శైలిలో ప్రతిపక్ష నేతలపై పంచులు విసిరారు. హుజూరాబాద్ సెగ్మెంట్ మొదచి నుంటి టిఆర్‌ఎస్ కుంచుకోట అని అన్నారు. ఆ కోటలో కారు వెళ్లాలే తప్ప…మరొకరు వెళ్లలేరన్నారు. ప్రతిపక్షాలు కోట కాదు కదా…కనీసం కోట బయటి గేటను కూడా తాకలేరన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సిఎం కెసిఆర్ పాలన పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. అలాంటిప్పుడు ప్రజలు ఇతర పార్టీల వైపు చూసే అవకాశమే లేదన్నారు. ప్రతిపక్షాలు ఎంత గోబెల్స్ ప్రచారం చేసినా…హుజూరాబాద్ ఎన్నికల్లో అత్యంత భారీ మెజార్టీతో  టిఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు గెలువబోతున్నారన్నారు. రాష్ట్రం లో అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పథకాలను స్పూర్తిగా తీసుకుని అనేక కార్యక్రమాలను ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. హుజూరాబాద్ కచ్చితంగా టిఆర్‌ఎస్‌కు చిన్న ఎన్నికేనని మరోసారి పునరుద్ఘాటించారు. అయితే రాష్ట్రంలో టిఆర్‌ఎస్ సాధిస్తూన్న వరస విజయాలు మీడియాకు కనపడవన్నారు.

విజినరీ ఉన్న నేత కెసిఆర్

సిఎం కెసిఆర్ ఒక విజినరీ ఉన్న నేత అని కెటిఆర్ అభివర్ణించారు. ప్రతిపక్షాలు కేవలం టెలివిజనరీ నేతలని వ్యా ఖ్యానించారు. వారు కేవలం టివిలో కనిపించడానికే పెద్దఎత్తున షో చేస్తుంటారన్నారు. కానీ కెసిఆర్ అలా కాదన్నారు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక ఎంతో కసరత్తు ఉంటుందన్నారు. అందుకే కెసిఆర్ వేసే ప్రతి అడుగులో ఎంతో పరిణితి ఉంటుందన్నారు.

ఈటల, వివేక్ కాంగ్రెస్ గూటి పక్షులే

ఈటల…మాజీ ఎంపి వివేక్‌లపై కెటిఆర్ ఆసక్తికర వ్యా ఖ్యలు చేశారు. వారిద్దరూ కాంగ్రెస్ గూడి పక్షులేనని అని అన్నారు. ప్రస్తుతం బిజెపిలో వారిద్దరు త్వరలోనే కాం గ్రెస్ గూటికి చేరుకునే అవకాశం లేకపోలేదన్నారు. అం దుకే హుజూరాబాద్ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగిందని కెటిఆర్ ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికలు ముగిసిన తరువాత ఈటలను ముందుగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారన్నారు. అనంతరం మాజీ ఎంపి వివేక్ కూడా హస్తం గూటికే చేరుకుంటారన్న ప్రచారం జరుగుతోందన్నారు.

జానారెడ్డి కంటే ఈటల పెద్దలీడరా!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన కె. జానారెడ్డి కంటే హుజారాబాద్ బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్ పెద్దలీడరా? అని కెటిఆర్ ప్రశ్నించారు. అనేక ముఖ్యమంత్రుల వద్ద పలు కీలక శాఖలు నిర్వహించిన వ్యక్తి జానారెడ్డి అని అన్నారు. అలాంటి వ్యక్తినే కొద్ది రోజుల క్రితం నాగార్జనసాగర్‌కు జరిగిన ఉపఎన్నికల్లో జానారెడ్డిని ఓడించ గలిగామని కెటిఆర్ అన్నారు. టిఆర్‌ఎస్ పక్షాన రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని వ్యక్తిని బరిలోకి దింపి ఘన విజయం సాధించామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు సిఎం కెసిఆర్ పాలన పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారని పేర్కొనేందుకు ఇంతకంటే నిదర్శనం మరోటి లేదన్నారు. అందుకే రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలు గులాబీ పార్టీనే గెలిపిస్తున్నారన్నారు. తన స్వార్ధంతో ఈటల బిజెపిలోకి వెళ్లినప్పటికీ ఆ పార్టీ ఆయనను ఓన్ చేసుకోవడం లేదన్నారు. అలాగే ఈటల కూడా ఆ పార్టీని ఓన్ చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. అందుకే ఆయన అభిమానులు, అనుచర్గమంతా జై ఈటల అంటున్నారు తప్ప, జైశ్రీరామ్ అనట్లేదు ఎందుకు? అని ప్రశ్నించారు.

బిజెపి పేరు ఎత్తితే ఓట్లు పడవనే ఈటల ఆ పార్టీ పేరు ఎత్తడం లేదా? అని ప్రశ్నించారు. ఈటెలకు టిఆర్‌ఎస్ ఎంతో చేసిందన్నారు. అయినప్పటికీ ఆయన మంత్రిగా ఉంటూ ప్రభుత్వంపైనే విమర్శలు చేశారన్నారు. అయినప్పటికీ పలుమార్లు సిఎం కెసిఆర్ ఎంతో సహనంతో వ్యవహరించారన్నారు. అలాంటిప్పుడు ఈటల టిఆర్‌ఎస్‌కు ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని మరోసారి కెటిఆర్ సవాల్ విసిరారు. కనీసం గెలిస్తే ఏం చేస్తారన్నది చెప్పకుండా ఈటల వేరే విషయాలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్‌కు టిఆర్‌ఎస్ అన్యాయం చేసిందా? పార్టీలో ఉన్నప్పటి నుంచి ఆయన పదవిలోనే ఉన్నారన్నారు. అలాంటప్పుడు మరి ఎక్కడ అన్యాయం జరిగిందని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో ఈటలకు ఓటేస్తే గ్యాస్ ధర తగ్గిస్తారా?, ఈటల రాజీనామా చేస్తే దళితబంధు రాలేదు..ఈటల క్యాబినెట్‌లో ఉన్నప్పుడే దళిత బంధుకు శ్రీకారం చుట్టామని ఒక ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ తెలిపారు.

దళితబంధును ఎవరూ ఆపలేరు

దళిత బంధును ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని కెటిఆర్ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక పది రోజుల్లో ముగుస్తుందని, ఆ తర్వాత పథకం తిరిగి ప్రారంభం అవుతుందన్నారు. టిఆర్‌ఎస్‌కు ప్లీనరీనే ఫస్ట్ ప్రయార్టీ అని, హుజూరాబాద్ బైపోల్ సెకండ్ ప్రయార్టీ అని వివరించారు. ఒక్క హుజూరాబాద్ ఉపఎన్నికల కోసం లక్షా డ్బ్బైవేల కోట్ల రూపాయలతో దళిత బంధును ఎవరైనా ప్రవేశపెడతారా? అని కెటిఆర్ అన్నారు. దళితులకు ఏమైనా చేయాలన్న తప్పన ప్రతిపక్షాలు లేదన్నారు. అందుకే కెసిఆర్ చేస్తుంటే వారు అడుగడుగునా అడ్డుతగులుతున్నారని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

పాపం… భట్టి

కాంగ్రెస్‌లో ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క కాస్త మంచి నాయకుడని కెటిఆర్ కితాబిచ్చారు. అయితే ఇప్పుడు ఆ పార్టీలో మంచి నాయకులది ఏం నడవడం లేదన్నారు. భట్టి కంటే గట్టి అక్రమార్కులదే ఎక్కువగా నడుస్తోందని పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై ఆయన తనదైన శైలిలో పంచులు విసిరారు.

అదంతా వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం

సిఎం కెసిఆర్ త్వరలో ఉప రాష్ట్రపతి అవుతున్నారన్నది… కేవలం ప్రచారం మాత్రమేనని కెటిఆర్ అన్నారు. అదం తా వాట్స్‌ప్ యూనివర్సిటీ ప్రచారంగా ఆయన కొట్టిపారేశారు. మీరు (జర్నలిస్టులు) కూడా ఆ యూనివర్సిటీ నుంచి బయటకు రావాలన్నారు. కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడమనేది సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుందన్నారు. దీనిపై ఇతర నాయకుల మాదిరిగా తానుచిలుక జోస్యం చెప్ప లేను అని కెటిఆర్ అన్నారు. టిఆర్‌ఎస్ పాలన పట్ల ఉద్యమ కారులు అసంతృప్తిగా ఉంటే ఇన్ని ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎందుకు గెలుస్తుందన్నారు. ప్రజా ఆలోచనకు హుజురాబాద్ ఉప ఎన్నిక కచ్చితంగా ప్రతిబింబిమే అవుతుందన్నారు.

ప్రచారానికి వెళ్లడం లేదు

హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. గతంలో జరిగిన నాగార్జునసాగర్, దుబ్బాక ప్రచారానికీ తాను వెళ్లలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం అక్కడ పార్టీ పరంగా ప్రచార బాధ్యతలను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ చూసుకుంటున్నారన్నారు. వీరితో పాటు పలువురు శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్నా రు. అయితే సిఎం కెసిఆర్ హుజూరాబాద్ ప్రచారం ఇం కా ఖరారు కాలేదు అని ఒక్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

15వ తేదీన ప్రయాణాలు పెట్టుకోవద్దు

నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో టిఆర్‌ఎస్ పార్టీ విజయ గర్జన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోందన్నారు. ఆ సభ కోసం ఆర్‌టిసి బస్సులను దాదాపుగా టిఆర్‌ఎస్ పార్టీ అద్దెకు తీసుకుంటుందన్నారు. అందువల్ల ఆ రోజు బస్సు ప్రయాణాలు పెట్టుకుని ఇబ్బందులు పడవద్దని కెటిఆర్ సూచించారు. 20 రోజుల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే తొంబై మూడు శాతం వరకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందన్నారు.

రేవంత్ చిలుక జోస్యం చెప్పుకుంటే మంచిది

రేవంత్ చిలుక జోస్యం చెప్పుకుంటే మంచిదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముందస్తూ ఎన్నికలు ఉండవని సిఎం కెసిఆర్ చాలా స్పష్టంగా చెబుతున్నారన్నారు. అయినప్పటికీ రేవంత్ ముందుస్తూ ఎన్నికలు జరుగుతాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రేవంత్‌కు ఎప్పటికైనా చెప్పుకోవాల్సింది చిలుక జోస్యమేనని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని…చెప్పిన ఆయన ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని కెటిఆర్ ప్రశ్నించారు. అయినా ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమత గెలిస్తే మోడీ దుప్పటి కప్పుకుని పడుకున్నాడా? అని ప్రశ్నించారు. అలాగే హుజూరాబాద్‌లో తాను గెలిస్తే కెసిఆర్ అసెంబ్లీకి రావద్దని ఈటల రాజేందర్ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు.

నిజమే..పార్టీ కార్యక్రమాలు స్తబ్దుగా మారాయి

రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడం…ఆ తరువాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాయని కెటిఆర్ అన్నారు. అవి ముగించుకుని పార్టీ కార్యక్రమాలను చేపడదామని భావించిన తరుణంలో కరోనా మహమ్మరి విజృంభించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడంతో పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించామన్నారు. పైగా ప్రభుత్వానికే ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల పార్టీ కార్యక్రమాలు కొంత మేరకు తగ్గినమాట వాస్తవేనని అంగీకరించారు. ఇప్పుడు జోరు పెంచుతున్నామన్నారు. ఇం దులో భాగంగా ఈ నెల 25న నగరంలోని హెచ్‌ఐసిసి పార్టీ అధ్యక్ష ఎన్నికల తరువాత…అదే రోజు ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. కాగా నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో విజయ గర్జన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ భవన్‌లో నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం జోరు పెంచామని… తొమ్మిది నెలల పాటు రకరకాల పార్టీ కార్యక్రమాలు ఉంటాయని కెటిఆర్ వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్‌ను ప్రతిపాదిస్తూ ఇప్పటికే పది సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 24న తెలంగాణ భవన్‌లో ఉంటుందన్నారు. అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందన్నారు. త్వరలో అన్ని స్థాయిల నాయకులకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తామన్నారు. 6 నుంచి 9 నెలల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని, ముందస్తు ఎన్నికల కోసం పార్టీ కార్యక్రమాలు అనుకోవడం తప్పన్నారు. పార్టీగా.. ప్రభుత్వంగా సాధించిన విజయాలు నెమరువేసుకుంటామన్నారు.

వరంగల్‌కు టిఆర్‌ఎస్‌కు అచ్చొచ్చిన ప్రాంతం

వరంగల్‌లో ఎన్నో సభలు పెట్టి విజయవంతం చేసిన చరిత్ర టిఆర్‌ఎస్‌కు ఉందని కెటిఆర్ అన్నారు. అందుకే విజయగర్జన సభ కూడా అక్కడే నిర్వహించాలిసి సిఎం కెసిఆర్ నిర్ణయించారన్నారు. పైగా వరంగల్ టిఆర్‌ఎస్‌కు బాగా కలిసొచ్చిన ప్రాంతమన్నారు. తెలంగాణ విజయ గర్జన గొప్ప సభల్లో ఒకటిగా మిగిలి పోతుందన్నారు. ఈ సభ కోసం సుమారు ఆరు వేల ఆర్‌టిసి బస్సులను వినియోగించుకోనున్నామన్నారు. రాష్ట్రంలో 16,395 టిఆర్‌ఎస్ పార్టీ యూనిట్లు ఉన్నాయని, ప్రతి కమిటీ కూడా తెలంగాణ విజయ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ప్రాంతీయ పార్టీలు 20 యేళ్ళు మనగలగడం గొప్ప విషయం

ప్రాంతీయపార్టీలు ఇరవయ్యేళ్లు మనగలడం చాలా గొప్ప విషయమని కెటిఆర్ అన్నారు. 1956 నుంచి మొదలుకుని 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయన్నారు. అందులో ఏ పార్టీ లు మనగలగలేకపోయాయన్నారు. ఒక స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన టిడిపి, కెసిఆర్ ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్‌లు మాత్రమే చాలా గట్టిగా ఉన్నాయన్నారు. ఆ పార్టీలే ముందుకు సాగుతున్నాయన్నారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక, పార్టీ కమిటీ తర్వాత ఇతర కమిటీల నియామకం ఉంటుందని కెటిఆర్ పేర్కొన్నారు.

డిఎంకె…అన్నా డిఎంకె తరహాలో టిఆర్‌ఎస్‌ను పటిష్టం చేస్తాం

నవంబర్ 15 తర్వాత తనతో పాటు కొంత మంది టిఆర్‌ఎస్ నేతలు తమిళనాడుకు వెలుతున్నామన్నారు. ఆ రాష్ట్రంలో అన్నా డిఎంకె, డిఎంకె పార్టీల సంస్థాగత నిర్మాణాన్ని పరిశీలిస్తామన్నారు. ఆ పార్టీల తరహాలోనే తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను కూడా సంస్థాగతంగా పటిష్టం చేస్తామన్నారు. కెసిఆర్ ఎంతో మంది లీడర్లను తయారు చేశారన్నారు. పార్టీలో ఎన్నో దారులు ఉంటాయన్నారు. స్వాతంత్ర పోరాటం లో ఎంతో మంది భిన్నదారుల్లో పోరాడి కాంగ్రెస్‌లో చేరలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతల్లో గ్రూపులు ఉన్నాయని మీడియా ప్రశ్నించగా…అది పార్టీ బలంగా ఉందనడానికి నిదర్శనమన్నారు. గెలిచే పార్టీలోనే నాయకుల్లో పోటీ తత్వం అధికంగా ఉంటుందన్నారు. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. వాటిని పూర్తిగా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటున్నామన్నారు. కాగా నీట్ రద్దు చేయాలని వస్తున్న డిమాండ్‌పై భిన్నాభిప్రాయాలున్నాయి. మన విద్యార్థుల ప్రయోజనాల రీత్యా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News