Home తాజా వార్తలు ఐటిఐఆర్‌కు ఎసరుపెట్టింది మీరు కాదా ?

ఐటిఐఆర్‌కు ఎసరుపెట్టింది మీరు కాదా ?

Minister KTR counter to bandi sanjay letter over ITIR

 

రద్దు ప్రకటన చేసింది రవిశంకర్ ప్రసాద్ కాదా?
యువతకు బిజెపి క్షమాపణలు చెప్పాలి

అబద్ధ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం బిజెపి నైజం
బండి సంజయ్ లేఖ ద్వారా అది మరోసారి రుజువైంది
పలుమార్లు పార్లమెంట్‌లో ఐటిఐఆర్ రద్దు ప్రకటన చేసింది కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాదే
ఆయనకు లేఖ రాసి బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకోవాలి
ఒక్క హైదరాబాద్‌లోనే కాదు ఐటిఐఆర్ మంజూరైన ఏ రాష్ట్రంలోనూ అడుగు ముందుకు పడలేదు
బిజెపి అధికారంలో ఉన్న బెంగళూరులో ఐటిఐఆర్ కోసం తట్టెడు మట్టి కూడా లేవలేదు
అన్ని చోట్ల ఐటిఐఆర్ దుస్థితికి కెసిఆర్ ప్రభుత్వమే కారణమా?
ఇదంతా ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టుంది
2014 నుంచి ఐటిఐఆర్ కోసం కేంద్రానికి రాసిన లేఖలు, సమర్పించిన డిపిఆర్‌లన్నీ బండి సంజయ్‌కి ఇస్తాం, ఐటిఐఆర్ తీసుకొచ్చే దమ్ముందా..?
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలను చెరిగి వదిలిపెట్టిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఐటిఐఆర్ గురించి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక శాఖ కె.టి.రామారావు ఒక ప్రకటనలో అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బిజెపి నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐటీఐఆర్‌ను రద్దు చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటనను మరోసారి చదువుకొని తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగర యువతకి ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినందుకు క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధిని పణంగా పెట్టి ఐటిఐఆర్‌ని రద్దు చేసిన కేంద్రంలో ఉన్న తన సొంత ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని మంత్రి కెటిఆర్ అన్నారు.

పలుమార్లు పార్లమెంట్ సాక్షిగా ఐటిఐఆర్‌ని రద్దు చేస్తున్నామని ప్రకటించిన కేంద్రమంత్రి, బిజెపి నాయకుడు రవిశంకర్ ప్రసాద్‌కి లేఖ రాసి నిజాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్, బండి సంజయ్‌కి హితవు పలికారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంతటి అబద్ధాలనైనా మాట్లాడే నైజం బిజెపిదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఐటీఐఆర్ కోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని కెటిఆర్ అన్నారు. జూన్ 2014లో అంటే తెలంగాణ వచ్చిన మొదటి నెలలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఐటీఐఆర్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారని గుర్తు చేశారు. మళ్లీ 2014 సెప్టెంబర్‌లో పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమొరాండం సమర్పించామని, దీంతోపాటు తమ ప్రభుత్వం తరఫున స్వయంగా తానే అనేకసార్లు ప్రధానికి, కేంద్ర ఐటి శాఖ మంత్రికి విజ్ఞప్తులు అందించానని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకులు పలుకు లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన ఐటీఐఆర్ అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణం అనడం విచిత్రం, విడ్డూరం, పచ్చి అబద్దం అని అన్నారు.

ఐటీఐఆర్ మంజూరైన రాష్ట్రాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు
ఒక్క తెలంగాణలోనే కాదు, ఐటీఐఆర్ మంజూరు అయిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఆ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్న సంగతి తెలియకపోవడం తెలంగాణ బిజెపి అధ్యక్షుని అజ్ఞానాన్ని సూచిస్తుందని విమర్శించారు. అటు కేంద్ర ప్రభుత్వంలో, ఇటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బెంగళూరు ఐటీఐఆర్ ప్రాజెక్టులో ఒక తట్టెడు మట్టి కూడా లేవలేదు అన్న వాస్తవం స్వీకరించాలని కెటిఆర్ తెలిపారు. బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్‌లో, ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో ఐటిఐఆర్ మొదలు కాకపోవడానికి కూడా కారణం కెసిఆర్ ప్రభుత్వమేనా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఐటిఐఆర్ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడనికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అని, ముందుగా ఆ విషయాన్ని గుర్తించాలని అన్నారు.

ఐటీఐఆర్ ఉసురు తీసి… ఉత్తరాల పేరుతో డ్రామాలు
మీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అనేక పర్యాయాలు ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించే ఉద్దేశం లేదు అని బహిరంగ ప్రకటనలు చేసింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాలను దాచిపెట్టి, రాష్ట్ర ప్రభుత్వం మీద అభాండాలు వేయడానికి సిగ్గు అనిపించడం లేదా..? అని నిలదీశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, అసమర్థత, ఐటీ రంగం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దేశ వ్యాప్తంగా ఐటిఐఆర్ ప్రాజెక్ట్ మూలన పడటానికి ప్రధాన కారణం అని పేర్కొన్నారు. దానిని కప్పిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఐటీఐఆర్ ఉసురు తీసింది మీ పార్టీ అని, ఇక్కడ ఉత్తరాల పేరుతో డ్రామాలు ఆడుతుందీ మీరే అని మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు.

బిజెపి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది
ఉన్న ఐటీఐఆర్‌ను మూలకు పెట్టిన బిజెపి ప్రభుత్వం, గత ఐదేళ్ల పాలనలో ఐటీ రంగ అభివృద్ధికి ఒక్కటంటే ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రకటించకుండా భారతదేశ ఐటీ రంగంపై సమ్మెట పోటు వేసింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ వస్తే కొత్తగా కొలువులు వస్తాయని యువకులు, నిరుద్యోగులు పెట్టుకున్న కోటి ఆశలపై నీళ్లు చల్లింది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అని, ఈ విషయాన్ని తెలంగాణలోని ప్రతి ఒక్క విద్యావంతునికి తెలుసని అన్నారు.

‘ఉల్టా చోర్ కోత్వల్ కో డాంటే‘ అన్నట్లుగా ఉంది
తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన నివేదికలు లేకపోవడం ద్వారానే ఐటిఐఆర్ ప్రాజెక్టు ఆగిందని అంటున్న ఎంపి బండి సంజయ్ కళ్ళు ఉన్న నిజాలు చూడాలేని గుడ్డివాడి లాంటివాడు అని అన్నాడు. రాష్ట్ర ఐటీ మంత్రిగా తానే స్వయంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ విషయంపై పలుమార్లు కలిసింది వాస్తవం, లేఖలు రాసింది వాస్తవమని, గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సార్లు ఐటీఐఆర్ సంబంధించి డీటైల్‌డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లు, మెమొరాండంలు సమర్పించింది వాస్తవం అని పేర్కొన్నారు. కానీ వాస్తవాలను దాచిపెట్టి, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజెక్ట్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ‘ఉల్టా చోర్ కోత్వల్ కో డాంటే’ అన్నట్టుగా ఉందని అన్నారు. బండి సంజయ్ చేతనైతే ఐటీఐఆర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలని తెలిపారు. కేవలం హైదరాబాద్‌లో మీడియాలో ప్రచారం కోసం లేఖలు కాకుండా కేంద్రం నుంచి ఐటీఐఆర్‌కు సంబంధించి ఒక ప్రకటన లేదా స్పష్టత ఇప్పించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి రాసిన లేఖలతోపాటు ఇచ్చిన డిపిఆర్ రిపోర్టులు అన్నింటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు లేదా ఐటిఐఆర్‌కు సమానమైన ఇతర హోదాను లేదా ప్రాజెక్టుని హైదరాబాద్‌కి ప్రత్యేకంగా తీసుకురావాలని సూచించారు. అటు సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేక కేవలం అసత్యాలు, అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూసే బండి సంజయ్ ప్రయత్నాలు ఎన్నడు సఫలం కావని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఐటీఐఆర్‌ను రద్దు చేస్తామని ప్రకటించిన తమ సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటనను మరోసారి చదువుకొని తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగర యువతకి ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Minister KTR counter to bandi sanjay letter over ITIR