హైదరాబాద్ : బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ కు మంజూరైన ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి, ఇప్పుడు హైదరాబాద్ ను ఐటి హబ్ గా మారుస్తామని అమిత్ షా అనడం విడ్డూరంగా ఉందని కెటిఆర్ ధ్వజమెత్తారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని పాటిగడ్డలో కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కెటిఆర్ నగర ప్రజలను కోరారు. నగరానికి వచ్చే ఢిల్లీ టూరిస్టులకు స్వాగతం పలుకుతామని, అయితే వారు వరదలతో అల్లాడిన హైదరాబాద్ కు ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశించామని, కానీ వారు పట్టించుకోలేదని కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ వరద బాధితులకు టిఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేస్తుంటే, బిజెపి నాయకులు అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. 6లక్షల 64 వేల వరద బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు సాయం చేశామని, ఎన్నికల అనంతరం మిగిలిన వారికి సాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ పై కపట ప్రేమను చూపిస్తున్న అమిత్ షాను ఇక్కడి ప్రజలు నమ్మబోరని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలది నిజాం సంస్కృతి అని బిజెపి నేతలు అంటున్నారని, అయితే హైదరాబాద్ సంస్కృతి గాంధీ-జమునా తెహజీబ్ అని 1920లోనే మహాత్మాగాంధీ చెప్పిన విషయాన్ని బిజెపి నాయకులు గుర్తంచుకోవాలని ఆయన సూచించారు. బిజెపి నాయకుల అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆయన నగర ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలు సామరస్యంతో కలిసి జీవించడాన్ని బిజెపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమకు ఉద్వేగాలు అవసరం లేదని, ఉద్యోగాలు కావాలని ఆయన తేల్చిచెప్పారు. విశ్వనగరం తమ నినాదంగా ఉంటే, వారి విధానం విద్వేష నగరంగా ఉందని కెటిఆర్ చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను అఖండ మెజార్టీతో గెలిపించి , తిరిగి అదికారాన్ని అప్పగించాలని ఆయన నగర ప్రజలకు సూచించారు.