Home తాజా వార్తలు గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ దే అఖండ విజయం : కెటిఆర్

గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ దే అఖండ విజయం : కెటిఆర్

Minister KTR GHMC Elections Campaignహైదరాబాద్‌: గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అఖండ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. వందకు పైగా సీట్లను గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జుమ్మెరాత్ బజార్ లో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని, అయితే ఒక్క పైసా వేయలేదని కెటిఆర్ ఎద్దేవా చేశారు. అభివృద్ధే ఏకైక ఎజెండాగా ముందుకు సాగుతున్న టిఆర్ఎస్ కే ఓటేయాలని ఆయన నగర ప్రజలను కోరారు. ఇటీవల వచ్చిన వరదలతో హైదరాబాద్ అల్లాడితే కేంద్రం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. వరదల సమయంలో రాని ఢిల్లీ నేతలు ఎన్నికల సందర్భంగా ఇప్పుడు వస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చే వారు ఇక్కడి ఇరానీ చాయ్ తాగి, బిర్యానీ తిని వెళ్లాలని, తెలంగాణకు కేంద్రం బాకీ ఉందన్న విషయాన్ని ఢిల్లీ నేతలు మర్చిపోవద్దని ఆయన స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కు ఏమి చేసిందో చెబుతామని, అయితే బిజెపి ఏమి చేసిందో చెప్పాలని ఆ పార్టీ నేతలను కెటిఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించడం లేదని, ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. అభివృద్ధిని కాంక్షించే టిఆర్ఎస్ కు మాత్రమే గ్రేటర్ ఎన్నికల్లో మద్ధతు ఇవ్వాలని ఆయన నగర ప్రజలను కోరారు.