Home తాజా వార్తలు నేతన్నకు చేయూత : మంత్రి కెటిఆర్

నేతన్నకు చేయూత : మంత్రి కెటిఆర్

ktrMinister KTR has launched Handloom Exhibition at People's

హైదరాబాద్ : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి  చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సభలో ప్రసంగిస్తూ… తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వమని కెటిఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర ప్రభుత్వం తరపున చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర బడ్జెట్‌తో పోల్చుకుంటే చేనేత రంగానికి తెలంగాణ సర్కార్ కేటాయించిన నిధులే ఎక్కువని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు చేనేత కార్మికులకు రూ. 400 కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

చేనేత మగ్గాల లెక్క తేల్చడానికి జియో ట్యాగింగ్ చేశామని తెలిపారు. తెలంగాణలో 17,573 మగ్గాలు ఉన్నాయని కెటిఆర్ చెప్పారు. దాదాపు 42 వేల మందికి పైగా వీటిపై ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. ఒడిశా అధికారులు రాష్ట్ర  పథకాలను మెచ్చుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. నేత మిత్ర పథకాన్ని రూపొందించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. చేనేత కళాకారుల జీవన స్థితిగతుల గురించి కెసిఆర్‌కు బాగా తెలుసని చెప్పారు. రాష్ట్రంలోని నేతన్నలకు ప్రభుత్వం ఇస్తున్న పోత్స్రాహకం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే పడుతుందన్నారు. చేనేత మిత్ర పథకంలో ఎప్పుడైనా చేరవచ్చునని కెటిఆర్ సూచించారు. చేనేత మిత్ర, చేయూత పథకాల ద్వారా నేతన్నలు ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉందని కెటిఆర్ పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం చేనేత కళాకారులకు చేయూత పథకం కింద రూ. 60 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి చేనేత కళాకారుడి కుటుంబంలో నెలకు రూ. 6 వేల ఆదాయం రావాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. 2010 నుంచి ఇప్పటి దాకా ఉన్న చేనేత రుణాలన్నీ మాఫీ చేశామని ఆయన చెప్పారు. టెస్కో షోరూమ్‌లను పెంచనున్నామని నేతన్నలకు మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కామర్స్ రంగం కూడా కొత్త పుంతలు తొక్కిందని తెలిపారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా చేనేత వస్ర్తాలను అమ్మే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.