Home తాజా వార్తలు అంటువ్యాధే కానీ అంటరానోళ్లు కాదు

అంటువ్యాధే కానీ అంటరానోళ్లు కాదు

Minister ktr inaugurates Covid ICU in Sircilla Hospital

 

కరోనా పేషెంట్లపై పక్షపాతం వద్దు

ప్లాస్మా దానానికి ముందుకు రండి
చనిపోతున్న ఆ ఒక్క శాతం మందినీ కాపాడుకుందాం
వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్‌తో సహజీవనం తప్పదు
అవసరమైతే ఐసోలేషన్ సెంటర్లుగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు, విద్యాసంస్థలు
కరోనా వారియర్ల స్థైర్యం దెబ్బతినేలా విమర్శలు వద్దు
జిల్లాలో రోజుకు వెయ్యి కరోనా టెస్టులు
సిరిసిల్లలో కొవిడ్ ఐసియు కేంద్రాన్ని ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు

మన తెలంగాణ/సిరిసిల్ల: కరోనా వైరస్ నివారణకు మందుల్లేవని, ప్లాస్మా చికిత్స ఒక్కటే మార్గమని, ప్లాస్మా దానానికి టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఇతర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో ముందుకురావాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. కరోనా అంటువ్యాధే కానీ… రోగులు అంటరానోళ్లు కాదని అన్నారు. వారి పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దని ప్రజలకు కెటిఆర్ సూచించారు. సోమవారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. జిల్లా ఆస్పత్రి లో కోవిడ్ వార్డు, కోవిడ్ అంబులెన్సును ప్రారంభించారు. పంచాయతీరాజ్ అతిథిగృహ ఆవరణలో ఆ శాఖ ఇఇ, డిఇఇల కార్యాలయాల భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు.

సర్దాపూర్ వ్యవసాయ కళాశాల ఆవరణలో 32 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా సోకినవారిలో 99శాతం రికవరీ ఉందని, ఒక్క శా తం చనిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వంద శాతం రికవరీ కోరుకుంటోందన్నారు. కరోనా సోకిన వారిని వెలి వేయవద్దని కో రారు. మన కుటుంబసభ్యులకు కరోనా సోకితే ఎలా స్పందిస్తామో తోటి వారి విషయంలో కూడా అలాగే ఉండాలన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా, కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు, మన డిప్యూటీ సిఎం మహమూద్‌అలీకి, కాంగ్రెస్ నేత విహెచ్‌తో సహా పలువురికి కరోనా సోకిందని, ఉత్తర ప్రదేశ్‌లో ఒక మంత్రి చనిపోయారన్నారు. నాకేం కాదనే నిర్లక్షంతో తిరిగి కరోనా బారినపడి ఇటు కుటుంబాన్ని, అటు సమాజాన్ని బలి చేయవద్దని హితవు చెప్పారు.

ఇటీవల హైదరాబాద్‌లో కరోనా సోకిన వారి కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇది తనకు బాధ కలిగించిందన్నారు. వాక్సిన్ వచ్చేవరకు కరోనాతో సహజీవనం తప్పదన్నారు. ప్రపంచమంతా కరోనాతో విలవిలలాడుతోందని, ప్రస్తుత పరిస్థితులపై అవగాహన లేకుండా అనవసరంగా విమర్శించే వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. లాక్‌డౌన్ సమస్యకు పరిష్కారం కాదని తేలిపోయిందన్నారు. తనను ప్రజల్లో ఎందుకు తిరుగుతున్నారని కొందరు అంటున్నారని, కష్ట కాలంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు ఇళ్లల్లో కూర్చుంటే ఎలా? ప్రజలకు మనోధైర్యం కలిగించాల్సి బాధ్యత మాపై లేదా అని కెటిఆర్ అన్నారు.

రోజు వెయ్యి పరీక్ష జరిగేలా కృషి
సిరిసిల్ల జిల్లాలో రోజుకు మూడు వందల కరోనా పరీక్షలు చేస్తున్నారని, వాటిని వెయ్యికి పెంచుతామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆరు నెలల వరకు ఆస్పత్రికి నిధుల కొరత ఏర్పడకుండా ఉండేందుకు రూ. 2 కోట్ల 28 లక్షలు తక్షణం కేటాస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యేగా తన వంతుగా మరో రూ. 20లక్షలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, జడ్పి సిపి అరుణకు అందజేశారు. అదే విధంగా చీఫ్ సెక్రెటరీతో ఇతర అధికారులతో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతుల కల్పనకు మరో రెండున్నర కోట్ల రూపాయలు ఇప్పిస్తానన్నారు. సర్దాపూర్ ఐసోలేషన్ వార్డులో మరో 50 పడకలు పెంచుతామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 592 కరోనా కేసులు రాగా వాటిలో 422 యాక్టివ్‌గా ఉన్నాయన్నారు.

సోమవారం ఇళ్ల వద్దకు 300 కరోనా కిట్స్ అందించామన్నారు. జిల్లాలో పూర్తయిన్న మూడు వేల డబుల్ ఇళ్లు, విద్యాసంస్థలు, కళాశాలలను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చి ఆరు వేల మందికి కరోనా వైద్యం అందేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఎవరికీ వెంటిలేటర్ల అవసరం రాలేదన్నారు. సిరిసిల్లలో 300పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కోర్టు ఆవరణలో నిర్మించనున్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కోవిడ్ పోరాటంలో ముందున్న వైద్యులు, పోలీసులు, స్టాఫ్‌నర్సులు, పారిశుధ్య సిబ్బందిని గౌరవించాలన్నారు. వారి నైతిక స్థైర్యం దెబ్బతినే విమర్శలు చేయవద్దన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్పి సిపి అరుణ, అదనపు కలెక్టర్ అంజయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సుమన్‌మోహన్‌రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మురళీధర్‌రావు, రైతుబంధు జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ డి లకా్ష్మరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు జడ్పి సిపి అరుణ, ఎంసిపి జిందం కళ చక్రపాణి, పలువురు మహిళా కౌన్సిలర్లు, ఆసుపత్రి సిబ్బంది రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Minister ktr inaugurates Covid ICU in Sircilla Hospital