Thursday, April 25, 2024

హైవేల వెంట అంబులెన్స్‌లు

- Advertisement -
- Advertisement -

Minister KTR launches Basic Trauma Care on ORR

 

ఓఆర్‌ఆర్‌పై బేసిక్ ట్రామాకేర్‌ ప్రారంభించిన
పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని స్టేట్ హైవేల వెంట సపోర్ట్ అంబులెన్స్ సర్వీసెస్‌లను, ట్రామాకేర్ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. నగర పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) ఇంటర్ చేంజ్ పాయింట్ల వద్ద హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లతో పాటు బేసిక్ ట్రామాకేర్ సెంటర్లను శనివారం మధ్యాహ్నం పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్‌రోడ్డు వెంట ఇలాంటి సేవలను అందించేందుకు కృషి చేసిన హెచ్‌ఎండిఏ యంత్రాంగాన్ని మంత్రి కెటిఆర్ ప్రశంసించారు.

వరల్డ్ ట్రామా డే రోజున ఇలాంటి సేవలను ప్రజల కోసం వారి ప్రాణాలను కాపాడడంలో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకురావడం సంతృప్తిని ఇస్తుందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. అంబులెన్స్‌లో ఉన్న పరికరాలను మంత్రి కెటిఆర్ పరిశీలించారు. అనంతరం ట్రామాకేర్ సెంటర్‌లో ఉన్న వైద్య పరికరాలు, వాటి పనితీరు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఏవిధంగా వైద్య సేవలు అందిస్తారో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అపోలో ఆస్పత్రి రీజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వై.సుబ్రమణ్యం క్షతగాత్రుల ప్రమాద పరిస్థితిని బట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డాక్టర్లు, నిపుణుల సమక్షంలో వారి సూచనలు, సలహాలకు లోబడి ట్రామా కేర్ సెంటర్‌లో వైద్య సేవలు అందిస్తామని మంత్రి కెటిఆర్‌కు వారు వివరించారు.

దీంతో 160 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌పై పూర్తిస్థాయిలో మెడికల్ ఎమర్జెన్సీ అందుబాటులోకి వచ్చింది. ప్రతి 32 కిలోమీటర్ల దూరానాకి ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటల పాటు అందుబాటులో ఉండనున్నాయి. ట్రామాకేర్ సెంటర్‌లతో పాటు అధునాతన 10 లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మంత్రి కెటిఆర్ ఆదేశాలతో ట్రామాకేర్ సెంటర్లు, అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, మరో మూడు వారాల్లో మిగతా అన్ని ఇంటర్ చేంజ్‌ల వద్ద లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సర్వీసులతో పాటు ట్రామాకేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్టు అరవింద్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎంపి రంజిత్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండి సంతోష్, చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్‌రెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శరత్‌చంద్ర, సిజిఎం రవీందర్, మాజిద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

ట్రామాకేర్ సెంటర్‌లు అందుబాటులోకి రానున్న ప్రాంతాలు

1.శంషాబాద్, 2.టిఎస్‌పిఏ, 3.ఫైనాన్షియల్ డిస్ట్రిక్, 4.పటాన్‌చెరు, 5.దుండిగల్, 6.శామీర్‌పేట, 7.ఘట్‌కేసర్, 8.పెద్ద అంబర్‌పేట, 9.బొంగళూరు, 10.తుక్కుగూడ వద్ద ట్రామాకేర్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News