Home తాజా వార్తలు స్వదేశీ తయారీ

స్వదేశీ తయారీ

Minister KTR participated in ICEMA webinar

 

నిర్మాణరంగ పరికరాల ఉత్పత్తిదారులదే ఇందులో కీలకపాత్ర
సిఐఎకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సంపూర్ణ అండ
సవాళ్లపై సర్కారుకు ఒక నివేదిక ఇవ్వండి
త్వరలో భవన నిర్మాణరంగం పుంజుకుంటుంది
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి సాదర స్వాగతం
సిఐఎ ఆధ్వర్యంలో జరిగిన వెబ్‌నార్‌లో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల దీర్ఘకాలంలోనూ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ పరిశ్రమకు భలే డిమాండ్ ఉంటుందని పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, తెలంగాణలో ఉన్న మైనింగ్ అవకాశాలతో పాటు నగరంలో చేపడుతున్న రోడ్డు, భవన నిర్మాణాల వలన కన్‌స్ట్రక్షన్ ఇక్విప్ మెంట్ పరిశ్రమకు కూడా మంచి అవకాశాలున్నాయన్నారు. శనివారం నాడిక్కడ ఇండియా కన్‌స్ట్రక్షన్ ఇక్విప్‌మెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ అసోసియేషన్ (సిఐఎ) ఆధ్వర్యంలో జరిగిన వెబ్‌నార్‌లో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైతే పరిశ్రమ కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ సదుపాయాన్ని కల్పిస్తామని పరిశ్రమ ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ హమీ ఇచ్చారు.

కేంద్రం చేబుతున్న ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధన్యత ఇవ్వాలన్నారు. దేశం అగ్రదేశాల సరసన చేరాలంటే భారీ ఎత్తున దేశంలో హైస్పీడ్ నెట్ వర్క్ నిర్మాణం, నూతన ఎయిర్ పోర్టులు, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పారిశ్రామిక వాడల వంటి మౌళిక వసతుల కల్పన జరగాల్సి ఉన్నదన్నారు. ఇందులో కన్ స్ట్రక్షన్ ఇక్విప్‌మెంట్ పరిశ్రమ కీలక పాత్ర పోషించాలన్నారు. ఇందుకోసం అవసరమైన పాలసీపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా రాష్ట్ర పరిధిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు తా ము సిద్దంగా ఉన్నామన్నారు.

కోవిడ్ వలన అన్ని రంగాలపై కొంత ప్రభావం పడిందన్న మంత్రి కెటిఆర్…. రాష్ట్రంలో ఆర్ధిక వ్యస్థను గాడిలో పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చిత్తశుద్ధితో యత్నిస్తున్నదన్నారు. తెలంగాణలో మొదటి నుంచి సంక్షేమం, అభివృద్ది జంట ప్రాధాన్యతలుగా పాలన కొనసాగుతున్నదని మంచ్రి కెటిఆర్ పేర్కొన్నారు. వలస కార్మికుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. వారి కోసం కరోనా సంక్షోభ సమయంలోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లాక్ డౌన్ తరువాత వారంతా తిరిగి పనుల్లో యథావిధిగా పాల్గొంటున్నారన్నారు. దీంతో భవన నిర్మాణ రంగం తిరిగి పుంజుకుంటుదన్నారు. కన్‌స్ట్రక్షన్ ఇక్విప్‌మెంట్ పరిశ్రమకున్న సవాళ్లు, అవకాశాలపైన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్..ఐపాస్ వంటి పాలసీల్లో పరిశ్రమ వర్గాల ఫీడ్‌బ్యాక్ కూడా ఉందన్నారు. కన్‌స్ట్రక్షన్ ఇక్విప్‌మెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ నిర్వహించే ఎక్స్‌కాన్ వంటి కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అతిథ్యం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో వలస కార్మికులకు అతిథి కార్మికులుగా భావిస్తున్నది. ఏకైక రాష్ట్రం తెలంగాణే అని పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. వారికి అంతటి గౌరవం తమ ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు ఎంతో ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రస్తుతం కోరనా వైరస్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ త్వరలోనే అన్ని సమస్యలను అధిగమిస్తామన్నారు.

రాష్ట్రంలో నిర్మాణ రంగం త్వరలోనే పుంజుకోవడం ఖాయమని మంత్రి కెటిఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కన్‌స్ట్రక్షన్ ఇక్విప్‌మెంట్ మ్యాన్యూఫాక్చరర్స్‌కు సాదర స్వాగతం పలుకుతామన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో కన్ స్ట్రక్షన్ ఇక్విప్‌మెంట్ తయారీకోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఒక పార్కును ఏర్పాటు చేశామన్నారు ప్రభుత్వం చేపట్టిన మౌళిక వసతుల ప్రాజెక్టులను ప్రత్యేకంగా కన్ స్ట్రక్షన్ ఇక్విప్‌మెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ అసోషియేషన్ ప్రత్యేకంగా అభినందించింది. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు మౌళిక వసతులు కల్పనలో తెలంగాణ అదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా కన్‌స్ట్రక్షన్ ఇక్విప్‌మెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ అసోషియేషన్ పేర్కొన్నది.

నిర్మాణ రంగ వృద్ధి కొనసాగేలా చర్యలు
దేశంలోని పలు మెట్రో నగరాల్లో నిర్మాణ రంగం పరిస్థితి పూర్తిగా అయోమయంలో ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా అనుకూలమైన పరిస్థితి ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో తీసుకున్న పలు నిర్ణయాల కారణంగానే నిర్మాణ రంగం శరవేగంగా పుంజుకున్నదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక అంశంగా ఉన్న నిర్మాణ రంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ మార్గనిర్ధేశనంపైన చర్చించేందుకు శనివారం నాడిక్కడ మంత్రి కెటిఆర్ నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.

ఇందుకోసం వేల కోట్లాది రూపాయలతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరింతగా పెరగనున్న జనాభాకు అనుగుణంగా తగు ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. ఈ అభివృద్ధిలో నిర్మాణ రంగ ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. అలాగే ఒక క్రమపద్దతిలో కట్టడాలను నిర్మించడం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. నగరంలో చెరువులు, బహిరంగ ప్రాంతాల్లో మట్టి, నిర్మాణ వ్యర్ధాలను వేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతమున్న సంక్షోభ సమయంలో ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న ఉపశమ న చర్యలపైన ఈ సందర్భంగా వారితో మంత్రి కెటిఆర్ చర్చించారు.

ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అప్రూవల్, మాస్టర్ ప్లాన్ అంశాలకు సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వారు చేసిన సూచనలపై ఆయన సానుకూలంగా స్పందించారు. నిర్మాణ రంగానికి ఖచ్చితంగా అండగా ఉంటానని మంత్రి కెటిఆర్ హామి ఇచ్చారు. ప్రస్తుతం వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది నిర్మాణ రంగమేనని, ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరాన్ని ఇప్పటికే తాము గుర్తించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి నేరుగా నిర్మాణ రంగం ప్రతినిధులతో సమావేశమైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాగా సంఘాల ప్రతిధులు లేవనెత్తిన అంశాలపైన ప్రభుత్వంతో మాట్లాడి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. కాగా సిమెంట్ ధరల పెంపుకు సంబంధించిన అంశంపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు.సిమెంట్ కంపెనీలతో ఇప్పటికే ఒకసారి సమావేశం అయ్యామన్నారు. తప్పకుండా ధరల సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. అలాగే ఇసుక సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నని పలువురు మంత్రి దృష్టికి తేవడంతో…వెంటనే టిఎస్ ఎండిసి ఎండి మల్సూర్ తో మాట్లాడి హైదరాబాద్ నిర్మాణ రంగానికి సరిపడా ఇసుక నిల్వలుండేలా చూడాలని ఆదేశించారు.

Minister KTR participated in ICEMA webinar