Home తాజా వార్తలు గాంధీభవన్‌కు టులెట్ బోర్డు పెట్టుకోండి

గాంధీభవన్‌కు టులెట్ బోర్డు పెట్టుకోండి

Minister KTR reverse comments to bhatti vikramarka

 

నిరాశలో కాంగ్రెస్ నేతలు
రేపో, మాపో పెట్టుకోండి
కాంగ్రెస్ నాయకులు నిరాశతో మాట్లాడుతున్నారు
భట్టి విక్రమార్కది ఊకదంపుడు ఉపన్యాసం, విమర్శలను దీవెనలుగా తీసుకుంటాం
మాది సంస్కారవంతమైన ప్రభుత్వం
ప్రపంచం తెలంగాణను గుర్తిస్తుంటే కాంగ్రెస్ నేతలకు కనపడడం లేదు
హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఓరలేకపోతున్నారు
తెలంగాణను అభివృద్ధి చేసి ఉంటే 2014, 2018 ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయింది
అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులు నిరాశతో మాట్లాడుతున్నారని, తెలంగాణ వచ్చిన తరువాత కాంగ్రెస్ నాయకులు ఉపాధి కోల్పోయారని, గాంధీభవన్ దివాళా తీసిందని, రేపో, మాపో గాంధీభవన్‌కు టులెట్ బోర్డు పెట్టుకోవాలని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సభ్యులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఫైర్ అయ్యారు. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై అసెంబ్లీలో జరిగిన స్వలకాలిక చర్చ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ప్రపంచం మొత్తం తెలంగాణను గుర్తిస్తున్నా కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేకపోతున్నారని, వారికి కడుపుమండుతోందని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బెస్ట్ సిటీ అని అనేక సర్వే సంస్థలు చెబుతున్నా, ప్రపంచంలోనే హైదరాబాద్ మోస్ట్ డైనమిక్ సిటి అని జేఎల్‌ఎల్ అనే సంస్థ చెబుతున్నా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు.

గల్లీల్లో తిరిగి అభివృద్ధిని చూడండి
కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో కూర్చుని మాట్లాడటం కాదు, గల్లీల్లో తిరగాలని, జరిగిన అభివృద్ధిని చూడాలని కెటిఆర్ సూచించారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని కెటిఆర్ ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యుడైన భట్టి విక్రమార్క నిర్మాణాత్మాకమైన సలహాలు, సూచనలు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధిని తామే చేశామని భట్టి విక్రమార్క చెప్పుకున్నారని, ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏమిటో భట్టి మాట్లాడింది వింటే అర్థమయ్యిందన్నారు. భట్టి కొత్త విషయాలను చెప్పలేక పోయారని గత అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన విషయాన్ని ఈసారి కూడా వల్ల వేశారని ఆయన ఆరోపించారు. భట్టికి అవకాశం ఇస్తే చార్మినార్‌ను గోల్కొండను తామే కట్టామని చెప్పుకుంటారని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా 2014కు ముందు ఎలా ఉందో, ప్రస్తుతం ఎంత అభివృద్ధి జరిగిందో భట్టి గుండెపై చేయి వేసుకొని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తమది సంస్కారవంతమైన ప్రభుత్వమని మంత్రి కెటిఆర్ తెలిపారు. భట్టి విమర్శలను దీవెనలుగా తీసుకుంటానని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

పబ్లిక్ టాయిలెట్లను నిర్మించలేదు, దవాఖానాలు పెట్టలేదు
కోటి మంది ఉండే హైదరాబాద్‌లో గత కా్రంగెస్ పాలనలో ఎలాంటి మౌలిక సదునాయాలు కల్పించలేదని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. కనీసం పబ్లిక్ టాయిలెట్లను నిర్మించలేదని, దవాఖానాలు పెట్టలేదన్నారు. పేదల గురించి ఆలోచించలేదన్నారు. కరెంట్ కోసం ఇందిరాపార్కు వద్ద పారిశ్రామికవేత్తలు ధర్నా చేసింది కాంగ్రెస్ హయాంలోనే కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడలేదా అన్న విషయం అందరికీ తెలుసని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. 200 పైచిలుకు బస్తీ దవాఖానలను హైదరాబాద్ ఏర్పాటు చేశామని, పేదవారికి సుస్తీ చేస్తే వాటిలోనే వైద్యం అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో 350 బస్తీ దవాఖాలను జిహెచ్‌ఎంసి పరిధిలో పెంచుతామన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి చేసి ఉంటే 2014, 2018 ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయారని ఆయన ప్రశ్నించారు. మొన్న జరిగిన మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ 100 పైచిలుకు మున్సిపల్ చైర్మన్ సీట్లను గెలుచుకుందని తాము అభివృద్ధి చేయకపోతే అన్ని సీట్లను ఎలా గెలుస్తామని ఆయన భట్టిని ప్రశ్నించారు. జడ్‌పి ఎన్నికల్లోనూ 32 జిల్లా పరిషత్ చైర్మన్‌లను తామే గెలుచుకున్నామని మంత్రి తెలిపారు.

అభివృద్ధికి పెట్టిన వ్యయం తెలుసుకోండి
2004 నుంచి 2014 వరకు హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ఎంత ఖర్చు పెట్టింది? 2014 నుంచి 2020 వరకు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసుకోవాలన్నారు. తమ ఆరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి రూ.67 వేల 130 కోట్లను ఖర్చు పెట్టిందని, 10 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4,636 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు.

రూ.18 వేల కోట్లతో ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం
భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందన్నారు. రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. వీటిలో రూ.9,714 కోట్లతో హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని, మొత్తం లక్ష ఇళ్లను డిసెంబర్ వరకు పూర్తి చేసి పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కొల్లూరులో రూ.1,400 కోట్లతో 15 వేలకు పైగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిరు వ్యాపారుల కోసం స్ట్రీట్ వెండింగ్ జోన్‌లతో పాటు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు 1,000 స్మృతివనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2,087 ఎకరాల్లో మహబూబ్‌నగర్‌లో ఎకో పార్కును ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా హైదరాబాద్ అవతరణ
ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా హైదరాబాద్ నగరం అవతరిస్తోందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలో అత్యంత వేగంగా హైదరాబాద్ నగరం పట్టణీకరణ చెందిందన్నారు. తెలంగాణ పట్టణీకరణ 42.6 శాతానికి చేరుకుందన్నారు. దేశ సగటు పట్టణ జనాభా 31.2 శాతం మాత్రమేనన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం కేశవపూర్ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నామన్నారు. 5 లక్షల సిసి కెమెరాలతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. జిఓ 58, 59లకు సంబంధించి పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామినిచ్చారు. నోటరీ డాక్యుమెంట్లకు సంబంధించి సమస్యను సిఎం దృష్టికి తీసుకెళతానన్నారు. నగరంలో రూపాయికే ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు డిజాస్టర్ రెస్పాన్స్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్‌లో డిఆర్‌ఎఫ్ బృందాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు వద్ద విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

పాతబస్తీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు
పాతబస్తీలో మరిన్ని బస్‌షెల్టర్లు, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రూ.2,020 కోట్లతో ఎస్‌ఆర్‌డిపి కింద ఓవైసీ, బహదూర్‌పురా ప్లై ఓవర్‌లతో పాటు, ఫలక్‌నుమా ఆర్‌ఓబి తదితర ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు. పెండింగ్ పనులపై ఎంఐఎం ఎమ్మెల్యేలతో సోమవారం మరోసారి చర్చించి అవి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాతబస్తీలో జరుగుతున్న చాలా పనులకు నిధులను విడుదల చేశామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా రూ.430 కోట్లతో మురికికాల్వలను బాగు చేస్తున్నామన్నారు. 11 వేల టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వివరించారు.

నిధుల విడుదలలో కేంద్రం నిర్లక్షం : ఎమ్మెల్యే దానం నాగేందర్
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయడంలో నిర్లక్షం చూపిస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతినియోగ్ కింద మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో తదితర వాటికి నిధులు కేంద్రం నుంచి విడుదల కావాల్సి ఉందన్నారు. ఆ నిధులను విడుదల చేయడంలో కేంద్రం నిర్లక్షం చూపిస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న తాను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు పొగుడుతున్నారని సీతక్క తనను ప్రశ్నించారని, సిఎం కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయని అదే విషయా న్ని తాను ప్రజలను తెలియచేస్తున్నానని దానం పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద తక్కువ ఫీజులను వసూలు చేయాలని దానం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పెండింగ్ పనులకు నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే గణేశ్ బిగాల
నిజామాబాద్‌లో ఎస్టీపిల కోసం 88 ఎకరాల భూమిని కేటాయించామని, దానికి రూ.38 కోట్లు అధికంగా ఖర్చు అవుతుందని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే ఆయన స్పందించి నిధులను మంజూరు చేశారని ఎమ్మెల్యే గణేశ్ బిగాల గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్‌లో మరికొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటికి కూడా నిధులను మంజూరు చేయాలని గణేశ్ బిగాల మంత్రి కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

అవినీతిని నిర్మూలనకు టిఎస్ బిపాస్ : ఎంఎల్‌ఎ వివేకానంద
అవినీతిని నిర్మూలించడానికి టిఎస్ బిపాస్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కెపి వివేకానంద పేర్కొన్నారు. ఈ సారి సీజనల్ వ్యాధులు రాకుండా మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపునకు ప్రజాప్రతినిధులందరూ స్పందించారన్నారు. సిఎం కెసిఆర్‌తో పాటు అందరూ కష్టపడుతున్నారన్నారు. అందులో భాగంగానే రాష్ట్రానికి అనేక అవార్డులు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఇళ్లు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు పేదలకు సొంతింటి కలను సాకారం చేయనుందన్నారు. చెట్లను నాటే కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు.

అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఓడించింది
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తమకు అంబేద్కర్‌పై గౌరవం ఉందని భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని అవి ఒట్టిమాటలేనని ఆయన ఆరోపించారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఓడించి అవమానించింది నిజం కాదా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. అంబేద్కర్‌ను పార్లమెంట్‌లో అడుగు పెట్టనివ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ నేతలు ఆయన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

అంబేద్కర్‌ను గౌరవిస్తున్నాం కాబట్టే బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వద్ద దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని 28 ఫీట్ల ఎత్తులో పెట్టామన్నారు. ట్యాంక్ బండ్ వద్ద 125 ఫీట్ల ఎత్తులో ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టబోతున్నామన్నారు. అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉంటే ఆ పార్టీ ఎప్పుడో బాగుపడేదన్నారు. తమపార్టీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళుతుందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. బోధించు, సమీకరించు, పోరాడు అన్న అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Minister KTR reverse comments to bhatti vikramarka