Home తాజా వార్తలు కర్ఫ్యూ ఖతం

కర్ఫ్యూ ఖతం

Minister KTR speech on Curfew in hyderabad

హైదరాబాద్ నగరంలో నాలుగేళ్లుగా ఒక్క గంట కూడా కర్ఫూ అవసరం రాలేదు

శాంతిభద్రతలకు పెద్దపీట వేశాం
విశ్వనగర వికాసానికి రూ.50 వేల కోట్లతో ప్రణాళిక
సుస్థిర ప్రభుత్వం టిఆర్‌ఎస్‌తోనే
టిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి
మంత్రి కె.టి.రామారావు 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వస్తే హైదరాబాద్‌లో శాంతిభద్రతలుండవని భయపెట్టారని, నాలుగేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో ఒక్క రోజు కాదు కదా ఒక్క గంట కూడా కర్ఫూ లేదని టిఆర్‌ఎస్ నేత, అపద్ధర్మ మంత్రి కె.టి.రామారావు అన్నారు. తెలంగాణ వస్తే ఆంధ్రావాళ్లను, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టి శివసేనలా వ్యవహరిస్తుందని విష ప్రచారం చేశారని గుర్తు చేశారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం శాంతి భద్రతలకు పెద్దపీట వేసిందన్నారు. అగర్వాల్, జైన్, మహేశ్వరి మార్వాడి సంఘాల ప్రతినిధులు ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రి కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా సంఘాల నేతలు అశోక్ జైన్, మహేందర్ గుప్తా, రాధే శ్యామ్, దేవెందర్ లడ్డా తదితరులకు మంత్రి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు హౌసింగ్ సొసైటీ ఛైర్మన్ కోలేటి దామోదర్, కార్పోరేటర్ మమత గుప్త, ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి,మాజీ ఎంపి గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని అంటారు కానీ ఆచరణలో అమలు చేయరని, తాము అలా అనకపోయినా మోడీ సబ్ కా సాత్, సబ్ కా వికాస్‌ను ఆచరణాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. నగరంలో 1920లో నగరానికి వచ్చిన మహాత్మాగాంధీ హైదరబాద్ ప్రజల జీవన సౌందర్యాన్ని చూసి గంగాజమునా తెహజీబ్‌గా అభివర్ణించారని, దానిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిజమని రుజువు చేసిందని పేర్కొన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్, టిడిపి, బిజెపి పాలనలో సాధించలేని అభివృద్దిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపిందని చెప్పారు. కాంగ్రెస్‌ను నమ్మ చేతి గుర్తుకు ఓటు వేస్తే అది దేశ ప్రజలకు చెయ్యించిందని, ఏదో చేస్తుందన్న ఆశతో బిజెపిని నమ్మి పువ్వు గుర్తుకు ఓటు వేస్తే ఆ పార్టీ ప్రజల చెవిలో పూలు పెట్టిందని ఎద్దేవా చేశారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రజలను దర్జాగా కారులో తీసుకెళ్తుందని, కారుకు అత్యంత సమర్థుడైన, అనుభవజ్ఞుడైన డ్రైవర్ ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నగరంలో 10 వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సంకల్పించామని తెలిపారు. అందులో 5 వేల సిసి కెమెరాలు ఇప్పటికే అమర్చామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశామని, మరో ఆరు నెలల్లో అది పూర్తవుతుందని చెప్పారు. నగరంలోని అన్ని సిసి కెమెరాలు కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించి ఎక్కడ నేరం జరిగిన క్షణాల్లో సమాచారం వచ్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేశామని వివరించారు. రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, మిషన్‌భగీరథ వంటి పథకాలతో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలిచిందన్నారు.

90 శాతం మంచినీటి సమస్యను తీర్చాం
కాంగ్రెస్, టిడిపి హయాంలో నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని, ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ వాళ్లు ఖాళీ బిందెలతో ఆందోళనలు చేసేవారని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచినీటి సమస్యను 90 శాతం పరిష్కరించామన్నారు. తమ ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి శ్రమిస్తుందని కెటిఆర్ వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, 330 కిలోమీటర్ల పొడవునా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు రెండు దశల్లో పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, మరోదశ పెట్రో సేవలు డిసెంబర్‌లో అందుబాటులో రానున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన టిఎస్ ఐపాస్ ద్వారా హైదరాబాద్ పెట్టుబడుల కేంద్రంగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిందన్నారు. నగరానికి గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు వచ్చాయని చెప్పారు. నగరంలో రోడ్ల పరిస్థితి బాగాలేని పరిస్థితి వాస్తవమే అని, అయితే గత పాలకులు సరైన డ్రైనేజి వ్యవస్థ, కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం వల్లనే ఇప్పుడు రోడ్లు తవ్వి బాగుచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.50 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.

బిజెపి నోట్ల రద్దుతో ఇబ్బందులకు గురిచేసింది
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్క భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న మాటను నిలుపుకోలేదని అన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి వంటి వారు తాము అధికారంలోకి వస్తే ఇంటి కిరాయి కడతామని, సోఫా కవర్లు మారుస్తామని హామీ ఇస్తున్నారని ఎద్దేశా చేశారు. ప్రతిపక్షాలు ఓట్ల కోసం అర్థంపర్థం లేని వాగ్దానాలు ఇస్తున్నారని మండిపడ్డారు. తమ నేత కెసిఆర్ మాత్రం భావితరాల భవిష్యత్తును, ఇప్పటితరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

కాంగ్రెస్‌ది సీల్డ్ కవర్ రాజకీయం
తెలంగాణ వస్తే విద్యుత్ లేక కారుచీకట్లు అలుముకుంటాయని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్, టిడిపిల హయాంలో రోజుకు ఆరు గంటలు కూడా కరెంట్ వచ్చేది కాదని, పరిశ్రమలు వారానికి రెండు రోజులు పవర్‌హాలిడేస్ ప్రకటించేవని అన్నారు. కరెంట్ కోసం పారిశ్రామికవేత్తలు, కార్మికులు ఇందిరాపార్కు వద్ద ఆందోళనలు చేసేవారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్, టిడిపిలకు బాసులు ఢిల్లీలోనో, విజయవాడలోనో ఉండరని, టిఆర్‌ఎస్ బాస్ మన గల్లీలో ఉంటారని అన్నారు. టిఆర్‌ఎస్‌లో కెసిఆర్ ఒక్కరే సిఎం అని, కానీ కాంగ్రెస్‌లో 40 మంది సిఎం అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ది సీల్డ్ కవర్ రాజకీయమని, ఢిల్లీ నుంచి వచ్చిన సీల్డ్ కవర్‌లో నుంచి సిఎం బయటకు వస్తారని అన్నారు.

సుస్థిర పాలన ఇవ్వడం కాంగ్రెస్ వల్ల కాదని పేర్కొంటూ 1991-1994, 2009-2014 మధ్య ఒక్క టర్మ్‌లోనే ముగ్గురు సిఎంలు మారిన విషయాన్ని గుర్తు చేశారు. సుస్థిర ప్రభుత్వం టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమని తెలిపారు. హైదరాబాద్ నగరం మినీ ఇండియా అని,నగరంలో ఎన్నో ఏళ్ల నుంచే గుజరాతీ గల్లీ, సింధి కాలనీలు, పార్శిగుట్ట ఉన్నారని అన్నారు. ఇక్కడి ప్రజల మధ్య సోదరభావం ఉందని తెలిపారు. నగర ప్రజలు గత ప్రభుత్వాల పాలనను, నాలుగేళ్ల టిఆర్‌ఎస్ పాలనను బేరీజు వేసుకుని ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఆశీర్వదించాలని మంత్రి కెటిఆర్ కోరారు.

Minister KTR speech on Curfew in hyderabad

Telangana Letest News