Home తాజా వార్తలు మా పట్టణాలకు రావాల్సిన రూ.1434 కోట్లు ఇవ్వండి

మా పట్టణాలకు రావాల్సిన రూ.1434 కోట్లు ఇవ్వండి

Minister KTR urges Centre to release pending dues

 

రాష్ట్రాలకు నిధులిచ్చినట్లు పార్లమెంట్‌కు రిపోర్టు ఇచ్చారు, తెలంగాణకు రూపాయి రాలేదు
కేంద్రం నుంచి మ్యాచింగ్ నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు రాష్ట్ర పురపాలకమంత్రి కెటిఆర్ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పట్టణాలకు రావాల్సిన గ్రాంట్ల బకాయిలను తక్షణమే కేంద్రం విడుదల చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామా రావు విజ్ఞప్తి చేశారు. 14వ ఆర్ధిక సంఘం, 15వ ఆర్ధిక సంఘం నుంచి రాష్ట్రానికి మొత్తంగా రూ. 1,434 కోట్ల నిధులు రావాల్సి ఉందన్నారు. ఈ నిధులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు మంత్రి కెటిఆర్ ఒక లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి మిలియన్ ప్లస్ నగరాల కేటగిరిలో ఉన్న హైదరాబాద్‌కు రూ. 468 కో ట్లు, ఇతరపట్టణాలకు అదనంగా మ రో రూ. 421 కోట్ల నిధులను కేంద్రం కేటాయించిందని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

ఈ నిధులను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ నిధుల కేటాయింపును గతంలోనే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు. దీనిపై యాక్షన్ క్షన్ రిపోర్టును సైతం పార్లమెంటులో కేంద్రం ప్ర వేశపెట్టిందని నిర్మలా సీతారామ న్‌కు మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. అయితే హైదరాబాద్‌కు రావాల్సిన నిధుల్లో ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.మిగిలిన నగరాలకు సంబంధించి కేవలం రూ. 105 కోట్ల మాత్రమే ఇప్పటి వరకు విడుదల చేశారన్నారు.

కరోనా సంక్షోభంలో రాష్ట్రాలు కూడా ముందువరుసలో ఉండి పోరాడుతున్నయని, దీంతో పాటు ఆర్థిక కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మంత్రి కెటిఆర్ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నదన్నారు. వీటికి సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్‌ను కూడా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం జరిగిందని తెలిపారు. అయితే ఆయా పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమాలను వేగంగా కొనసాగించడం కొంత ఇబ్బందిగా మారిందని మంత్రి కెటిఆర్ అన్నారు.

గతంలో 14వ ఆర్థిక సంఘం సూచించిన రూ. 2714 కోట్లకుగానూ బేసిక్ గ్రాంట్ కింద కేంద్రం కేవలం రూ. 2502 కోట్లు మాత్రమే విడుదల చేసిందని లేఖలో మంత్రి కెటిఆర్ వివరించారు. ఆ నిధుల్లో కూడా ఇంకా రాష్ట్రానికి రూ. 208 కోట్లు రావాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. ఈ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నా కేంద్ర నిధులు రాకలో జాప్యం జరిగిందన్నారు. దీంతో పాటు 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి పర్ఫామెన్స్ గ్రాంట్ కింద రావాల్సిన నిధుల్లో రూ. 441 కోట్ల బాకీ ఉన్నాయన్నారు. ఇలా మొత్తం 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి రూ. 650 కోట్ల నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు.

అయితే స్థానిక పట్టణ సంస్థలకు రావాల్సిన ఈ గ్రాంట్లను కేంద్రం ఇతర రాష్ట్రాలకు పూర్తిగా చెల్లించిన విషయాన్ని మంత్రి తన లేఖలో ప్రస్తావించారు. ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన హైదరాబాద్ కి రావాల్సిన రూ. 468 కోట్లు, ఇతర పట్టణాలకు రావాల్సిన రూ. 315 కోట్లు,14వ ఆర్థిక సంఘానికి సంబంధించి రూ. 650 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 1,434 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ లేఖను కేంద్ర పట్టణాభివృద్ధి హౌసింగ్ శాఖ మంత్రి హరీ దీప్ సింగ్ పూరికి కూడా పంపించారు.

Minister KTR urges Centre to release pending dues