Home తాజా వార్తలు సంక్షోభంలోనూ సంక్షేమం

సంక్షోభంలోనూ సంక్షేమం

Minister KTR visit at veernapally mandal

 

పేదల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వ కార్యక్రమాలు
అటవీ సంపదను కాపాడుకోవాలి
వీపుకు ఆక్సిజన్ కట్టకుని తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పర్యటనలో మంత్రి కెటిఆర్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

మన తెలంగాణ/ సిరిసిల్ల/ వీర్నపల్లి: పేద ప్రజల ప్రయోజనాలే పరమావధిగా వారి మోముల్లో ఆనందం కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలంలో రూ.15 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి పనులను మంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం కంచర్ల గ్రామంలో 33/11 సబ్ స్టేషన్ కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలనా సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.

రైతులకు కరోనా కష్ట కాలంలోనూ 57లక్షల మందికి రైతుబంధు ఇచ్చామని అన్నారు. అడవిని కాపాడుకోవడం అందరి బాధ్యత, అడవిని ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా వీర్నపల్లి మండలం ఏర్పాటు కావడంతో గ్రామాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి తప్పిందని అన్నారు. మొక్కలు నాటడం కాదు, వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే ఎంతో కసరత్తు చేసి దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రంగంపేట అటవీ భూ సమస్యలకు పరిష్కారం చూపామని అన్నారు. పోడు భూములను ఏండ్లుగా సాగు చేసుకుంటున్న 307 మంది ఎస్టీలు, ఇతర పేదలకు సుమారు 281 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కల్పించామని వెల్లడించారు.

అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజుగా చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 166 కోట్లతో మల్కపేట రిజర్వాయర్ నుంచి ఎత్తయిన ప్రాంతం వీర్నపల్లి మండలానికి సాగు నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రోడ్డు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, మారుమూల గ్రామాలు కూడా ఆర్థికాభివృద్దికి నోచుకుంటాయని అన్నారు. గ్రామీణ రహదారులు, వంతెనల విషయంలో గత ఆరెండ్లలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. రాజకీయ లాభాపేక్ష లేకుండా భవిష్యత్తు తరాలు బాగుపడాలనే సియం కేసిఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు.

ఇష్టారీతిగా చెట్లను నరికితే గాలిని కూడా కొనే పరిస్థితి ఉంటుందని, అలాంటి పరిస్థితి రావొద్దని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారానికి పూనుకుందని తెలిపారు. 500మంది జనాభా ఉన్న తండాలకు గ్రామ పంచాయతో హోదా కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జెడ్పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, జెడ్పిటిసి గుగులోతు కళావతి, ఎంపిపి మాలోతు భూలా, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, టిఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, జెడ్పి కో ఆప్షన్ సభ్యుడు ఎండి చాంద్ పాషా తదితరులు పాల్లొన్నారు.

రెండు పడకల గదుల నిర్మాణ ప్రగతిపై మంత్రి సమీక్ష
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై మంత్రి కెటిఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. రానున్న రెండు నెలల్లో జిల్లాకు మంజూరైన మొత్తం ఇళ్లను పూర్తిచేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని వెంటనే నియమించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు ప్రత్యేక క్యాలెండర్‌ను తయారు చేసుకోవాలని మంత్రి కెటిఆర్ అధికారులకు సూచించారు.

Minister KTR visit at veernapally mandal