Saturday, April 20, 2024

కోనసీమలా సిరిసిల్ల

- Advertisement -
- Advertisement -

 కాళేశ్వర జలాలతో రూపు మారుతున్న జిల్లా
 పేదవారి ముఖంలో సంతోషం చూడటమే సిఎం కెసిఆర్
 సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల: పేదవారి ముఖంలో సంతోషం చూడటమే సిఎం కెసిఆర్ ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధ్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లాలో బుధవారం మంత్రి కెటిఆర్, రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ తదతరులు సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినిపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధ్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రాచర్ల గొల్లపల్లిలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల్లు, ఎల్లారెడ్డిపేటలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. సిరిసిల్లలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్‌కు భూమిపూజ, నూతన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభించారు. వేములవాడ 100 పడకల ఆసుపత్రిలో ఆక్సిజన్ కాన్సట్రేటర్లను వితరణ చేశారు. బోయినిపల్లి మండలం కొదురుపాక జంక్షన్ వద్ద రోడ్డు వెడల్పు పనులను, మంత్రి కెటిఆర్ అమ్మమ్మ జోగినిపల్లి లక్ష్మి, తాతయ్య జోగినిపల్లి కేశవరావు జ్ఞాపకార్థం రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. కెడిసిసి బ్యాంకును, విలాసాగర్‌లో సాగునీటి ఎత్తిపోతల లిఫ్ట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఏ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా సిఎం కెసిఆర్ ఆలోచించి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు పిట్టగూడు లాంటి ఇళ్లను పేదలకు అదీ కొంత స్వంత డబ్బు కడితే మరి కొంత వారు అందించి కట్టించేవారని అవి పేదల ఆత్మగౌరవ ప్రతీకలు కావని సిఎం కెసిఆర్ భావించి దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం చేపట్టారన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ఇండ్లను నిరుపేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందిస్తున్నారన్నారు. అర్హుల ఎంపిక కూడా పారదర్శకంగా ఒకటికి ఐదు సార్లు విచారణ జరిపి అధికారులు ఎంపిక చేస్తున్నారన్నారు. ఒక్కో గజం స్థలం లక్షాయాభైవేల రూపాయల విలువ చేసే స్థలాలు కూడా పేదలకు ఇండ్ల కోసం కేటాయించామన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నల్లాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఇళ్ల్లు అందని నిరుపేదలు, అర్హులకు కూడా త్వరలోనే ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల్లు పొందినవారు తమ కాలనీలను పచ్చదనం వెల్లివిరిసేలా చెట్లు నాటి పెంచాలన్నారు. ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి అక్సిజన్ అందక అనేక మంది మృత్యువాత పడ్డారని అందువల్ల ప్రాణవాయువునిచ్చే చెట్లతో ఈ ప్రాంతమంతా నిండిపోవాలన్నారు. ఒకప్పుడు దుర్భిక్షప్రాంతమైన సిరిసిల్ల కాళేశ్వరం జలాలతో కోనసీమను తలపించేలా తయారవుతోందన్నారు. కెసిఆర్ కంటే ముందు బీడి కార్మికుల గూర్చి ఎవరూ ఆలోచించలేద న్నారు. బీడీలు చుట్టే ఆడబిడ్డలకు నెలకు రూ. 2 వేలు పించన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి సిపి అరుణ, సహకార సంఘాల జాతీయ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Minister KTR Visit Rajanna Sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News