Home తాజా వార్తలు దావోస్‌పై కెటిఆర్ ముద్ర

దావోస్‌పై కెటిఆర్ ముద్ర

Minister KTR

 

బహుముఖం.. దిగ్విజయం

విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి
ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే పార్టీకి దిశానిర్దేశం
హైదరాబాద్ ఘనతపై ఫోకస్

హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోస్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 19వ తేదీన స్విట్జర్‌ల్యాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొందుకు వెళ్ళిన ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో మంత్రి కెటిఆర్ అనేక ప్రముఖ కంపెనీలకు చెందిన సీనియర్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన మంత్రులను కలిశారు. తన వాక్‌చాతుర్యం, బహుముఖ ప్రతిభతో తెలంగాణకు పెట్టుబడులు రప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ముఖ్యంగా పారిశ్రామిక వేత్తలకు మంత్రి కెటిఆర్ ఇచ్చిన భరోసాతో వారిలో తెలంగాణ పట్ల మరింత విశ్వాసం పెరిగింది. దీంతో త్వరలోనే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టబడులు రానున్నాయి.

ఇప్పటికే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంత్రి కెటిఆర్ ఒప్పందాలను కూడా చేసుకున్నారు. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో దావోస్‌కు వెళ్ళిన కెటిఆర్ పర్యటన విజయవంతమైంది. మంత్రిగా ఒకవైపు రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు యత్నిస్తూనే మరోవైపు టిఆర్‌ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడిగా పార్టీ నేతలకు పురపోరుపై నిత్యం దశా, దిశ నిర్దేశం చేశారు. ఇక ట్విట్టర్ ద్వారా కూడా ప్రజల సమస్యలపై కూడా స్పందిస్తూ తన బహుముఖ ప్రతిభను కెటిఆర్ చాటుకున్నారు.

కాగా దావోస్ పర్యటనలో మంత్రి కెటిఆర్ సుమారు 50కి పైగా ముఖాముఖి సమావేశాలతో పాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 5 చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆల్ఫాబెట్, గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్, కోకకోల సిఇఒ జేమ్స్ క్వేన్సీ , సేల్స్ ఫోర్స్ స్థాపకుడు చైర్మెన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సిఐఒ సుసాన్ వొజ్కికి లాంటి కార్పొరేట్ దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రం యొక్క ప్రగతిశీల విధానాలతో పాటు పారిశ్రామిక పాలసీని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను, వివిధ పరిశ్రమలకు ఇక్కడ అందుబాటులో ఉన్న వనరులను పరిచయం చేశారు. రాష్ట్రం ఏ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో అగ్రస్థానంలో నిలుస్తుందన్న విషయాన్ని వివరించారు. హైదరాబాద్ నగరం శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న తీరుని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కాస్మోపాలిటన్ కల్చర్‌తో పాటు గత కొన్ని సంవత్సరాలుగా జీవించేందుకు అనువుగా ఉన్న నగరాల్లో అత్యుత్తమ నగరంగా ఎంపిక అవుతున్న విషయాన్ని కూడా వివరించారు. పిరమల్ గ్రూప్‌కి సంబంధించిన రూ.500 కోట్ల పెట్టుబడితో పాటు అనేక ఇతర కంపెనీలు తెలంగాణ పట్ల ఆసక్తి వ్యక్తం చేసేలా కెటిఆర్ చేశారు. వరల్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పెవిలియన్ ని ఏర్పాటు చేసింది. మన దేశం నుంచి మధ్యప్రదేశ్ కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు కూడా పాల్గొన్నప్పటికీ తెలంగాణ భారీ ఎత్తున సొంత రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాగలిగింది. మంత్రి కెటిఆర్ ప్రతినిధి బృందంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం, టి హబ్ సిఇఒ రవి నారాయణ్ తదితరులు ఉన్నారు.

ఆకట్టుకున్న కెటిఆర్
యువ మంత్రిగా కెటిఆర్ దావోస్‌లో పలువురు వ్యాపార వేత్తలను విశేషంగా ఆకట్టుకున్నారు. పెట్టుబడులకు తెలంగాణ ఏ విధంగా మేలు అనే విషయాన్ని సవివరంగా ఎకానిమిక్ ఫోరంలో కెటిఆర్ వివరించారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ఇతర సదుపాయాలు, టిఎస్ ఐపాస్ ద్వారా పదిహేను రోజుల్లోనే ఇస్తున్న అన్ని రకాల పారిశ్రామిక అనుమతులపై కెటిఆర్ సువివరించారు. దీంతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అన్న విశ్వాసాన్ని కల్పించగలిగారు.

పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షుడిగా నిరంతర పర్యవేక్షణ
రాష్ట్ర మంత్రిగా దావోస్‌కు వెళ్ళిన కెటిఆర్ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా తన విధుల్లో అనువంత నిర్లక్ష్యాన్ని కూడా ఎక్కడా ప్రదర్శించ లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీన 120 మున్సిపాలిటీలకు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను విజయతీరాలకు తీర్చడానికి అవసరమైన అన్ని రకాల వ్యూహాలను దావోస్ నుంచే కెటిఆర్ అమలు చేశారు. ప్రత్యర్ధి పార్టీల కదలికలను అక్కడి నుంచే పసిగట్టి పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా వారిని కార్యోణ్ముఖులను చేశారు.

ఎంత దూరంలో ఉన్నా.. ప్రజల బాగోగులపైనే దృష్టి
కెటిఆర్ తన ట్విట్టర్ పోస్టులను కూడా మరిచిపోలేదు. ముఖ్యంగా దావోస్‌కు వెళుతున్న సమయంలో విమానం రావడం కొంత ఆలస్యం కావడంతో అక్కడ సామజవరగమన పాట విని తన్మయత్వం పొందారు. ఈ పాటకు సంగీతాన్ని అందించిన తమన్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. అలాగే రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లాకు చెందిన శివాంశ్ అనే మూడు నెలల చిన్నారికి గుండెకు చిల్లుపడిందన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న కెటిఆర్ వెంటనే తన పేషి అధికారులను అలర్ట్ చేశారు. సదరు కుటుంబానికి అండగా ఉండాలని, చిన్నారి గుండె ఆపరేషన్‌కు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామన్న హామీ ఇచ్చారు.

Minister KTR who impressed Global Businessmen