Home తాజా వార్తలు ‘డీట్’ యాప్‌తో నిరుద్యోగులకు ఉద్యోగం

‘డీట్’ యాప్‌తో నిరుద్యోగులకు ఉద్యోగం

DEET-App

మనతెలంగాణ/హైదరాబాద్ : డిజిటల్ ఎంప్లాయిమెంట్ టెక్నాలజీని యాప్ ద్వారా ఉద్యోగాలు ఈజీగా పొందవచ్చని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల, మహిళా, శిశు సంక్షేమం, నైపుణ్యం, అభివృద్ధి శాఖల మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం DEET (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్‌ను సోమవారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభు త్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు DEET(డిజిటల్ ఎంప్లాయిమెం ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ) అనే కొత్త మార్గదర్శక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈయాప్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల వివరాలతో పాటు, నిరుద్యోగ యువ త వివరాలు అందులో నిక్షిప్తమై ఉంటాయన్నారు. ఉపాధి కొరకు ఇంటర్నెట్, మొబైల్ అప్లికేషన్స్ డీట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. DEET ద్వారా ఉద్యోగ సంస్థ లు, నిరుద్యోగులు చర్చించుకో వచ్చన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉచిత వెబ్ సైట్‌ను ఇప్పటివరకు దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అందుబాటులోకి తెచ్చిందన్నారు. నిరుద్యోగులకు పైసా ఖర్చు లేకుండా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటం, ఇంటర్వ్యూలకు వెళ్లే సౌకర్యం DEET కల్పిస్తుందన్నారు. నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఎప్పటికప్పుడు ఉద్యోగాల ఖాళీల వివరాలు, సమాచారం అందుతుందన్నారు. ఇప్పటివరకు DEET తెలంగాణలో 45 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్న వివిధ సంస్థలను గుర్తించి ఈ యాప్‌లో నిక్షిప్తం చేసిందన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువత ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీలో ముందు వరుసలో ఉందన్నారు.
ఇది మొబైల్ యాప్: జయేష్ రంజన్
ఇది మొబైల్ యాప్ అని, గూగుల్ ప్లే స్టార్ ద్వారా దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జయేష్ రంజన్ ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. రాష్ట్రానికి పెద్ద కంపెనీలు వస్తున్నాయని ఇది శుభపరిణామమన్నారు. ఈ రోజు వన్ ప్లస్ సంస్థ ప్రారంభమయ్యిందని, ఈ సంస్థ 1500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇది శుభ పరిణామమని DEET ద్వారా ఉద్యోగ కల్పన ఉంటుందన్నారు. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో, ఏ కంపెనీలో ఉన్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చన్నారు. రేపు ఇజ్రాయెల్ కంపెనీ ప్రకటన పెడుతుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వస్తున్నారన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాల వారు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. ఇప్పటికే దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని పరిశ్రమలను మన రాష్ట్రంలో స్థాపిస్తున్నారని, ఇది నిరుద్యోగులకు శుభవార్త అని ఆయన పేర్కొన్నారు.

Minister Mallareddy launches digital employment exchange App