Home తాజా వార్తలు ఉపాధి కల్పన అంటే ప్రభుత్వ ఉద్యోగాలేనా?

ఉపాధి కల్పన అంటే ప్రభుత్వ ఉద్యోగాలేనా?

Minister Niranjan Reddy Comments on employment

= ప్రతిపక్షాలు రాజకీయ కోణంతో తప్పు దోవ పట్టిస్తున్నారు
= వ్యవసాయ రంగం పై రెండుకోట్ల 50 లక్షల మందికి ఉపాధి
= చదువు విఙ్ఞానం కోసం
= పప్పుదినుసులు, పామయిల్ సాగుపై దృష్టి
= రాష్ట్రవ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 

నాగర్‌కర్నూల్: ఉపాధి కల్పన అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగమే అన్నట్లు ప్రతిపక్షాలు రాజకీయ కోణంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ , కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. కొందరు ప్రతిపక్షాల నాయకులు పనిగట్టుకొని ప్రభుత్వం పై బురద చల్లేందుకు చేస్తున్న చర్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఐటి రంగంతో పాటు పారిశ్రామిక రంగంలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అందుతున్నాయంటే రాష్ట్రప్రభుత్వం అవలంభిస్తున్న ఉపాధి కల్పనలో భాగమే అన్నారు.

ప్రభుత్వాలు జనాభాలో ఒక శాతం మందికి మాత్రమే ఉద్యోగాలను కల్పించడం సాధ్యం అవుతుందని మిగతా జనాభాకు వ్యవసాయ, పారిశ్రామిక , ఐటి తదితర రంగాలలో ఉపాధి కల్పించడం ద్వారా ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందన్న లక్షంతో ఆ దిశగా దేశంలోనే ఏ రాష్ట్రం అవలంభించని విధంగా ఉపాధి కల్పనకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు.  కొందరు పనిగట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాలే ఉపాధి అన్నట్లు చిత్రకరిస్తూ దీక్షలకు పూనుకుంటున్నారని పరోక్షంగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు శర్మిలను ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రంలో 63 లక్షల 40వేల మంది రైతులు ఉన్నారని కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నా రెండున్నర కోట్ల మంది ఈ వ్యవసాయ రంగంపై ఉపాధి పొందుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. తెలంగాణలో రాష్ట్ర ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నిరంగాలను అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోని ప్రజలకు ఉపాధి కల్పించే అనేక చర్యలకు శ్రీకారం చుట్టారన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఎకరా, గుంటకు సాగునీరు అందిస్తూ రైతులకు అండగా నిలిచారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటి వనరులను కాపాడుకుంటూ రైతుకు మేలు చేసే విధంగా అనేక పథకాలను రూపొందించారన్నారు. రైతుబంధు పథకం ద్వారా 63 లక్షల 40వేల మంది రైతులకు ఏడు వేల 360 కోట్ల 40 లక్షల రూపాయలను అందించడం జరుగుతుందన్నారు. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అని గత పాలకులు చెప్పారే తప్ప కెసిఆర్ సిఎం అయ్యాక పల్లెలు, పట్టణాలకు అంతరాలు లేకుండా అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోనే రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందన్నారు. 70 ఏళ్ళలో జరగని అభివృద్ధి ఏడేళ్ళలో చేశారంటే అది ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనతే అన్నారు.

రాష్ట్రంలో వాణిజ్య పంటలను సాగుచేయడం ద్వారా రైతులు లాభాలు గడించవచ్చన్నారు. నూనె గింజల ప్రాధాన్యత, అవసరాలు గుర్తించి రాష్ట్రంలో పప్పు ధాన్యాల సాగు, ఆయిల్‌పామ్ సాగు ద్వారా నూనె గింజల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో పామాయిల్ సాగు చేయడమే లక్షంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది 3 లక్షలు వచ్చే రెండేళ్ళలో 7,10 లక్షల చొప్పులన ఎకరాలలో పామాయిల్ సాగును చేపడతామన్నారు. ఈ ఏడాది రైతుబంధు పథకం కింద 63 లక్షల 40వేల మంది రైతులకు 7వేల 360 కోట్ల 40 లక్షల రూపాయలు అందించడం జరిగిందన్నారు.

యాసంగిలో రైతులు వరిసాగు చేయవద్దని ఇతర పంటలను సాగు చేయడం ద్వారా లాభాలు గడించవచ్చన్నారు. పప్పు పంటలను, పామాయిల్ సాగును పెంచేవిధంగా రాష్ట్రంలో చర్యలు తీసుకుంటున్నామని నిరంజన్ రెడ్డి అన్నారు. మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాలలో ఎంపి పోతుగంటి రాములు, జడ్పీచైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి, రాష్ట్ర ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ కల్పన, కలెక్టర్ శర్మన్, అదనపు కలెక్టర్ మనుచౌదరిలతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Minister Niranjan Reddy Comments on employment