Home తాజా వార్తలు విభజన రాజకీయాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి : నిరంజన్ రెడ్డి

విభజన రాజకీయాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి : నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy Comments On PM Modiహైదరాబాద్‌ : విభజన రాజకీయాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రజలను విభజించడం ద్వారా లబ్ధి పొందాలని చూసేవారికి గ్రేటర్ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన నగర ప్రజలను కోరారు. శనివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. జనం మద్ధతు లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎపి ప్రజలు తిరస్కరించిన జనసేన వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ తో బిజెపి జత కట్టడం వల్ల టిఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదని, వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రజల ఉసురుపోసుకున్నారని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. మోడీ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్నారని మంత్రి ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు మేలు జరిగేలా మోడీ పాలన ఉందని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే కార్పొరేట్లకు రూ.2.50 లక్షల కోట్ల రుణాలను మోడీ మాఫీ చేశారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని మంత్రి ఆరోపించారు. హైదరాబాద్ లో వరదసాయాన్ని అడ్డుకున్న బిజెపి నేతలను నగర ప్రజలు నిలదీయాలని ఆయన కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ వందకు పైగా సీట్లను గెలిచి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన టిఆర్ఎస్ కార్యకర్తలను కోరారు.