Thursday, April 25, 2024

రైతుల కోసం నిలబడింది ఒక్క టిఆర్‌ఎస్సే: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister Niranjan Reddy slams BJP over Paddy Issue

మన తెలంగాణ/హైదరాబాద్: బాయిల్డ్ రైసు విధానాన్ని కేంద్రమే ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ విధానంపైనే ఇప్పుడు కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తోందని ఆయన మండిపడ్డారు. దీనిపై కేంద్రం స్పష్టమైన విధానాని ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం పదేపదే డిమాండ్ చేస్తున్నా….ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. కానీ ఈ విషయంలో కేంద్రానిది అవకాశవాద ధోరణిలా కనిపిస్తోందని మండిపడ్డారు. కేంద్రం చేతకాని తనం కారణంగానే రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థ మాయలో పడిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నీరుగారుస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో ఎంఎల్‌ఎలు మెతుకు ఆనంద్, కాలేరు వెంకటేష్, ఎంఎల్‌సి సురభి వాణీదేవి, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎంత పోరాడినా కేంద్రం తన వైఖరి మార్చుకోవట్లేదన్నారు. అందుకే యాసంగిలో రైతులు వరి వేయొద్దని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో టిఆర్‌ఎస్ ఎంపిలు పోరాడుతున్నారన్నారు. వాస్తవానికి ధాన్యం కొనుగోళ్లతో రాష్ట్రానికి సంబంధం లేదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను కేంద్రం చాలా రోజులకు మంజూరు చేస్తోందన్నారు. అయితే రైతులు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ముందే డబ్బులు చెల్లించేదని వెల్లడించారు.

రైతుల కోసం నిలబడింది ఒక్క టిఆర్‌ఎస్సే
పంట కోసం రైతులు నిలబడితే….వారి కోసం సిఎం కెసిఆర్ అండగా ఉన్నారన్నారు. రైతుల పక్షాన, వారి సంక్షేమం కోసం నిలబడింది ఒక్క టిఆర్‌ఎస్ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అవాస్తవాలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి కేవలం సహకారం మాత్రమే రాష్ట్రం అందిస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్‌సిఐదే బాధ్యత అని మంత్రి సింగిరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుండి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, సివిల్ సప్లైస్ శాఖ అధికారులు కేంద్రానికి లేఖలు రాసినా ఇప్పటి వరకు స్పందన రాలేదన్నారు. కేంద్రమే బియ్యం తీసుకపోకుండా….బియ్యం పంపలేదని రాష్ట్రాన్ని బదనాం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రా రైస్, పారా బాయిల్డ్ రైస్‌కు తేడా తెల్వని వాళ్లు బిజెపి ఎంపిలు కావడం మన దురదృష్టమన్నారు. ఏడేండ్ల కాలంలో అత్యధిక శాతం కేంద్రం కొనుగోలు చేసింది పార్ బాయిల్డ్ బియ్యమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాంటి కేంద్రం ఇప్పుడు మాటమార్చి వంద శాతం బియ్యం సేకరించమనడం దుర్మార్గమన్నారు. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఏమార్చే విధానం మంచిది కాదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హితవు పలికారు. దేశంలో ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఇప్పటి వరకు ఎలాంటి ఆందోళన చేసిన దాఖలాలు లేవన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల మీద రైతులే స్వయంగా పోరాటం చేశారన్నారు. పార్లమెంటులో ఇంటా, బయటా పోరాడుతున్నది ఒక్క టిఆర్‌ఎస్ మాత్రమేనని అన్నారు.

కేంద్రం విధానాల కారణంగా పంటల మార్పిడి
కేంద్రం విధానాలు గమనించే పంటల మార్పిడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వరికి బదులు ఇతర పంటలు వేయాలని సూచించారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 10 లక్షల ఎకరాలలో కంది సాగు చేశారన్నారు. దీనిని భవిష్యత్‌లో 20 లక్షల ఎకరాలకు, పత్తి కోటి ఎకరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. యాసంగిలో వరి సాగు చేయవద్దు .. ఎలాంటి కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదన్నారు. రాష్ట్రం చేస్తున్న ప్రకటనలను కొందర తప్పుదారి పట్టించే విధంగా యత్నిస్తున్నారన్నారు. వారి మాటలు నమ్మి రైతులు ఆగం కావద్దు అన్నారు. ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాలు ఉండాలే కానీ కేంద్రం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తుందని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం ఉజ్వలంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Minister Niranjan Reddy slams BJP over Paddy Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News