Home జోగులాంబ గద్వాల్ కలిసి కట్టుగా కరోనాపై విజయం సాధిద్దాం

కలిసి కట్టుగా కరోనాపై విజయం సాధిద్దాం

Minister Niranjan Reddy visits covid center in gadwal

 

గద్వాల : ప్రజలంతా కలిసి కట్టుగా పోరాడితేనే కరోనా మీద విజయం సాధిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియ ఆసుపత్రిలోని కొవిడ్ సెంటర్‌ను మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సందర్శించారు. వార్డులోని కరోనా రోగులతో ముచ్చటించారు. ఆసుపత్రిలో డాక్టర్లు అందిస్తున్న వైద్యం, సేవలను, సౌకర్యాలను రోగులను ఆరా తీశారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చందూనాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వచ్చిన వారికి వైద్యం అందించేందుకు, సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసిన అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. కొవిడ్ రోగులకు అన్ని రకాల వైద్య సేవలను అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. డాక్టర్లు, ఆరోగ్యశాఖ, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, ఇతర వైద్య సేవలు శ్లాఘనీయమని, వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి మరీ ప్రజలకు సేవ చేస్తున్నారని, వైద్య, ఆరోగ్య శాఖకు మొత్తం సమాజం రుణపడి ఉందని తెలియజేశారు.

ఒకరికి ఒకరు సహకరిస్తే రాబోయే కొద్ది రోజులోనే తప్పకుండా విజయం సాధిస్తామని తెలిపారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిపై గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ వీఎం అబ్రహం, జిల్లా వైద్యుల ప్రత్యేక దృష్టి సారించి ఆసుపత్రి అభివృద్ధికి తోడ్పడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ సీఎం కెసిఆర్, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలందరికి కరోనా వచ్చింది, అందరికి తగ్గిపోయిందని, కరోనా సోకిన వారు ఎవరూ గాబరపడవద్దని, గాబరపడితే కరోనా మూలంగా ఇబ్బంది పడుతారని అన్నారు. కరోనా వచ్చిన వారు డాక్టర్ల సలహాల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, మాస్క్ వేసుకొని భౌతిక దూరం పాటించడం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చని తెలిపారు. ఒక వేళ కొవిడ్ వచ్చినా హోం ఐసోలేషన్‌లో ఉంటే తర్వగా బయట పడతారని వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తుందని వివరించారు. వారికి అక్కడే మందుల కిట్ ఇస్తున్నట్లు తెలిపారు.

అందువల్లే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలను బట్టి తెలుస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించి కరోనా నివారణకు పాటుపడాలని సూచించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించి కరోనా నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి వెంటా జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చందూ నాయక్, గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్రాములు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Minister Niranjan Reddy visits covid center in gadwal