Home తాజా వార్తలు మహిళల రక్షణకు పటిష్ట చర్యలు : సత్యవతి రాథోడ్

మహిళల రక్షణకు పటిష్ట చర్యలు : సత్యవతి రాథోడ్

Minister Satyavathi Rathod Comments On Womenహైదరాబాద్ : మహిళల రక్షణ విషయంలో దేశం గర్వించే విధంగా, ఇతర రాష్ట్రాలు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళల  సమస్యల పరిష్కారానికి వన్ స్టాప్ సెంటర్ గా పని చేసే హైదరాబాద్ జిల్లా సఖీ కేంద్రానికి శుక్రవారం బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12, మిథిలా నగర్ లో  మంత్రి సత్యవతి రాథోడ్, హైదరాబాద్ మేయర్  గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ వాణి దేవి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి  దానం నాగేందర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, కలెక్టర్ ఎల్. శర్మన్, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్ రావు, ఆర్ అండ్ బి ఎస్.ఈ పద్మనాభ రావు, ఇతర అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. హైదరాబాద్, మిథిలా నగర్ లో సఖీ కేంద్రానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సఖీ కేంద్రం కోసం స్థలాన్ని ఇచ్చినందుకు మేయర్, స్థానిక ఎమ్మెల్యే దానంకు సత్యవతి ధన్యవాదాలు తెలిపారు. సఖీ కేంద్రాలు దేశ వ్యాప్తంగా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంటోందని ఆమె పేర్కొన్నారు. సఖీ కేంద్రానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చి పెద్ద భవనం నిర్మాణం చేస్తున్నామని ఆమె చెప్పారు. మహిళల రక్షణ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్  నాయకత్వంలో చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. గంజాయి వల్ల నేరాలు పెరుగుతున్నాయని, పిల్లలు గంజాయికి బానిసలు అవుతున్నారని గమనించిన సిఎం కేసిఆర్ , గంజాయి సాగు, విక్రయాలపై ఉక్కుపాదంతో అణచివేయాలని ఇటీవలే ప్రత్యేక సమావేశాలు పెట్టి నిర్ణయించారని సత్యవతి చెప్పారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలని,  ఆడపిల్లల పట్ల నేరాలకు పాల్పడిన దోషులను కూడా సకాలంలో పట్టుకుని శిక్షిస్తున్నామని ఆమె వెల్లడించారు. దేశంలోని సీసీ కెమెరాల్లో మన దగ్గర 2/3 ఉన్నాయంటే మన రాష్ట్రంలో ఎంత నిఘా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె తెలిపారు. హైదరాబాద్ నగరంలో మహిళల సమస్యల పరిష్కారం విషయంలో అందరిలో నమ్మకం, విశ్వాసం పెంచే విధంగా అన్ని సేవలు ఈ సఖీ కేంద్రంలో ఉంటాయని,  జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో ఈ కేంద్రం రావడం పట్ల సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. 33 జిల్లాల్లో సఖీ కేంద్రాల భవనాలకు స్థలాలు, నిధులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె తెలిపారు. హైదరాబాద్ సఖీ కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేస్తున్నామని, రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అప్పటికప్పుడు సొంత భవనాలు లేక, అద్దె భవనాల్లో సఖీ కేంద్రాలు నిర్వహిస్తున్నామని సత్యవతి తెలిపారు. అక్కడ కూడా త్వరలోనే సొంత భవనాలు నిర్మించి, అందులోకి తరలిస్తామని ఆమె చెప్పారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం పోలీసుల ఆధ్వర్యంలో భరోసా కేంద్రం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, కలెక్టర్ ఆధ్వర్యంలో సఖీ కేంద్రం నడుస్తున్నాయని, మహిళల పట్ల నేరాలు తగ్గించే విధంగా, వారికి న్యాయ పర సేవలు సకాలంలో ఇచ్చే విధంగా ఈ సఖీ కేంద్రాలు పని చేస్తాయని ఆమె స్పష్టం చేశారు.