Home తాజా వార్తలు టెన్త్ పరీక్షలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష

టెన్త్ పరీక్షలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష

Satyavathi Rathod

 

హైదరాబాద్ : కోవిడ్ 19 నేపథ్యంలో వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలు జూన్ 8వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ, కరోనా వైరస్ కట్టడి చర్యలపై శనివారం సంక్షేమ భవన్‌లో ఎస్‌సి,ఎస్‌టి గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన టెన్త్ పరీక్షలను తిరిగి నిర్వహించనున్న సందర్భంగా రివైస్డ్ సిలబస్ మేరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు మంత్రికి తెలిపారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలోని విద్యాలయాల్లో 2,949 మంది విద్యార్థులు ఉన్నారని, అన్ని జిల్లాల్లో వీరికోసం 38 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. జూన్ 8వ తేదీ నుంచి పరీక్షలు ఉన్నందున వారం రోజుల ముందే వసతి గృహాలకు విద్యార్థులు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

వసతి గృహానికి వచ్చే ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేసి, వారం రోజుల పాటు వారిని పరిశీలించాలని తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాన్ని విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు విధిగా రెండు మాస్క్ లు, ఒక సానిటైజర్ అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులు చదువుకునే సమయంలో కూడా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వచ్చే విద్యార్థులకు సహకరించేందుకు సంబంధిత సబ్జెక్ట్ టీచర్లు జూన్ 1వ తేదీ నుంచి విధులకు హాజరు కావాలని తెలిపారు.

పరీక్ష రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహానాల్లో టీచర్లు, అధికారులు దగ్గరుండి విద్యార్థులను వసతి గృహాల నుంచి పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలని మంత్రి తెలిపారు. మాస్క్ లేకుండా విద్యార్థులు, సిబ్బందిని పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని, దీనికోసం అందరూ ముందస్తుగా మాస్క్‌లు పెట్టుకోవాలన్నారు. పరీక్షల కోసం వచ్చి, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి ఎలాంటి తావు ఇవ్వకూడదని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు.

వసతి గృహాల్లో, పరీక్షా కేంద్రాల్లోనూ సానిటైజర్, మాస్క్ లేకుండా ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని ఆదేశించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం స్థానిక హెల్త్ సెంటర్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ కేంద్ర కార్యాలయం నుంచి పనిచేస్తున్న పినాకి హెల్త్ కమాండ్ సెంటర్ సేవలను సిబ్బంది, అధికారులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.

Minister Satyavathi Rathod Review