మేడారం : మేడారంలో కొలువైన సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లకు గిరిజన , శిశు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ఉదయం బతుకమ్మ తొలి చీరను ప్రదానం చేశారు. రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీని ఆమె మేడారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. మంత్రిగా తన తొలి పర్యటన గిరిజన ప్రాంతమైన మేడారం నుంచి ప్రారంభం కావడం సంతోషాన్ని ఇస్తుందని ఆమె తెలిపారు. గిరిజన మహిళను అయిన తనకు కెసిఆర్ మంత్రి పదవి ఇచ్చి , మరిన్ని బాధ్యతలను తనమీద పెట్టారని, తనకు మంత్రి పదవి ఇచ్చిన కెసిఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు. కెసిఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సమ్మక్క – సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.