Home తాజా వార్తలు రామప్పకు త్వరలోనే యునెస్కో గుర్తింపు

రామప్పకు త్వరలోనే యునెస్కో గుర్తింపు

Minister srinivas goud said unesco recognition for ramappa temple soon

 

రామప్ప ప్రాంత పరిరక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నిర్వహణ కమిటీ,
స్థానిక స్థాయిలో పాలంపేట్ ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్: రామప్పకు త్వరలోనే యునెస్కో గుర్తింపు లభించనుందని, ఇది చివరి దశకు చేరిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రామప్ప ప్రాంత పరిరక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నిర్వహణ కమిటీని అదేవిధంగా స్థానిక స్థాయిలో పాలంపేట్ ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం నగరంలోని రవీంద్ర భారతీలోని మంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చర్యల వల్లే యునెస్కో గుర్తింపు దక్కనుందన్నారు.

యునెస్కో గుర్తింపు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రామప్ప సమీపంలోని రెండు ఆలయాలను కూడా రామప్ప ఆస్తి పరిధిలోకి తీసుకురానున్నట్టు మంత్రి వెల్లడించారు. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, జలపాతాలు క్రీస్తుపూర్వం నుంచి తెలంగాణలో ఉన్నాయన్నారు. రామప్ప పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని యునెస్కో కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసిందని తెలిపారు. యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 3 కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈనెల 25న జరిగే సమావేశంలో ప్రపంచ వారసత్వ కమిటీ సభ్యుల సమ్మతి పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

రెండు ఆలయాలు రామప్ప దేవాలయాల ఆస్తి పరిధిలోకి…
ఐసిఒఎంఒఎస్ (అంతర్జాతీయ చారిత్రక కట్టడాలు, ప్రదేశాల మండలి) రామప్పకు వారసత్వ హోదాను మూల్యాంకనం చేసి కొన్ని సూచనలను చేసిందని ఆయన తెలిపారు. రామప్ప దేవాలయానికి కొద్ది దూరంలో ఉన్న రెండు చిన్న దేవాలయాలను కూడా రామప్ప దేవాలయ ఆస్తి పరిధిలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టరు ఆ రెండు చిన్న దేవాలయాలు ఉన్న భూమిని రామప్ప దేవాలయానికి అందజేస్తూ అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేశారని, దీనివల్ల భారతీయ పురావస్తు సర్వేక్షణ సంస్థ రామప్ప దేవాలయ సరిహద్దులను ఐసిఒఎంఎస్ సూచనలకు అనుగుణంగా మార్పులు చేసినట్టు తెలిపారు.

చారిత్రక కట్టడాలను, దేవాయాలను అభివృద్ధి చేస్తాం
రామప్ప దేవాలయానికి సమీపంలోని రెండు ఆలయాలను రామప్ప దేవాలయ ఆస్తి పరిధిలోకి తెచ్చేలా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆ ప్రాంత పరిరక్షణకు ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటుచేశామన్నారు. త్వరలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదే కోవలో మరిన్ని పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను, దేవాయాలను అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో వేగవంతమైన నిర్ణయాలను సత్వర చర్యలను చేట్టిందని ఆయన తెలిపారు. రామప్ప ప్రాంత పరిరక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నిర్వహణ కమిటీతో పాటు స్థానిక స్థాయిలో పాలంపేట ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు.

వివిధ శాఖలతో సమన్వయ కమిటీ
పర్యాటక అభివృద్ధి వంటి వాటిని సక్రమంగా అమలు చేయడం కోసం రాష్ట్రస్థాయిలో వివిధ శాఖలతో సమన్వయ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో కేంద్ర పురావస్తు శాఖ, దేవాదాయశాఖ నగర ప్రణాళిక, నీటి పారుదల శాఖల అధికారులు సభ్యులుగా ఉండగా కమిటీకి అధ్యక్షుడిగా ప్రభుత్వ పర్యాటక కార్యదర్శి వ్యవహారిస్తారు.

పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు
రామప్ప దేవాలయ పరిసరాల్లోని రామప్ప చెరువు, కొండలు, అటవీ భూముల ప్రశాంతతను, సౌందర్యాన్ని, పవిత్రతను కాపాడటం కోసం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, నగర అభివృద్ధి శాఖ పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థను (పిఎస్‌డిఎ) ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా కలెక్టరు సారథ్యంలో నిర్వహించే ఈసంస్థలో పర్యాటకం, నగర ప్రణాళిక, దేవాదాయ దేవాలయాలు, వ్యవసాయం, అటవీ శాఖ, నీటి పారుదల శాఖ, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఈ పరిసరాలలోని భూములను నివాస, వాణిజ్య, వ్యవసాయ, అటవీ, నీటి పారుదల ప్రాంతాలుగా విభజించి ఈ ప్రాంత క్రమబద్ద వికాసానికి కృషి చేస్తుంది.

Minister srinivas goud said unesco recognition for ramappa temple soon