Wednesday, April 24, 2024

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani Review on Govt Schools development

ప్రభుత్వ విద్య బలోపేతం చేయటం సీఎం కేసీఆర్ లక్షం
అన్‌లైన్ తరగతుల పేరుతో విద్యార్దులను వేధిస్తే చర్యలు తప్పవు
పాఠశాల అభివృద్ది,మౌలిక వసతుల అంశాల సమీక్షలో మంత్రి తలసాని
హైదరాబాద్: నగరంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు చేపట్టవలసిన తక్షణ చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో జిల్లాలోని ప్రభుత్వం పాఠశాలల అభివృద్ది, మౌలిక వసతులు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 745 ప్రభుత్వ, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయని..వాటిలో అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించడం ద్వారా పాఠశాలలు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలలో మెరుగైన విద్యను అందించాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే సన్న బియ్యంతో విద్యార్దులకు మధ్యాహ్నం బోజనం, వారంలో మూడు రోజులు గ్రుడ్లు, ఉచితంగా పుస్తకాలు, దుస్తుల అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అందించాలనేది ప్రభుత్వ ఆశయమని, పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి త్వరలోనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మీ పరిధిలోని పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, పర్నిచర్, క్రీడాసామాగ్రి, ప్రహారీగోడలు, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం వంటి ఇతర సమస్యలను గుర్తించి నివేదికలను రూపొందించాలని డిప్యూటీ డిఈఓలను ఆదేశించారు. నివేదికలు రూపొందించి సమర్పిస్తే ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. 10 నుండి 20మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలు గుర్తించి వారిని సమీపంలోని పాఠశాలలు సర్దుబాటు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు అధికంగా ఉన్న పాఠశాలల నుండి అవసరమైన పాఠశాలలకు మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యార్థులతోపాటు పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతిని ఉపాధ్యాయులకు కల్పించాలని డిఈవోను ఆదేశించారు. అన్‌లైన్ క్లాస్‌ల పేరుతో విద్యార్దుల తల్లిదండ్రులను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం వేదిస్తున్నాయని, అలాంటి వారిని ఉపేక్షించవద్దన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తే కఠినచర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇకనైనా వారి వైఖరి మార్చుకోవాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో వాచ్‌మెన్‌ను నియమించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సర్వశిక్ష అభియాన్ కింద వివిధ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన పనుల ప్రగతిపై ఐదుగురు డిప్యూటీ డిఈవో స్దాయి అధికారులతో కమిటీ వేసి 10 రోజుల్లో పనులు తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని డిఈవోను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎడ్యుకేషన్ వెల్పేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈఈ రవీందర్, మధ్యాహ్న భోజనమన్నా ట్రస్ట్ సీఈవో శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Minister Talasani Review on Govt Schools development

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News