Home తాజా వార్తలు ఆ వార్తలు అవాస్తవం : తలసాని

ఆ వార్తలు అవాస్తవం : తలసాని

TALASANI

హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమ రెండుగా చీలిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. డ్రగ్స్ కేసుతో సినిమా పరిశ్రమకు మొత్తానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సిట్ విచారణ సక్రమంగా సాగుతుందని చెప్పారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు జరుగుతున్నందున ప్రస్తుతం దాని గురించి మాట్లాడడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యాకే సినీ పరిశ్రమ పెద్దలతో మాట్లాడుతామని ఆయన వెల్లడించారు.

సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎపికి తరలిపోతుందన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సినిమా పరిశ్రమకు ఇక్కడ అన్ని వసతులు కల్పించామన్నారు. ప్రభుత్వం తరపున సహాయసహకారాలు అందిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ కేసుకు, హైదరాబాద్ ఇమేజ్‌కు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మారుస్తామన్నారు. డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసిన తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ రెండుగా చీలిందన్న ఊహాగానాలు చెలరేగిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన వారు బడా నిర్మాతలు, హీరోల పేర్లు చెప్పినట్టు ప్రచారం జరగడంతో చిత్ర పరిశ్రమ కుదుపుకు లోనైంది. ఈ క్రమంలో అరెస్టులు జరిగితే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎపికి తరలిపోతుందన్న వదంతులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి తలసాని పైవిధంగా వ్యాఖ్యానించారు.

Minister Talasani Srinivas yadav Comments on Drugs Case