Home తాజా వార్తలు అక్కడ మోడీ అయితే… ఇక్కడ కల్వకుంట్లనే

అక్కడ మోడీ అయితే… ఇక్కడ కల్వకుంట్లనే

minister-talasani

 తెలంగాణలో టిఆర్‌ఎస్ ఎంఐఎం దోస్తీని బూచిగా చూపిస్తోన్న బిజెపి
లక్ష్మణ్ విమర్శకు తలసాని కౌంటర్

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్, ఎంఐఎం దోస్తీని బూచిగా చూపించి బిజెపి ప్రజలను రెచ్చగొడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఎంఐ ఎం పార్టీతో కలిసిపోతున్నారంటూ టిఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడమెందుకు..? మజ్లిస్‌తో బిజెపి పార్టీని నేరుగా పోరాడితే ఎవరు వద్దన్నారు..?, మధ్యలో టిఆర్‌ఎస్‌ను ఎందుకు లాగుతున్నారని..? ప్రశ్నించారు. పుల్వామా ఘటన జరిగినప్పుడు ఎంఐఎం నేతలు మోదీకి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 119 స్థానాల్లో పోటీచేస్తే 113 స్థా నాల్లో డిపాజిట్లు కూడా రాలేదనివిమర్శించారు. మంగళవారం టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కల్వకుంట్ల వారి ప్రభుత్వం నడుస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సోమవారం చేసిన విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం అని అంటున్నారు కదా, అలాగే తెలంగాణలో కూడా కల్వకుంట్ల వారి ప్రభుత్వమే నడుస్తోందని అన్నారు. అయినా… ఆ సందేహం లక్ష్మణ్‌కు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అప్పులు చేశారు అంటున్నారు…గత ప్రభుత్వాలు అప్పులు చేయలేదా…? కేంద్ర ప్రభుత్వానికి అప్పులు లేవా..? అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ది కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తుందని, అప్పులు తీర్చగలిగే స్థోమత రాష్ట ప్రభుత్వానికి ఉందని తెలిపారు. పొద్దున లేచింది మొదలు కెసిఆర్ కుటుంబం మీద పడి ఏడవడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు.
కెసిఆర్ కుటుంబసభ్యులెవరూ నామినేటెడ్ కోటా పదవులు తెచ్చుకోలేదని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచారని చెప్పారు. కుటుంబ పార్టీల గురించి మాట్లాడాల్సి వస్తే, అందరి గురించి మాట్లాడాలని అన్నారు. 370 ఆర్టికల్ రద్దును రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడవద్దని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన పార్టీ టిఆర్‌ఎస్ అని, తమ ప్రభుత్వం ఎన్నికలకు భయపడదని అన్నారు. గడువులోగానే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇటీవల టిఆర్‌ఎస్‌లో చేరిన ఓ పెద్ద మనిషి టిఆర్‌ఎస్ మీద ఏదేదో మాట్లాడుతున్నారని, ఆయన టిఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు పార్టీ ఆయనను ఎంతగానో గౌరవించిందని మాజీ ఎంపి వివేక్‌ను ఉద్దేశించి అన్నారు. ఆయన తండ్రి గౌరవార్ధం హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎక్కువ ఎంపి సీట్లు మేమే గెలిచాం
నాలుగు ఎంపి సీట్లు గెలిచినంత మాత్రాన బిజెపి నేతలు ఎగిరెగిరి పడుతున్నారని, ఎక్కువ ఎంపి సీట్లు గెలిచింది తామేనని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బ్యాలెట్ పద్దతిలో జరిగిన జెడ్‌పి ఎన్నికల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా తమ పార్టీ గెలిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర బిజెపి నేతలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టులు, నిధులు తీసుకొస్తే ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు కదా అని తలసాని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్దంగా బిజెపి బలపడతామంటే ఎవరూ కాదనరని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అన్ని మతాలకు సంబంధించిన పండుగలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. హిందువుల గురించి గొప్పగా మాట్లాడే మీరు ఒక్క గుడి అయినా కట్టారా..? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా యాదాద్రిని అద్భుతంగా నిర్మిస్తుందని చెప్పారు. ప్రజలు క్షేమంగా ఉండాలని యాగాలు, హోమాలు చేస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలిచింది
2014లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సరిపడా నీళ్లు, కరెంట్, కాళేశ్వరం, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమా పథకాలతో తెలంగాణ కొత్త ఒరవడితో ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. దేశంలో తెలంగాణలో మాత్రమే వసతి గృహాల్లో సన్నబియ్యం పెడుతున్నారని, పేద విద్యార్థులకు రూ.20లక్షల ఉపకార వేతనంతో విదేశాలలో విద్యను అందిస్తున్నామని తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం నడుస్తోంది కాబట్టే ఇన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నామని పేర్కొన్నారు.

Minister Talasani Srinivas Yadav Counter To Bjp Leader Laxman