Home తాజా వార్తలు దేశానికే మైనార్టీ గురుకులాలు ఆదర్శం…

దేశానికే మైనార్టీ గురుకులాలు ఆదర్శం…

Minority Gurukulas

 

శాంతి నెలకొన్న చోటే అభివృద్ధి వేగవంతం
రంజాన్ ఉపవాస దీక్షలతో సంపూర్ణ ఆరోగ్యం
పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించినప్పుడే అసలైన అభివృద్ధి
సమాజంలో మార్పు మనందరి బాధ్యత
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట : నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే లక్షంగా సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. మైనార్టీ గురుకులాల్లో నమాజ్‌తో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను అందిస్తున్నామన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారన్నారు.

సీఎం కేసీఆర్ చూపిన బాటలోనే కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందకు సాగుతూ మంచి సాంప్రదాయాలను సిద్దిపేటలో కొనసాగిస్తున్నారన్నారు. ఒకరి పండుగలను మరోకరు సంతోషంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. గత 16 సంవత్సరాలుగా రంజాన్ వేడుకలను తాను ముస్లిం సోదరులతో కలిసి స్థానిక ఈద్గా మైదానం వద్ద జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.

శాంతి భద్రతలు అదుపులో ఉన్నచోటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. కొంతమంది కావాలనే స్వార్థ రాజకీయాల కోసం కులమతాల మధ్య చిచ్చు పెడుతుంటారని అలాంటి కలుపు మొక్కలను సమిష్టిగా ఏరివేద్దామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం కావడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడ్డాయని దీంతో ప్రజా రద్దీ ఎక్కువగా పెరిగిపోతుందన్నారు. అలాగే మల్లన్న సాగర్ నిర్వాసితులతో పాటు ఇతర ప్రాంతాల వారు సిద్దిపేటలో స్థిరపడాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారన్నారు. ప్రజా అవసరాల దృష్టా పూర్తి స్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయడమే లక్షంగా ముందుకు సాగుతున్నామన్నారు. నూతనంగా ఇండ్లు నిర్మించుకునే వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలన్నారు. భవిష్యత్తు సిద్దిపేటను దృష్టిలో పెట్టుకొని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా జీవించినప్పుడు అసలైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు తప్ప, మిగతా ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవలందించడమే లక్షమన్నారు. రానున్న రోజుల్లో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలన్నారు. ప్లాస్టిక్ వాడకంతో పాటు రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యంతో క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయన్నారు. సమాజంలో మంచి మార్పు కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. సిద్దిపేట ప్రజలకు నిరంతరం సేవలందించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

అల్లా దయతో త్వరలోనే సిద్దిపేటలో పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సిద్దిపేటను దశలవారీగా అభివృద్ధిపరుస్తామన్నారు. ఇప్పటికే సిద్దిపేట అనేక రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని ఇదే స్ఫూర్తిలో ఇక ముందు కొనసాగిస్తామన్నారు. ప్రజల సహకారంతో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి నిరంతరం సిద్దిపేట అభివృద్ధియే లక్షంగా ముందుకు సాగుతున్నానన్నారు.

దసరా పండుగ రోజు ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఆధ్వర్యంలో స్థానిక నర్సాపూర్ చౌరస్తాలో హిందూ సోదరులకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ ఫారూఖ్ హుస్సేన్, ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, నాయకులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్‌రెడ్డి, అత్తర్ పటేల్, గౌస్ మొయినోద్దీన్, వజీరుద్దీన్, అబ్దుల్ వహీద్, ఫక్రోద్దీన్, అబ్దుల్ మొయిజ్, బాబు జానీ, సాకి ఆనంద్, ధర్మవరం బ్రహ్మం, ముజీబ్ , తదితరులు ఉన్నారు.

Minority Gurukulas are Role model to Country