Saturday, March 25, 2023

మిషన్‌భగీరథ పనుల్లో మరో అపశృతి

- Advertisement -

bhagiratha
* విద్యుద్ఘాతంతో యువకుడు మృతి
* మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని సిపిఐ ఆందోళన
* దిగొచ్చిన గుత్తేదారు
* రూ. 6 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ఒప్పందం

మన తెలంగాణ/పాల్వంచ ః మిషన్‌భగీరథ పనుల్లో మరో అపశృతి చోటుచేసుకుంది. పైప్‌లైన్ నిర్మాణంలో భాగంగా కరెంట్‌షాక్ తగిలి ఓ యువకుడు మృతిచెందాడు. సంఘటన పట్టణ పరిధి దమ్మపేట రోడ్‌లోని శివనగర్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలాఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన సుమారు 70 మంది కూలీలు మిషన్ భగీరథ పనులు చేసేందుకు వచ్చారు. వీరిలో గత 6 నెలల క్రితం కుషీనగర్ జిల్లా గోరఖ్‌పూర్ మండలం జంగల్‌బిషన్‌పురరామ్‌థన్ గ్రామానికి చెందిన రామధార్ చౌరాసియా, ఉర్మిలాదేవిల పెద్ద కుమారుడు చోట చౌరాసియా (24) వెల్డింగ్ హెల్పర్‌గా పనిచేసేందుకు వచ్చాడు. శనివారం లారీ నుండి క్రేన్ సహాయంతో పైపులు దిగుమతి చేస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ 11 కెవి విద్యుత్‌లైన్‌కు తగిలింది. దింపుతున్న పైప్‌ను పట్టుకుని ఉన్న చోట కు విద్యుత్ సరఫరా అయ్యి అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. మృతుడికి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్లున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సిపిఐ, సిపియం ఆందోళన…
కరెంట్‌షాక్‌తో మరణించిన చోటా చౌరాసియా మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సిపిఐ, సిపియం నాయకులు సందర్శించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తోటి కార్మికులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి యస్‌కె సాబీర్‌పాషా, సిపియం రాష్ట్ర కమిటీసభ్యులు కాసాని ఐలయ్యలు మాట్లాడుతూ… మిషన్ భగీరథ పనుల్లో రక్షణ చర్యలు కరువయ్యాయన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఎంతోమంది ప్రాణాలు బలికొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకుండా పనులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు సైతం గుత్తేదారుకు కొమ్ముకాస్తుండటంతో కార్మికుల ప్రాణాలకు విలువలేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులతో కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూలీలను పిలిపించి పనిచేయిస్తూ ప్రమాదాలు జరిగినప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఎంతోకొంత ఎక్స్‌గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. మృతుని కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
దిగొచ్చిన గుత్తేదారు…
మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టడంతో గుత్తేదారు దిగొచ్చారు. సిపిఐ, సిపియం నాయకులు గుత్తేదారు మధ్యన జరిగిన చర్చల్లో మృతుని కుటుంబానికి రూ. 6 లక్షల నష్టపరిహారంతో పాటు భీమా బెన్‌ఫిట్స్ ఇప్పించేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు ముత్యాల విశ్వనాధం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, నాయకులు శ్రీరాములు, అస్లాం, బండి వెంకటేశ్వర్లు, సిపియం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సిఐటియు జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి దొడ్డారవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News