Home ఎడిటోరియల్ సోషల్ మీడియా దుర్వినియోగం

సోషల్ మీడియా దుర్వినియోగం

social-media

‘నిప్పుతోడ చెలగాటమాడితే
ముప్పులు తిప్పలు తప్పవురా
పల్లెరుగాయాలు చల్లిన చోటుల
మల్లెలు జాజులు పూయవురా’అని గజ్జెల మల్లా రెడ్డి హెచ్చరించారు.మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకు ముందు కూడా సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించుకున్నారు. ఈ మాధ్యమాలలో ఎవరైనా తమ అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. ఇది నిస్సందేహంగా సాంకేతిక పరిజ్ఞానం సాధించిపెట్టిన సదుపాయమే. అయితే ఏ సదుపాయాన్ని అయినా దుర్వినియోగం చేయడానికి వీలుంటుంది. వాట్స్ ఆప్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలవల్ల ఎంత ఉపయోగం ఉందో వాటిని ఇతరులను వెంటాడడానికి కూడా అంతగానే దుర్వినియోగం చేస్తున్నారు. పాముకు పాలుపోసి పెంచితే అది సాధుజీవిగా మారదు. భింద్రన్వాలే, శ్రీలంక తమిళ తీవ్రవాద సంస్థ ఎల్.టి.టి.ఇ.ని ఒకప్పుడు మన ప్రభుత్వాధినేతలే పరోక్షంగానైనా పెంచి పోషించారు. ఆ రెండు సంస్థలు సృష్టించిన విధ్వంసం ఎంత భయంకరమైం దో మనకు తెలుసు. కాని ఆ చేదు అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకునే సద్బుద్ధి కొరవడింది. సామాజిక మాధ్యమాలను సంఘ్ పరివార్ విచ్చలవిడిగా వినియోగించుకున్నందువల్ల ఇప్పుడు దుష్ఫలితాలను అనుభవించవలసివస్తోంది. తమకు కిట్టని వారి మీద దుష్ప్రచారానికి ఈ మాధ్యమాలను ఉపయోగించుకున్నంత కాలం బాగానేఉంది. కాని అదే మాధ్యమాన్ని తమవారినే వెంటాడడానికి వినియోగించడంవల్ల ఇంతకాలం పెంచిపోషించిన విషసర్పం బుసలు కొట్టడంవల్ల ‘విపరీతమైన బాధ’ కలుగుతోంది. దుర్వినియోగం అవుతున్న సామాజిక మాధ్యమం విషసర్పం స్థాయికి చేరుకుంది. విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుషమా స్వరాజ్ బిజెపియే పెంచి పోషించిన డాకినిలాంటి సామాజిక మాధ్య మం కాటుకు బలయ్యారు. ఉదారవాదులను, సెక్యులర్ భావాలుగల వారిని, ప్రస్తుత ప్రభుత్వాన్ని దుయ్యబట్టే పత్రికా రచయితలను సామాజిక మాధ్యమాలలో వెంటాడినంతకాలం (దీన్నే ట్రోల్ అంటున్నారు) సంఘ్ పరివార్ వారికి నొప్పి తెలియలేదు. సామాజిక మాధ్యమాలలో ఇలా వెంటాడే వారినుంచి ఇబ్బందులు పడ్డవారు చాలా మందే ఉన్నా రు.కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వే ది, పత్రికా రచయితలు రవీశ్ కుమార్, రాణా అయూబ్‌లాంటివారు ఈ జాబితాలోని ప్రముఖులు. వీరి మీద సామాజిక మాధ్యమాలలో దాడి జరిగినప్పుడు అది ప్రత్యర్థుల మీద దాడి లెమ్మని కిమ్మనకపోయినా ఫరవాలేదనుకున్నారు.విచిత్రం ఏమిటంటే సంఘ్ పరివార్ కూలిచ్చి నియమించిన ఈ సామాజిక మాధ్యమ వేంటాడే సేన సాక్షాత్తు సుషమా స్వరాజ్ మీద అభ్యంతరకరమే కాక, అసభ్య, అశ్లీల పదజాలంతో దాడి చేసినా ఒక్క బిజెపి నాయకుడైనా స్పందించలేదు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రమే దీనికి మినహాయింపు. నితిన్ గడ్కరి లాంటివారు ‘దురదృష్టకరం’ అన్న ఒక్క పడికట్టు మాటతో సరిపెట్టుకున్నారు.
సుషమా స్వరాజ్ పేరుకే విదేశాంగ మంత్రి. విదేశీ వ్యవహారాలను ప్రధానమంత్రి మోదీయే నిర్వహిస్తున్నారు. సుషమా స్వరాజ్ విదేశీ ప్రయాణాలకన్నా మోదీ విదేశీయానాలే ఎక్కువ. ఆమె ఎంత సేపూ విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావడంలాంటి చిల్లర వ్యవహారాలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. మోదీ రాజకీయ తెరమీద కనిపించని రోజుల్లో కూడా ఆమె ప్రతిష్ఠ ఉన్నవారు కనక ఆమెను జనం ఇంకా మరిచిపోలేదు. లేకపోతే ఆమె కేవలం నిగమశర్మ అక్కలాగా అనామకంగానే మిగిలిపోయేవారు. విచిత్రం ఏంటంటే ఆమె మీద సామాజిక మాధ్యమాల్లో దాడి జరిగితే పట్టించుకున్నవారే లేదు. జూన్ 23వ తేదీన అంతర్జాతీయ సామాజిక మాధ్యమ దినోత్సవం నాడు మోదీ ఈ మాధ్యమం ఘనత గురించి మరిచిపోకుండా గుర్తు చేశారు. కాని సుషమా స్వరాజ్ మీద దాడిని మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. అంటే ఆమె మీద మోదీకి ఉన్న అభిప్రాయం ఏమిటో స్పష్టం అవుతూనే ఉంది.
ఇంతకీ సుషమా స్వరాజ్ మీద సామాజిక మాధ్యమంలో వెంటాడే వీరులు ఆగ్రహించడానికి కారణం లేకపోలేదు. మతాంతర వివాహం చేసుకున్న ఓ జంట పాస్ పోర్టు కోసం వెళ్తే లక్నోలోని పాస్ పోర్టు సేవా కేంద్రంలోని వికాస్ మిశ్రా అనే అధికారి ఆ జంటను వేధించారు. పాస్ పోర్టు కోసం ప్రయత్నించిన జంటలో పురుషుడు ముస్లిం, మహిళ హిందువు. ఆ పురుషుడిని హిందూమతం స్వీకరించాలని పాస్ పోర్టు అధికారి వికాస్ మిశ్రా కోరారు. ముస్లింను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ఆ అమ్మాయిని గదమాయించారు. వారు ట్విట్టర్‌లో మొర పెట్టుకుంటే సుషమా స్వరాజ్ ఆదుకున్నారు. సదరు మిశ్రాను లఖ్నో నుంచి గోరఖ్ పూర్‌కు బదిలీ కూడా చేశారు. సామాజిక మాధ్యమాలలో కూలి తీసుకుని జనాన్ని వేధించడానికి అలవాటుపడ్డ సైన్యం సుషమా స్వరాజ్‌నే వెంటాడడం ప్రారంభించింది. ఈ వెంటాడే సైన్యానికి ఓ ముస్లింను సుషమా స్వరాజ్ ఆదుకోవడం బొత్తిగా నచ్చలేదు. సుషమా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్, ప్రసిద్ధ న్యాయవాది స్వరాజ్ కౌశల్‌కు మాంచి సలహా కూడా ఇచ్చారు. ముస్లింను వెనకేసుకొచ్చినందుకు సుషమా స్వరాజ్‌ను కొట్టాలని, ఆమెకు గుణపాఠం నేర్పాలని కోరారు. ఈ తతంగం వారం పది రోజులు కొనసాగింది. ఈ వెంటాడడం కొనసాగుతున్నప్పుడు సుషమా స్వరాజ్ విదేశాల్లో ఉన్నారు. ఈ సందేశాలన్నీ చూసిన సుషమ ట్విట్టర్‌లో ఒక రోజు ఓ సర్వే నిర్వహించి ఇది సబబో బేసబబో తేల్చుకోవాలనుకున్నారు. ఈ సర్వేలో లక్ష మందికిపైగా పాల్గొన్నారు. ఇందులో 57 శాతం మంది సుషమను వెంటాడడం బేసబబు అంటే ఆశ్చర్యకరంగా 43 శాతం మంది సబబే అన్నారు. పనిగట్టుకుని వాతావరణాన్ని కలుషితం చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో సబబు అన్నవారి సంఖ్యను చూస్తే అర్థం అవుతోంది.
ప్రాణాలు తీస్తున్న సందేశాలు
నిజానికి సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడిగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా పనిగట్టుకుని అసత్యాలు, వదంతులు వ్యాపింప చేస్తున్నందువల్ల అనేక మంది ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. గత సంవత్సరం మే నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు సంవత్సర కాలంలో వాట్స్ ఆప్ ద్వారా వ్యాపింప చేసిన వదంతి కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. పిల్లలను ఎత్తుకుపోతున్నారు అన్న వదంతి దేశమంతా విస్తరిస్తోంది. ఈ వదంతిని నమ్మిన వారు అనుమానితులను కొట్టి చంపుతున్నారు. మూకోన్మాదం హత్యలకు దారి తీస్తోంది. అయితే ఈ వదంతులలో రాజకీయ, మత, కుల కోణం లేకపోవడం కొంత మేలు. ఇందులో పాకిస్తాన్ -భారత్, బిజెపి -కాంగ్రెస్, జిహాద్, నక్సలిజం, ఆర్.ఎస్.ఎస్., కశ్మీర్ లాంటివి కానీ రాజకీయ నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణలు కానీ లేకపోవడం గమనించదగ్గ విషయం. పిల్లలను ఎత్తుకుపోయే ముఠా సంచరిస్తోంది అన్న వదంతిని వాట్స్ ఆప్‌లో వ్యాపింప చేయడం వల్ల ఉన్మాదం ఆవహించిన మూకలు కేవలం అనుమానం మీద జనాన్ని కొట్టి చంపుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా వాట్స్ ఆప్ ద్వారా పిల్లలను ఎత్తుకుపోతున్నారన్న వదంతి తమిళనాడు, కర్నాటక, అస్సాం, మహారాష్ట్ర, బెంగాల్, గుజరాత్, త్రిపుర రాష్ట్రాలలో దావానలంలా వ్యాపించింది. అనుమాని తులను చితకబాది చంపేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఈ వాట్స్ ఆప్ వదంతులకు ఇప్పటికే ఆరుగురు బలయ్యారు. నిజామాబాద్, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వాట్స్ ఆప్ వదంతులు రాజ్యమేలాయి. వదంతులను నమ్మి స్థానిక భాష మాట్లాడని బిచ్చగాళ్లను, వలస కార్మికుల మీద విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. ఈ వదంతులను ఎక్కడికక్కడ స్థానిక భాషల్లోకి అనువదించి ప్రచారంలో పెడ్తున్నారు. అంటే వదంతులు వ్యాపింపచేయడమే పనిగా పెట్టుకున్నారని అర్థం అవుతోంది. దీని వల్ల అసలు ఆ వదంతికి మూలం ఏమిటో కనిపెట్టడం అసాధ్యం అవుతోంది. దేశంలో కనీసం 20 కోట్ల మంది సామాజిక మాధ్యమాలు వాడుతున్నారు. అలాంటప్పుడు వదంతుల ప్రభావం ఎంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు. సుషమా స్వరాజ్ తనను సామాజిక మాధ్యమాలలో వెంటాడుతున్న వారికి వ్యతిరేకంగా గొంతెత్తారు. కానీ ఆ గొంతు పీలగా ఉంది. సుషమా స్వరాజ్ రాజకీయాలు ఏమైనప్పటికీ ఆమె మర్యాదస్థురాలు అన్నది వాస్తవం. ట్విట్టర్‌లో ఆమె స్పందన చాలా బలహీనంగా ఉంది. తనదాకా వస్తే కాని ఆమెకు ఆ బాధేమిటో అర్థం కాలేదు. వెంటాడే వారిమీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని ఆమె ఇంతవరకు కోరిన దాఖలాలు లేవు. బిజెపిని విమర్శించే వారిని ఇలా వెంటాడినంతకాలం ఆమెతో పాటు ఎవరూ పెదవి మెదపలేరు. అసహనం కూడా ఒక రకమైన హింసే. అసహనాన్ని పెంచి పోషిస్తున్న వారిని సమర్థించే వారే ఇతరుల అసహనానికి గురైతే ఆదుకునే వారు ఎవరూ ఉండరు. మనకు ఏది జరగకూడదనుకుంటామో అది ఇతరుల విషయంలో కూడా మనం పాటించాలి. ఇలాంటి గాంధీ బోధనలు చెవిన పెట్టే స్థితి అంతరించడమే విషాదం.

*  ఆర్. భరద్వాజ