Home ఖమ్మం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రెండు జడ్పీ పీఠాలు మావే

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రెండు జడ్పీ పీఠాలు మావే

MLA Ajay Kumarఖమ్మం : ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అఖండ విజయం సాధించడం ఖాయమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రెండు జడ్పీ పీఠాలతో పాటు ఖమ్మం జిల్లాలోని 20 ఎంపీపీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 21 ఎంపీపీలతో పాటు మెజార్టీ ఎంపీటీసీ స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్ధులే విజయం సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. గురువారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వీడీవోస్ కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2012లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమై ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఖమ్మం నియోజకవర్గ ప్రజలు 2014లోను, 2018లోను కల్పించారని ఆయన స్పష్టం చేశారు. రెండుసార్లు శాసనసభ్యునిగా తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల రుణాన్ని తాను జీవితాంతం మర్చిపోనన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పని ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రజలతో మమేకమై తొలిసారి ప్రజా ప్రతినిధిగా ప్రజా మన్ననలు పొందానన్నారు. రెండోదఫా కూడా తనను ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్న తర్వాత వరుస ఎన్నికల హడావిడితో పాటు మానసిక ప్రశాంతత కోసం కుటుంబ సభ్యులతో ఈ నెల 17 నుంచి 27 వరకు విదేశాలకు వెళ్తున్నానని చెప్పారు. అయినప్పటికీ వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ తన శాయశక్తుల ప్రజా సేవకు సమయం వినియోగిస్తానని చెప్పారు. తాను అందుబాటులో లేనప్పటికీ క్యాంపు కార్యాలయంలో తన సిబ్బందితో పాటు పార్టీ బాధ్యులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని చెప్పారు. జూన్ 2 నుంచి పాలనపై దృష్టి సారించి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో సమగ్రాభివృద్ధికి తాను శక్తిమేర పనిచేస్తానన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సుమారుగా 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అంది సస్యశ్యామలం కానుందని చెప్పారు. ఖమ్మం అర్బన్‌లో 14 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానం టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రఘునాథపాలెం ప్రజలు టిఆర్‌ఎస్ వైపు ఏకపక్షంగా నిలబడ్డారన్నారు. నియోజకవర్గ ప్రజలంతా కుటుంబ సభ్యునిగా ఆదరించి తనకు తోడ్పాటు అందించారని, వారి మేలును ఎప్పటికి మర్చిపోనని చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవకై అంకితమవుతానన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడి పనిచేశారని, వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ప్రవేశం అనంతరం తొలిసారిగా పది రోజుల పాటు ప్రజలకు దూరంగా ఉంటున్నానని , అయినప్పటికీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. 28న ఖమ్మంకు చేరుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. రాజకీయాల్లో తాను నిత్యం విద్యార్ధిగానే ఉంటూ ప్రజా సంక్షేమానికి పాటు పడతానని చెప్పారు. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి ప్రజా సంక్షేమానికి పాటు పడతానని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు మందడపు సుధాకర్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కుర్రా భాస్కర్‌రావు, మాధవరావు, మెంటెం రామారావు, పిన్ని కోటేశ్వరరావు, మాటేటి నాగేశ్వరరావు, కమర్తపు మురళి, మద్దినేని వెంకటరమణ, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

MLA Ajay Kumar Comments on Parishad Elections