Thursday, April 25, 2024

తారాస్థాయికి చేరిన కాంగ్రెస్‌లో లుకలుకలు

- Advertisement -
- Advertisement -

MLA Jagga Reddy Fires On Revanth Reddy

టిపిసిసి చీఫ్ రేవంత్ తీరుపై
ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి
ఇది కాంగ్రెస్ పార్టీయా?
లేక ప్రైవట్ లిమిటెడ్ కంపెనీయా? అని ఘాటు వ్యాఖ్యలు
గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహాం

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు తారాస్థాయికి చేరాయని చెబుతున్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీ సీనియర్ నేతల మధ్య జగ్గారెడ్డి రేవంత్‌రెడ్డి తీరుపై ఆవేశంతో ఊగిపోయారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకుగాను శుక్రవారం సిఎల్పీ సమావేశానికి ముందు పార్టీ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగ్గారెడ్డి టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు మాసాల కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని జగ్డారెడ్డి ప్రశ్నించారు.

జహిరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ విషయంలో గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. సంగారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాకే సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. కనీసం ప్రోటోకాల్ పాటించాలి కదా? అని అడిగారు. సమాచారం ఇవ్వకుండా నాతో విభేదాలు ఉన్నట్లు రేవంత్ చెప్పాలని అనుకుంటున్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఏ ఒక్కరో హీరో కాలేరని ఆయన చెప్పారు. గత శనివారం నాడు జూమ్ మీటింగ్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు మాసాల కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి కొందరు సీనియర్లు హాజరు కాలేదు. అయితే సీనియర్లకు చెప్పకుండానే ఈ కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

‘నేను టిఆర్‌ఎస్‌లోకి వెళ్తానంటే ఎవరు అడ్డు చెప్తారు’

మరోవైపు మీడియా చిట్‌చాట్‌లోనూ రేవంత్‌పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టిఆర్‌ఎస్‌లోకి వెళ్తానంటే ఎవరు అడ్డు చెప్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ సభలో గీతారెడ్డికి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు. గీతారెడ్డిపై గౌరవముందని కానీ గజ్వేల్ సభలో అవమానం జరిగిందన్నారు. తాను కూడా రెండు లక్షల మందితో సభ పెట్టగలనని, రాష్ట్రంలో తనకు కూడా అభిమానులు ఉన్నారన్నారు. పార్టీ కోసం పనిచేసే తనకే అవమానాలు జరుగుతున్నాయని తెలిపారు. పార్టీలో మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టి మీడియాతో ఆవేదన తెలుపుకుంటున్నానని అన్నారు.

అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..!?

అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? అనే ప్రశ్న ఈ సందర్భంగా ఉదయించక మానదు. టిపిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీలో జోష్ అయితే వచ్చింది కానీ కొందరు సీనియర్ నేతలకు, రేవంత్‌కు మధ్య ఇప్పటికీ పొసగడం లేదు. ఇటీవల వామపక్ష పార్టీలతో అఖిలపక్ష సమావేశం పేరుతో రేవంత్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో పాటు, పోడు భూముల అంశంపై ఆందోళనకు దిగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గాంధీభవన్ వేదికగా ఈ మీటింగ్ జరిగింది. చాలా రోజుల తర్వాత లెఫ్ట్ పార్టీల నేతలు గాంధీభవన్ గడప తొక్కారు. భారత్‌బంద్‌తో పాటు పోడు భూముల సమస్యలపై పోరు సల్పడం ద్వారా ఆయా వర్గాలకు కాంగ్రెస్ దగ్గరవ్వాలని భావిస్తోంది. ఈ సమావేశం కొందరు సీనియర్ల నేతలలో రచ్చకు కారణమైంది. అఖిలపక్షం పేరుతో నిర్వహించిన ఈ సమావేశాన్ని సీనియర్ నేతలు తప్పుపడు తున్నారు. గాంధీభవన్‌లో జరిగిన ఈ భేటీపై తమకు కనీస సమాచారం లేదని గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

టిపిసిసి వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్‌లు అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో వున్నారు. ఇక ఇదే అంశం పై ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌కు కొందరు సీనియర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎప్పటికప్పడు పరిస్థితి గాడిన పడుతుందిలే అనుకుంటున్నప్పటికీ కాంగ్రెస్‌లో తీరు మారడం లేదు. ఎవరికి వారు తమదే పైచేయి అన్న భావనను అడపాదడపా వ్యక్తీక రిస్తున్నారు. ఏ సమావేశం జరిగినా అది తమకు అనుకూలంగా మలుచుకుంటూ టిపిసిసి చీఫ్ రేవంత్‌పై కొందరు సీనియర్లు తమ సహజ ధోర ణిలో అక్కసు వెళ్లగ్రక్కుతూనే ఉన్నారు. కాంగ్రెస్‌లో ఈ సహజ ధోరణికి పుల్‌స్టాప్ పడే విధంగా మరోవైపు రేవంత్ సీనియర్లతో కలిమిడికి చేస్తున్న ప్రయత్నాలు అంత ఆశాజనక ఫలితాలనివ్వడం లేదని జరుగుతున్న పరిస్థితులే చెబుతున్నాయి.

పైపెచ్చు.. రేవంత్ ఒంటెత్తుపోకడగా పోతున్నారని సీనియర్లు పదే పదే వ్యాఖ్యానిస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే. అది ఆ పార్టీకి కొన్ని సందర్భాల్లో మేలుని కలుగజేసినా ఎక్కువగా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందనే చెబుతున్నారు. రేవంత్ వచ్చినప్పట్నించీ వరుస కార్యక్రమాలకు రూపకల్పన చేయడం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు కొందరు సీనియర్లు ఇప్పటికీ హాజరు కాలేదు. మరోవైపు ప్రతి విషయంపైనా అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేస్తుండటం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నే..!!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News