రాష్ట్ర కేబినెట్‌లో నూతనంగా నియమితులైన మంత్రులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం దక్కాలని కోరుకుంటున్నానని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. తనకు రాజకీయాలు అంటే పదవులు, అధికారాలు కాదని, ప్రజల పట్ల తన నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల తన కలలే తనకు ప్రేరణగా నిలిచాయన్నారు. ఈ కారణంతోనే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చానని ఆయన తెలిపారు. ఈరోజు తాను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో,
వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో తాను ఎప్పటికీ ముందుంటానన్నారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదని, కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుందని, అదే మార్గాన్ని తాను ఎంచుకున్నానని ఆయన రాసుకొచ్చారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో అసహనానికి లోనైన ఆయన్ను పార్టీ పెద్దలు బుజ్జగించారు. దీంతో ఈ రోజు ఉదయం ఎవరూ ఉహించిన విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనూహ్యాంగా ఈ ట్వీట్ చేశారు.