Home తాజా వార్తలు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపట్టాలి

ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపట్టాలి

MLA KP vivekanand, MLC Shambipur raju meets Minister KTR

 

కుత్బుల్లాపూర్ : ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుని పనులు చేపట్టాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులు, ప్రతిపాదనలపై గురువారం మంత్రి కెటిఆర్‌తో హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్‌రాజులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ, ఎంఎల్సీలు మాట్లాడుతూ… భవిష్యత్‌లో ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా సుచిత్ర జంక్షన్ అభివృద్ధితో పాటు ఎన్‌హెచ్ 44 బోయిన్‌పల్లి నుంచి సుచిత్ర మీదుగా కొంపల్లి వరకు 10 కీలో మీటర్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.446.18 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనల్లో భాగంగా పనులు చేపట్టాలన్నారు.

సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని కెకె ఓనర్ సొసైటీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, నూతనంగా ఏర్పాటైన కాలనీలలో అసంపూర్తిగా ఉన్న ప్రాంతాలలో నీటి పైపులైన్లు మెరుగుపరిచేందుకు రూ.15 కోట్ల నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రోడ్డు వెడల్పు పనులు, జంక్షన్ల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్‌ఐఐసీ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. తన దృష్టికి తీసుకవచ్చిన ప్రతిపాదనలు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నగర శివారు పురపాలక ప్రాంతాలలో నీటి సమస్య పరిష్కారానికి అదనంగా రూ. 1200 కోట్లను సీఎం కెసిఆర్ ఇటీవల మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

MLA KP vivekanand, MLC Shambipur raju meets Minister KTR