Home సినిమా దర్శకుల హీరో కల్యాణ్‌రామ్

దర్శకుల హీరో కల్యాణ్‌రామ్

kajal

నందమూరి కల్యాణ్‌రామ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంఎల్‌ఎ’. టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ “కథను నమ్ముకుని సినిమాలు తీసే నిర్మాతలంటే నాకు ఎంతో ఇష్టం. అటువంటి వారిలో  ఈ నిర్మాతలు ముందుంటారు. ఈ సినిమాలో దర్శకుడు ఉపేంద్ర నన్ను కొత్తగా చూపించాడు. కొత్త దర్శకుడిని గైడ్ చేయాల్సిన బాధ్యత సినిమాటోగ్రాఫర్‌ది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ది భార్య భర్తల సంబంధం. నేను కలిసి పనిచేసిన కెమెరామెన్‌లలో బెస్ట్ ప్రసాద్ మూరెళ్ల. రవికిషన్ నాకు దేవుడిచ్చిన అన్నయ్యలాగా దొరికారు. ఆయన భోజ్‌పురిలో సూపర్‌స్టార్. 500 సినిమాలు చేసిన ఆయన ఇంకా ఏదో నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆయనను చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. ఇక కాజల్ అగర్వాల్‌తో నేను చేసిన రెండో సినిమా ఇది. నా హృదయానికి దగ్గరైన సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది”అని అన్నారు. అల్లరి నరేశ్ మాట్లాడుతూ “కల్యాణ్‌కి ‘ఎంఎల్‌ఎ’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. కొత్త దర్శకుడు అయినప్పటికీ ఉపేంద్ర ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. మణిశర్మ పాటలు ఎంతో బావున్నాయి”అని తెలిపారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ “నేను, ఉపేంద్ర కలిసి పనిచేశాం. తను మంచి టైమింగ్ ఉన్న డైరెక్టర్. కాజల్ చిత్ర పరిశ్రమలో 12 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. తను ఇంకా మరిన్ని మంచి సినిమాల్లో నటించాలి. మంచి లక్షణాలున్న అబ్బాయికి కల్యాణ్‌రామ్ మంచి ఉదాహరణ. ఆయన భవిష్యత్‌లో గొప్ప సినిమాలు చేయాలి”అని చెప్పారు. దర్శకుడు ఉపేంద్ర మాట్లాడుతూ “దర్శకుల హీరో కల్యాణ్‌రామ్. ఏమీ తినకుండా ఆయన 16 గంటల పాటు ఉండేవారు. దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మణిశర్మ మంచి మ్యూజిక్‌నిచ్చారు”అని పేర్కొన్నారు. నిర్మాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ “నేనే రాజు నేనే మంత్రి సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడు ఉపేంద్ర నాకు ఈ కథ  చెప్పారు. థ్రిల్లింగ్‌గా కథను కళ్లకు కట్టినట్లు చెప్పడం జరిగింది. కథ విన్న కల్యాణ్‌రామ్ ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. కాజల్ వంటి లక్కీ హీరోయిన్‌తో మరోసారి చేసిన సినిమా ఇది. శుక్రవారం ఈ సినిమా విడుదలకానుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, డి.సురేశ్‌బాబు, జెమిని కిరణ్, శ్రీనువైట్ల, టి.జి.విశ్వప్రసాద్, వి.ఎన్.ఆదిత్య, ఎం.ఎల్.కుమార్ చౌదరి, ఎన్.శంకర్, కోన వెంకట్, రవికిషన్, పృథ్వీ, రామజోగయ్యశాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.