Home తాజా వార్తలు సిఎం కెసిఆర్ మంచోడు…

సిఎం కెసిఆర్ మంచోడు…

MLC-Jeevan-Reddyఉద్యమంతో తెలంగాణ సాధించిండు,  ధర్మారంలోని కాంగ్రెస్ నిరసన దీక్షలో ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ధర్మారం: సిఎం కేసీఆర్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు కురిపించే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఆసక్తికర వ్యాఖ్యలు పలికారు. సిఎం కేసీఆర్ మంచోడు.. తెలంగాణ తెచ్చాడు.. ఉద్యమ స్ఫూర్తితో సాధించాడంటూ మెచ్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని భూములకు ఎల్లంపల్లి నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షచేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవన్‌రెడ్డి తన ప్రసంగంలో సిఎం కేసీఆర్ మంచితనాన్ని పొగడ్తలతో ముంచెత్తుతూ కాళేశ్వరానికి జాతీయ హోదాపై ప్రశ్నించారు.

కాళేశ్వరం నిర్మా ణంతో 60వేల కోట్ల అప్పులభారం తెలంగాణలోని ప్రజలపై పడిందని, కేంద్రం మాత్రం తమకు ఓ ఉత్తరం మినహా ఎలాంటి సమాచారం లేదని సాక్షాత్తూ కేంద్ర మంత్రి కటారియా ప్రకటించడం విడ్డూరమని జీవన్‌రెడ్డి అన్నారు. జాతీయ హోదా వస్తే 60 శాతం నిధులు అందుతాయని, సిఎం కేసీఆర్‌తోపాటు ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని జీవన్‌రెడ్డి సూచించారు. ఎల్లంపల్లినుండి ఇప్పటికీ పది టిఎంసిల నీరు మిడ్‌మానేరుకు తరలిందని, కేవలం 9 టిఎంసిలే నిల్వ ఉందని, మంత్రి ఈశ్వర్ ప్రత్యేక చొరవచూపి ధర్మపురి నియోజకవర్గానికే అందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, మాజీ మార్కెట్ ఛైర్మన్ చుక్క శంకర్‌రావు, మాజీ వైస్ ఛైర్మన్ పాలకుర్తి రాజేశం గౌడ్, పట్టణ అధ్యక్షులు సోగాల తిరుపతి, నాయకులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, బద్దం అజయ్‌పాల్‌రెడ్డి, జనార్ధన్, కరేటి వేణు, ఆవుల వేణు పాల్గొన్నారు.

MLC Jeevan Reddy interesting comments on CM KCR