Thursday, April 25, 2024

ఇడి నోటీసులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎక్కడో ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ తెలుగ రాష్ట్రాల్లో పెను ప్రకంపనం సృష్టిస్తోంది. ఇప్పటికే సిబిఐ విచారణకు హాజరైన కవితకు ఇప్పుడు ఇడి కూడా నోటీసులు ఇవ్వడంతో ఏం జరగబోతుంది? అన్న ఉత్కంఠ తెలుగు ప్రజల్లో నెలకొంది. తమ ఎదుట హాజరు కావాలని ఇడి నోటీసులు జారీ అయిన అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సంప్రదించేందుకు ఎంఎల్‌సి కవిత ప్రగతి భవన్‌కు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఆమె నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. అంతకు ముందు ఎంఎల్‌సి కవితతో కెసిఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లుగా బిఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందాల్సిన పని లేదని, మహిళా రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటాన్ని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాను యధావిధిగా కొనసాగించాలని కెసిఆర్.. కవితకు సూచించినట్లుగా బిఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

భారతీయ జనతా పార్టీ ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడుదామని, భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని కెసిఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కెసిఆర్‌తో మాట్లాడిన తర్వాత కవిత ఢిల్లీ బయలుదేరారు. రాజకీయ రంగంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్ తో ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది . ఈ దీక్ష కోసమే కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముందుగా నిర్ణయించుకున్నట్లుగా జంతర్ మంతర్‌లో ధర్నా ఉన్నందున మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఇడి జారీ చేసిన నోటీసుల విషయంలో కవిత రిక్వెస్ట్ లెటర్ పంపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల్ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీ విషయంలో మార్పు కోరారు.

పదిహేనో తేదీ తర్వాత తాను విచారణకు హాజరవుతానని లేఖలో కోరారు. దీనిపై ఇడి ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఇడి స్పందించకపోతే కవిత విచారణకు హాజరయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. విచారణకు సహకరించడం లేదని ఇడి ఆరోపిస్తే కేసు క్లిష్టంగా మారుతుంది. అయితే ఇడి స్పందించి.. గడువు ఇస్తే.. మహిళా రిజర్వేషన్ల అంశంపై ధర్నా తర్వాత ఇడి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేయడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. లిక్కర్ స్కాం కేసులో సిసోడియా తర్వాత అరెస్ట్ కాబోయేది కవితేనంటూ బీజేపీ నేతలు గత కొద్దిరోజులుగా మీడియా ముందు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కవితకు సన్నిహితుడిగా చెబుతున్న అరుణ్ రామచంద్రపిళ్లైని ఇడి అరెస్ట్ చేసింది.

అప్పుడు కూడా కవిత పేరును రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించింది. అయితే న్యాయ నిపుణుల సలహా మేరకే కవిత ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. విచారణకు ఇడి సమయం ఇవ్వకపోతే హాజరుకావడానికి అందుబాటులో ఉండాలని న్యాయ నిపుణులు సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే కవిత ప్రగతి భవన్‌కు కాకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. ఢిల్లీలో ల్యాండైన తర్వాతే కవిత ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి.
’కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదు’
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఇడి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ నెల 10న దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం ఉందని, అందువల్ల విచారణకు హాజరయ్యే తేదీలపై న్యాయ సలహా తీసుకుంటానని కవిత తెలిపారు. మరోవైపు కేంద్రంలో ఉన్న ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి కెసిఆర్, బీఆర్‌ఎస్, తెలంగాణ సమాజం ఎన్నటికీ తలవంచదని ట్వీట్ చేశారు.
దిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గతంలో సిబిఐ తనను ఏడు గంటలు విచారిం చింది. తాజాగా ఈ నెల 9వతేదీన విచారణకు హాజరుకావాలని కవితకు ఇడి నోటీసులు జారీ చేసింది. ఇదే విషయంపై కవిత వివరణ ఇచ్చారు. ఇడి విచారణకు తాను సహకరిస్తానని ఎంఎల్‌సి కవిత తెలిపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని, ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం ఉండడంతో విచారణకు హాజరయ్యే తేదీ మార్పు గురించి న్యాయ నిపుణులతో చర్చించి సలహా తీసుకుంటానని చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నదే తమ డిమాండ్ అని కవిత పేర్కొన్నారు.

అందుకే ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఒకరోజు నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని అన్నారు. ఈక్రమంలో ఈ నెల 9న దిల్లీలో విచారణకు హాజరు కావాలని ఇడి తనకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని, కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్‌లు రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలతో బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో సిఎం కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కుదరదని ఈ విషయం బిజెపి పార్టీకి తెలుసని అన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పుడూ ఎండగడుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

దేశ అభ్యున్నతి కోసం అవసరమైన ప్రతిసారి గొంతెత్తుతామని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని తేల్చి చెప్పారు. ప్రజల హక్కుల గురించి నిరంతరం పోరాడతామని తెలిపారు.
సిబిఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి యాక్షన్..పిళ్లై రిమాండ్ రిపోర్టులో సంచలన వ్యాఖ్యలు
ఆర్థిక అవకతవకల కోణంలో ఇడి దర్యాప్తు చేస్తుందని తెలిసిందే. ఈసీఐఆర్ ఫైల్ చేసి ఇడి రంగంలోకి దిగుతుంది. ఈసీఐఆర్ ఫైల్ చేయడానికి ఇడి గతేడాది సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారం చేసుకుంది. గతేడాది ఆగస్టులో సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఆధా రంగా చేసుకునే ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును ఫైల్ చేసింది. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో ఐపిసి సెక్షన్లు 477ఏ, 120బీ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 కింద ఎంఎల్‌సి కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు పంపినట్టు ఉన్నది. గతేడాది డిసెంబర్‌లో సిఆర్‌పిసి 160 కింద నోటీసులు జారీ చేసి సిబిఐ ప్రశ్నించింది. ఇప్పుడు సిబిఐ ఎఫ్‌ఐఆర్‌కు తోడు అరుణ్ రామచంద్ర పిళ్లై స్టేట్‌మెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు దర్యాప్తులో ఉపకరించనుంది. ఇదిలా ఉండగా అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఇడి సంచలన విషయాలను పేర్కొంది. పిళ్లైను స్పష్టం గా కవితకు బినామీ అని తెలిపింది. ఎంఎల్‌సి కవిత ప్రయోజనాలు కాపాడటానికే ఆయన సౌత్ గ్రూప్‌లో ఉన్నాడని ఆరోపించింది. లిక్కర్ బిజినెస్‌లో 12 శాతం లాభం ఉండేలా లిక్కర్ పాలసీని రూపొందించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

అందులో 6 శాతం సొమ్ము ఆమ్ ఆద్మీ పార్టీకి చెరేలా డీల్ కుదుర్చుకున్నారని, ఇండో స్పిరిట్, బ్రిండ్ కో, మహదేవ్ లిక్కర్స్ ఈ మూడు కంపెనీల్లో ఏటా రూ. 3,500 కోట్ల బిజినెస్ నడుస్తున్నదని తెలిపింది. వీటికి ఆ 12 శాతం లాభాల కింద యేటా రూ. 400 కోట్లు ఆర్జించాయని, అందులో 210 కోట్లు డీల్ ప్రకారం ఆప్‌కు, పిళ్లై టీమ్‌కు రూ. 296.2 కోట్లు వెళ్లాయని పేర్కొంది. అలా వచ్చిన ముడుపులతో ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపించింది. కల్వకుంట్ల కవిత ప్రయోజనాల కోసం పిళ్లై పని చేశారని పేర్కొంది.
ఎవరెవరు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు..?
01. సెప్టెంబర్- 28 న సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని
02. నవంబర్- 11న పి. శరత్ చంద్రారెడ్డి, అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్
03. నవంబర్- 11న బినొయ్ బాబు, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీ
4. నవంబర్- 13న అభిషేక్ బోయినపల్లి
5. నవంబర్- 13న విజయ్ నాయర్
6. నవంబర్- 29న అమిత్ అరోరా, బడ్డీ రిటెయిల్ సంస్థ డైరక్టర్
7. ఫిబ్రవరి- 8న గౌతమ్ మల్హోత్రా
8. ఫిబ్రవరి- 9న రాజేష్ జోషి, చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
9. ఫిబ్రవరి-11న మాగుంట రాఘవ
10. మార్చి- 2న అమన్ దీప్ దల్ సింగ్
11. మార్చి-6న అరుణ్ రామచంద్ర పిళ్ళై
ఈ ఏడాదిలో ఇలా…!
జనవరి 06 2023న స్పెషల్ కోర్టులో రెండో చార్జిషీట్‌ను దాఖలు చేసిన ఇడి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించి సమీర్ మహేంద్రుతో మాట్లాడినట్లు తేలింది..
ఫిబ్రవరి 25న సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, దినేష్ అరోరా, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, అమిత్ అరోరా తదితరులను ఆస్తులను జప్తు చేసిన ఇడి.
ఫిబ్రవరి 26న ఢిల్లీలో హైడ్రామా. మనీష్ సిసోడియాను 8 గంటలపాటు హెడ్ క్వార్టర్స్‌లో సుదీర్ఘంగా విచారించిన సిబిఐ. అదే రోజు సాయంత్రానికి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన.
పాలసీ ఎలా వచ్చింది..?
సెప్టెంబర్ 4, 2020 న కొత్త లిక్కర్ పాలసీ తయారీ కోసం ఎక్సైజ్ కమినర్ నేతృత్వంలోని కమిటీకి డిప్యూటీ సిఎం ఆదేశాలు.
జనవరి 5, 2021న లిక్కర్ పాలసీపై సిఎం కేజ్రీవాల్ అధ్యక్షతన కేబినెట్ భేటీ. సిసోడియా, సత్యేంద్రజైన్, కైలాశ్ గెహ్లాట్‌తో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటుకు నిర్ణయం.
మార్చి 22, 2021న రెండు నెలల తర్వాత నివేదికను సిద్ధం చేసిన కమిటీ. కేబినెట్ మీటింగ్‌లో సమర్పించడంతో దీని ప్రకారమే 2021-22 పాలసీ తయారు చేయాలని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు కీలక ఆదేశాలు.
:- మే 21, 2021న కొత్త లిక్కర్ పాలసీకి కేజ్రీవాల్ కేబినెట్ ఆమోదం
ఇక్కడ్నుంచే అసలు కథ మొదలు..
నవంబర్ 8, 2021న ఫారిన్ లిక్కర్ ధరల విషయంలో సంబంధిత అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుందని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా ఆరోపణ.
జులై 20, 2022న పాలసీలో అన్నీ అవకతవకలు ఉన్నాయని ఇదంతా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేంచేలా నిర్ణయాలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ.
జులై 22, 2022న లేఖ పరిగణనలోనికి తీసుకుని సిబిఐ దర్యాప్తునకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు.
ఆగస్టు 19, 2022న 15 పేర్లతో సిబిఐ ఎఫ్‌ఐఆర్ ఇదే రోజు డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు 25 చోట్ల సోదాలు.
ఆగస్టు 22 న ఇడి ఎంట్రీ, కేసు ఫైల్
సెప్టెంబర్ 6న లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌లో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైకు చెందిన రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలు, నివాసంపైనా మొత్తం ఆరుచోట్ల ఇడి సోదాలు
సెప్టెంబర్ 17న గోరంట్ల బుచ్చిబాబు నివాసం, ఆఫీసులో ఇడి సోదాలు
సెప్టెంబర్ 22న మనీలాండరింగ్ ఆరోపణలపై అరబిందో ఫర్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డినిపై ఇడి ప్రశ్నల వర్షం.
అక్టోబర్ 7న ముత్తా గౌతమ్ విచారణ, సంబంధింత ఆఫీసుల్లో సోదాలు
అక్టోబర్ 10న లిక్కర్ స్కామ్‌లో సంబంధాలున్నాయని బోయిన్‌పల్లి అభిషేక్‌ను అదుపులోనికి తీసుకున్న సిబిఐ, అదే రోజు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన.
అక్టోబరు 17న డిప్యూటీ సీఎం సిసోడియాను ప్రశ్నించిన సిబిఐ అధికారులు
నవంబరు 10న అరబిందో ఫార్మా శరత్‌చంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
నవంబరు 14న ఆప్‌కు చెందిన విజయ్ నాయర్, బోయిన్‌పల్లి అభిషేక్ అరెస్ట్
నవంబరు 16న దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారడానికి ప్రత్యేక కోర్టు అనుమతి.
నవంబర్ 25న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో తొలి చార్జిషీట్‌ను మొత్తం 10 వేల పేజీలతో సమర్పించిన సిబిఐ.
నవంబరు 26న లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఉల్లంఘనల ఆరోపణలపై ఇడి మొదటి చార్జిషీట్ ఫైల్.
నవంబరు 29న సౌత్ గ్రూపు కీలక పాత్ర పోషించినట్లు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఇడి.
నవంబర్ 29న తొలిసారి వెలుగులోకి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పేరు.. రెండు వేర్వేరు నెంబర్లతో మొత్తం పది మొబైల్ ఫోన్లను మార్చారని డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు
డిసెంబరు 6న విచారణకు రావాలని కవితకు సిబిఐ నోటీసు.
డిసెంబరు 11న కొన్ని అనివార్య కారణాలతో సిబిఐ విచారణకు హాజరుకాని కవిత అదే రోజున సిఆర్‌పిసి 191 కింద మరో నోటీసు జారీ.
డిసెంబర్ 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు కవిత నివాసంలోనే 6గంటలపాటు సిబిఐ విచారణ. సిబిఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని మీడియాకు వివరణ.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News